Nizamabad MP

తండాలను పంచాయతీలుగా మారుస్తం

-గ్రామాల్లో అరవై ఏండ్లుగా సమస్యలు..
వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం
- మన ఊరు-మన ఎంపీలో ఎంపీ కల్వకుంట్ల కవిత

Kalvakuntla Kavitha takes part in Mana Ooru Mana MP programme at Jagtial constituency

సమైక్యరాష్ట్రంగా ఉన్నప్పుడు అరవై ఏండ్లపాటు సమస్యలు పేరుకుపోయాయి. ఒక్క ఏడాదిలో పరిష్కారం కావు, వీలైనంత త్వరగా పరిష్కరిస్తూ పోతున్నాం. కరీంనగర్ జిల్లాలో అటవీప్రాంతంలో ఉన్న సారంగాపూర్ మండలంలో అనేక గిరిజన తండాల్లో కనీస సౌకర్యాలు లేవు. ఐదు వందల జనాభా ఉన్న తండాలను పంచాయతీలుగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. సీఎం కేసీఆర్ గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చే విషయమై కమిటీ వేశారు. నివేదిక అందగానే తండాలను పంచాయతీలుగా ప్రకటిస్తారు అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.

మన ఊరు-మన ఎంపీ కార్యక్రమంలో భాగంగా మూడో రోజైన బుధవారం సారంగాపూర్ మండలం రేచపల్లి, సారంగాపూర్, బట్టపెల్లి పోతారం గ్రామాల్లో ఎంపీ పాదయాత్ర నిర్వహించారు. రేచపల్లితోపాటు అనుబంధంగా ఉన్న ఏడు గిరిజన తండాల్లో నెలకొన్న సమస్యలను స్వయంగా పరిశీలించారు. తర్వాత రేచపల్లి గ్రామసభలో ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఉమ్మడిరాష్ట్రంలో ప్రభుత్వాలు ఇరవై ఏండ్లుగా సాధించని జగిత్యాల-నిజామాబాద్ రైల్వేలైన్‌కు ఏడాదిలోనే రూ.140 కోట్లు సాధించామని చెప్పారు. మూడు రోజులుగా కొనసాగుతున్న మన ఊరు-మన ఎంపీలో గ్రామాల్లోని సమస్యలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయన్నారు.

రేచపల్లిలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జగన్నాథస్వామి ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించేలా చూస్తానన్నారు. జూనియర్ కళాశాలలో బెంచీల కోసం డబ్బులను అందజేశారు. బస్సు సౌకర్యం లేక విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని గ్రహించి, టీఎస్ ఆర్టీసీ జేఎండీ రమణారావుతో ఫోన్‌లో మాట్లాడి జగిత్యాల నియోజకవర్గంలోని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. తర్వాత రోళ్లవాగు ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం బీర్‌పూర్‌లో బస చేశారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, పుట్ట మధు, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ సంజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Connect with us

Latest Updates