-డెట్రాయిట్లో ప్రారంభించిన ఎంపీ కవిత
-ఎంపీ కవితను సన్మానించిన తెలుగు సంఘాలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన తెలంగాణ జాగృతి ఖండాంతరాల్లోనూ తన శాఖలను విస్తృతం చేసుకుంటున్నది. రాష్ట్ర పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణ జాగృతి తాజాగా ఉత్తర అమెరికా శాఖను కూడా ఏర్పాటు చేసుకున్నది. ఈ మేరకు అమెరికా డెట్రాయిట్‌లోని ఫార్మింగ్టన్ హిల్స్ మేనర్లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరై శాఖను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి అమరవీరులకు గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమరుల ఆశయాలను నిజం చేయడంతోపాటు బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అమెరికాలోని తెలంగాణ జాగృతి తెలంగాణ సమాజం, ప్రవాస భారతీయ సమాజానికి వారధిగా నిలవాలని ఆకాంక్షించారు. అమెరికాలోని తెలుగు సంస్థలు అందమైన పువ్వులైతే, వాటితో పేర్చిన అందమైన బతుకమ్మ జాగృతి అమెరికా శాఖ అని అభివర్ణించారు.
ఈ సందర్భంగా కవిత ఉత్తర అమెరికా శాఖ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. కార్యవర్గంలో శ్రీధర్ బండారు, సుమంత్ గరకరాజుల, మురళి బొమ్మనవేని, నర్సింగ్‌రాజ్ గౌలికర్, కిరణ్ గుంటిక, బిందులత, వెంకట్ మంథెన ఉన్నారు. భారీ సంఖ్యలో తెలంగాణ ఎన్నారైలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. స్వరాష్ట్రంలో తొలి మహిళా ఎంపీగా ఎన్నికవడంతోపాటు తెలంగాణ జాగృతికి మరోసారి అధ్యక్షురాలిగా ఎన్నికైన ఎంపీ కవితను అమెరికాలోని ప్రవాస తెలుగు సంఘాలైన డెట్రాయిట్ తెలంగాణ కమ్యూనిటీ, తానా, ఆటా, నాటా, నాట్స్, తెలంగాణ ఎన్నారై అసోసియేషన్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్రతినిధులు సన్మానించారు.