Nizamabad MP

వీఆర్‌ఏల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..

గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్‌ఏ) సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటానని వీఆర్‌ఏలకు తెలిపారు. సమస్యల పరిష్కారానికి గత నెల 26 నుంచి చేస్తున్న సమ్మె చేస్తున్నట్లు, తమ సమస్యలను పరిష్కారించాలని ఎంపీ కవితను తెలంగాణ వీఆర్‌ఏ(డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. సమస్యల పరిష్కారానికి ఎంపీ కవిత హామీ ఇచ్చారని, దాంతో సమ్మెను విరమిస్తున్నట్లుగా సంఘ ప్రతినిధులు ప్రకటించారు.

Kalvakuntla Kavitha addressing in VRA's Meeting
-ఎంపీ కవిత హామీతో వీఆర్‌ఏల సమ్మె విరమణ
-నేటి నుంచి విధులకు హాజరవుతాం
-అసోసియేషన్ ప్రతినిధుల ప్రకటన
తెలంగాణ జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన ఏఆర్‌ఏలను ఉద్దేశించి గురువారం తెలంగాణభవన్‌లో ఆమె ప్రసంగించారు. వీఆర్‌ఏల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందన్నారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు తాను అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. మహిళా వీఆర్‌ఏలకు మెటర్నిటి సెలవులు మంజూరు చేసే విధంగా త్వరలోనే ఆదేశాలు జారీ అయ్యేందుకు కృషి చేస్తానన్నారు. ఇప్పటికే దీనిపై ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో వేతన స్కేల్, మూడేండ్ల సర్వీసు ఉన్న వారికి పదోన్నతులు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. సీఎం కేసీఆర్ లేట్‌గా వచ్చినా, లేటెస్ట్‌గా వస్తారు..సీఎం కేసీఆర్ లేట్‌గా వచ్చినా.. లేటెస్ట్‌గా వస్తారు.

వీఆర్‌ఏల సమస్య పరిష్కారానికి అన్నిరకాలుగా అలోచించి నిర్ణయం తీసుకుంటారు.. దీనికి కొద్దిగా సమయం తీసుకున్నా.. ఓసారి నిర్ణయం తీసుకున్నాక.. ఎన్ని రకాల ఒత్తిళ్లు వచ్చిన వెనుకగుడుగు వేసే ప్రసక్తే ఉండదు అని అని ఎంపీ కవిత అన్నారు. గ్రామస్థాయిలో ప్రతి పనిని చేయాల్సింది వీఆర్‌ఏలేనని… ప్రభుత్వం, తనపై నమ్మకం ఉంచి సమ్మెను విరమించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఎలాంటి సాయం చేయకున్నా, అంగన్‌వాడీల పనిభారాన్ని దృష్టిలో పెట్టుకొని వేతనాలను భారీగా పెంచిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అస్తవ్యస్త పాలనతో ప్రతిశాఖలోనూ అనేక సమస్యలు తలెత్తాయని.. ప్రభుత్వం వాటన్నింటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్నదని అన్నారు.

సమైక్యపాలనలో సీఎం పోస్టు మినహా అన్నీ అవుట్‌సోర్సింగ్‌కే ఆంధ్ర పాలకులు సీఎం పోస్టు మినహా ప్రతి ఉద్యోగాన్ని కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేశారని ఎంపీ కవిత ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో అలాంటి విధానం ఉండదని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారని తెలిపారు. సీఎం కేసీఆర్‌కు వీఆర్‌ఏ సంఘ ప్రతినిధులను త్వరలో కలిపిస్తానని, సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి నేరుగా తీసుకెళ్లె విధంగా చేస్తానన్నారు. టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో ప్రతీ పని చేసే ఏఆర్‌ఏలకు సరియైన గౌరవం, వేతనం లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేశారు.

వీఆర్‌ఏ (డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) సంఘ అధ్యక్షుడు రమేశ్ బహుదూర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాత పరీక్ష ఆధారంగా ఎంపికయ్యామని.. తమలో చాలా మంది విద్యాధికులేనని వారికి పదోన్నతులు కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి, వీఆర్‌ఏ సంఘం ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వర్, గౌరవాధ్యక్షుడు సునీల్ గవాస్కర్, అసోసియేట్ అధ్యక్షుడు శివరాం, వెంకటేశం, అశోక్, ఈశ్వర్, ముత్యాలు, చిన్నారెడ్డి, లక్ష్మి, బాలమణి, ప్రతిభ తదితరులు పాల్గొన్నారు.


Connect with us

Latest Updates