Nizamabad MP

ఉపాధి కల్పిద్దాం..

-నిత్యం మూడు లక్షల మందికి పని కల్పించడమే లక్ష్యం
-రూ. 150 నుంచి రూ. 180 వరకు కూలి
-పని దినాలు 100 రోజులకు పెరగాలి
-నీటి ఎద్దడి నివారణకు రూ. 47 కోట్లతో ప్రతిపాదనలు
-విజిలెన్స్- మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎంపీ కవిత

Kalvakuntla Kavitha
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవసాయ పనులు చేసుకునే అవకాశం లేదు. రైతులు, వ్యవసాయ కూలీలు, దినసరి కూలీలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ ఉపాధిహామీ పథకమే ప్రత్యామ్నాయంగా ఉంది. జిల్లాలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఉపాధిహామీలో పనులు కల్పించాలి. నామమాత్రపు కూలి కాకుండా రోజుకు రూ. 150 నుంచి రూ. 180 వరకు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. పనిదినాలు ప్రస్తుతం 40 రోజులే కల్పిస్తున్నారు. ఈ సంఖ్య కూడా 70 నుంచి 100 రోజులకు పెంచాలి. జిల్లాలో ప్రతి రోజూ కనీసం మూడు లక్షల మంది ఉపాధి పనులు చేసేలా ప్రణాళిక రూపొందించాలి. అని పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై మూడు నెలలకోసారి సమీక్షించే విజిలెన్స్- మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని ప్రగతిభవన్‌లో సోమవారం రాత్రి నిర్వహించారు. తాగు నీటి ఎద్దడిని గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఎంపీ కవిత సూచించగా రూ. 47 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు వివరించారు.

కరువుకు ప్రత్యామ్నాయంగా ఉపాధి పనులు పెంచాలని కవిత అన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్, ఎన్‌ఆర్‌ఈజీఎస్ తదితర శాఖల పురోగతిపై విజిలెన్స్- మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని ప్రగతి భవన్‌లో సోమవారం రాత్రి నిర్వహించారు. ఎంపీ కవిత, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, కమిటీ సభ్యులు రెండు గంటలపాటు చర్చలో పాల్గొన్నారు. రాత్రి 8.30 గంటలకు ప్రారంభమైన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం 10.30 గంటల వరకు కొనసాగింది. ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ నుంచి చేపట్టిన పథకాలు కొన్ని టెండరు దశలోనే ఉన్నాయని, గత సమావేశంలో చర్చించినప్పటికీ వాటిలో పురోగతిలేదని ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ అన్నారు. 17 పనులు టెండరు దశలో ఉన్నాయని, రెండోసారి టెండర్లు పిలిచి డిసెంబరు లోపు పూర్తిచేస్తామని కలెక్టర్ సమాధానం ఇచ్చారు.

న్యాలకల్ తాగునీటి పథకానికి రూ. 18 కోట్లు ఖర్చుచేశారని, 53 ఆవాసాలకు తాగునీటిని సరఫరా చేయాల్సి ఉండగా.. ఇంతవరకు ఒక్క గ్రామానికి కూడా చుక్కనీరు అందించలేదని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, వీజీగౌడ్‌లు ఎంపీ, కలెక్టర్ దృష్టికి తెచ్చారు. నిధులు ఖర్చుచేసినా ఉపయోగంలోకి రాలేదని విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని వారు డిమాండ్ చేశారు. నివేదిక తక్షణమే తెప్పించాలని ఎంపీ కవిత అధికారులను ఆదేశించారు. తాగునీటి పథకాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, గత సంవత్సరం నిర్వహించిన కాంట్రాక్టు ఏజెన్సీలకే మళ్లీ బాధ్యతలు అప్పగించారని, జీవోకు వ్యతిరేకంగా అధికారులు వ్యవహరిస్తున్నారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. ఇసుక మాఫియా తరహాలో వాటర్ మాఫియా తయారైందన్నారు. జడ్పీ చైర్మన్ రాజు, సీఈవో, ఎస్‌ఈల మధ్య ఏజెన్సీల అప్పగింత విషయమై తర్జనభర్జన జరిగింది. ఎంపీ కవిత జోక్యం చేసుకొని ఎవరికో కాంట్రాక్టర్లకు అప్పగించేకంటే గ్రామస్తులకే నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని ప్రతిపాదన పెట్టారు. ప్రజాప్రతినిధులు అందరూ అంగీకరిస్తే విలేజ్ మానిటరింగ్ సిస్టమ్‌కు అప్పగిస్తే నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉండదని, నిర్వహణ కూడా ప్రజల చేతుల్లో ఉంటుందని అన్నారు.

గ్రామజ్యోతి కమిటీలను కూడా భాగస్వామ్యం చేయాలన్నారు. ఈ ప్రతిపాదనకు అంతా అంగీకరించారు. పాఠశాలల్లో వేసిన బోర్లు వర్షాభావ పరిస్థితుల వల్ల ఎండిపోతున్నాయని ఎమ్మెల్సీ పి.సుధాకర్‌రెడ్డి అన్నారు. మరుగుదొడ్ల నిర్వహణ కోసం ప్రతి 100 మంది పిల్లలు ఉంటే ఒక స్కావెంజర్‌ను ఏర్పాటుచేసుకునేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని, ఈ నిబంధనను కాస్త సడలించాలని ఎంపీని కోరారు. 588 పాఠశాలలు జిల్లాలో తాగునీటి వసతిలేకుండా ఉన్నాయన్నారు. వాటన్నింటికి తాగునీటి వసతి కల్పించాలని కోరారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో గిరిజన తండాలు, గిరిజనులు ఎక్కువగా ఉన్నారని తాగునీటికి వారు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే గోవర్ధన్ అన్నారు. ప్రైవేటు బోర్లు, బావుల నుంచి గ్రామాల్లోకి పైపులైన్లు వేస్తే తాగునీటి సమస్య తీరుతుందని అన్నారు. తద్వారా రవాణా డబ్బులు మిగులుతాయని అన్నారు. ఈ ప్రతిపాదనకు కలెక్టర్ అంగీకరించారు. 14 ఆర్థిక సంఘం నిధులు రూ. 26 కోట్లు గ్రామపంచాయతీలకు వచ్చాయని వాటిని ఎక్కడెక్కడ ఎలా ఖర్చు చేశారో లెక్కలు చెప్పాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి కోరారు. డీపెనింగ్, ఫ్లష్షింగ్‌కు మొదటి ప్రాధాన్యం ఇస్తామని బోర్లు వేసినా నీరు పడుతుందన్న నమ్మకం లేదని కలెక్టర్ అన్నారు.

ఐదు నెలల నుంచి హైరింగ్ డబ్బులు రావడంలేదని ధర్పల్లి ఎంపీపీ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసిందని, డ్రైనేజీలు శుభ్రపరచడంలేదని, సర్పంచులు బాధ్యతగా వ్యవహరించకపోవడంతో ఎంపీలు, ఎమ్మెల్యేలను ప్రజలు అడుగుతున్నారని ఎంపీ కవిత అన్నారు. శానిటేషన్‌కు సంబంధించి గోడమీద పనుల వివరాలు రాయాలని ఎంపీ సూచించారు. సీఆర్‌ఎఫ్, నాన్‌సీఆర్‌ఎఫ్ నిధులతో చేసిన పనులను కూడా కొందరు సర్పంచులు బిల్లులు చేయించుకుంటున్నారని, ఇంజినీర్లు బిల్లులు చేస్తున్నారని, పాత పనులకు బిల్లులు తీసుకోవడం అన్యాయమని ఎమ్మెల్యే బాజిరెడ్డి అన్నారు. గ్రామపంచాయతీ పన్నులు కూడా వసూలు చేయడంలేదని, 100 శాతం వసూలు చేయాలని కోరారు. ఇందుకు గ్రామాల్లో అందుబాటులో ఉండే సిబ్బందిని వినియోగించుకోవాలని అన్నారు. డ్రైనేజీల నుంచి పైపులైన్లు వేసి మ్యాజిక్ ఫిట్‌కు తరలించే ఏర్పాట్లను జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా చేయాలని ఎంపీ సూచించారు. ఫీల్డు అసిస్టెంట్లు గ్రామాల్లో అవగాహణలేమితో ఉన్నారని, ఊరికి ఉపయోగపడే పనులు చేయనివ్వడంలేదని ఎంపీ కవిత అన్నారు. ఉపాధిహామీ సిబ్బందికి త్వరలో శిక్షణ ఏర్పాటుచేయాలని సూచించారు. నియోజకవర్గాల వారిగా శిక్షణ శిబిరాలు ఏర్పాటుచేస్తామని కలెక్టర్, పీడీ హామీఇచ్చారు.

మాస్టర్‌రోల్స్‌ను గ్రామపంచాయతీ గోడలపై ప్రదర్శించాలని సభ్యులు కోరారు. పీఎంజీఎస్‌వైలో చేపట్టిన రోడ్లు నాణ్యతతో లేవని, పనులు చేయకుండా జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడంలేదని ప్రజాప్రతినిధులు అంశాన్ని లేవనెత్తారు. పనులు సక్రమంగా చేయని వారికి జరిమానా వేస్తున్నామని, ఖండేబల్లూర్ రోడ్డు చేసిన కాంట్రాక్టరుకు రూ. 5 వేలు జరిమానా వేశామని ఇంజినీర్లు చెప్పడంతో… ఎంపీ కవిత, కలెక్టర్ సహా సమావేశ మందిరంలో ఉన్నవారంతా నవ్వారు. రూ. 8 కోట్ల విలువైన రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌కు రూ. 5 వేలు జరిమానా వేస్తే ఏం ఉపయోగం ఉంటుందని ప్రశ్నించారు. గణేశ్ చందా రాసినట్లు జరిమానాలు వేస్తే కంట్రాక్టర్లపై ఒత్తిడి ఏముంటుందని అధికారులను ప్రశ్నింంచారు. పనికి తగినట్లుగా ఎక్కువ మొత్తంలో జరిమానా వేస్తే కాంట్రాక్టర్ కాస్త భయంతో పనిచేసే అవకాశం ఉంటుందని ఎంపీ కవిత అన్నారు. కొన్ని పనుల అంచనాలు అసాధారణంగా పెరిగాయని వాటిని పరిశీలించాలని ఎమ్మెల్యే షిండే అన్నారు. సమావేశంలో పలు అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

డిసెంబరు 5న మళ్లీ సమావేశం
విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని ప్రతి మూడు నెలలకోసారి నిర్వహిస్తారు. ప్రత్యేకమైన పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా డిసెంబరు నెల ఐదో తేదీన మళ్లీ సమావేశాన్ని నిర్వహించాలని ఎంపీ, కలెక్టర్ నిర్ణయించారు. ప్రధానమైన మూడు ఎజెండా అంశాలతోనే ఈ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఉపాధిహామీ పథకం పురోగతి, ఆర్‌డబ్ల్యూఎస్, 14 వ ఆర్థికసంఘం నిధుల వినియోగంపై రాబోయే సమావేశంలో పూర్తిస్థాయిలో సమీక్ష చేస్తామని తెలిపారు.

ట్రైనింగ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలి
ఎస్‌ఎస్‌ఏ, ఆర్‌ఎంఎస్‌ఏ పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం విద్యారంగానికి నిధులు కేటాయిస్తున్నదని, కొన్ని మార్పులు, చేర్పులు చేయకపోవడంతో రెండో దశ, మూడో దశ నిధులు మంజూరుకాలేదని ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి అన్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నప్పటికీ వాటిద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండడంలేదని అన్నా రు. 30 ఏండ్లలో ఒక్క ఉపాధ్యాయుడిలో కూడా స్పష్టమైన మార్పును తాను చూడలేదని అన్నారు. శిక్షణలో నాణ్యత పెరగడాడానికి దేశంలో ఎక్కడాలేని విధంగా నిజామాబాద్‌లో రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ క్లస్టర్ ను ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు అనుగుణంగా తయారుచేసిన ప్రాజెక్టు రిపోర్టును ఆయన ఎంపీ కవితకు అందజేశారు.


Connect with us

Latest Updates