Nizamabad MP

తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ బిడ్డల్ని కడుపులో పెట్టి కాపాడుకుంటది: ఎంపీ కల్వకుంట్ల కవిత

తెలంగాణ తెచ్చుకున్నదే మన కష్టాలను దూరం చేసుకోడానికని, సమైక్య పాలనలో మొదలైన వలసలు ఇకనైనా ఆగాలని ఎంపీ కవిత అన్నారు. దుబాయిలో నేడు జరిగిన “ఫ్రెండ్స్ ఆఫ్ టీఆరెస్” కార్యక్రమానికి శ్రీమతి కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి శాఖల్ని విదేశాల్లోనూ ప్రారంభిస్తున్నామని అన్నారు. ఇప్పటికే వివిధ దేశాల్లో ఉన్న తెరాస శాఖలకు తోడుగా ఇప్పుడు గల్ఫ్ లోనూ శాఖను ప్రారంభిస్తున్నామన్నారు. గల్ఫ్ వలస కార్మికుల కష్టాలు తెలిసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ఒకే ఒక పార్టీ టీఆర్ఎస్ అని ఎంపీ కవిత పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఫలాలు గల్ఫ్ కార్మికులకు దక్కాలని, అదే టీఆర్ఎస్ లక్ష్యమని కవిత అన్నారు. ఇవాళ గల్ఫ్ దేశాల్లోని ప్రవాస తెలంగాణీయుల వెతలు తమకు తెలుసని, వాటికి నివారణ చర్యలకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలిపారు. వలస కార్మికుల అగచాట్లు తీర్చడానికి భారత ఎంబసీలో తెలుగు మాట్లాడగల అధికారులను అందుబాటులో ఉంచాలని ఇప్పటికే టీఆర్ఎస్ ఎంపీలు విదేశాంగ మంత్రి శ్రీమతి సుష్మాస్వరాజ్ ను కోరిన విషయాన్ని కవిత గుర్తు చేశారు. మిగతా పథకాలకు లబ్దిదారుల వివరాలను సేకరించడం సులువని, కానీ గల్ఫ్ కార్మికులకు ఈ పథకాలు అందాలంటే ఉన్న సాంకేతిక అవరోధాలను తొలగించేందుకు ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. కార్మికులకు ఇన్సూరెన్స్ అందించే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉందని, లబ్దిదారుల వివరాల సేకరణ కోసం ప్రభుత్వ అధికారుల బృందాన్ని దుబాయి పంపే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం ముందు ఉంచుతామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.

పుట్టిన గడ్డకు దూరంగా ఉన్నప్పటికీ ఇక్కడి కుటుంబాలు మన సంస్కృతిని కాపాడుకోవడం హర్షనీయమన్నారు. ప్రతి యేడు బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్యన యూఏఈ లో కన్నులపండుగగా జరగడం అభినందనీయమన్నారు.

అంతకు ముందు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత దుబాయి లోని సోనాపూర్ క్యాంపు లోని తెలంగాణ వలస కార్మికులను కలిసి మాట్లాడారు. దుబాయి కార్మికుల కష్టాలను తెలుసుకున్న ఎంపీ కవిత వారి సూచనలు తెలుసుకున్నారు. అరవయ్యేండ్ల వలసపాలన తాలూకు చేదు గుర్తులుగా వలస కార్మికులు మిగిలారని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ ప్రభుత్వం తరహాలో కార్మికుల సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవి, గాయకుడు శ్రీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎడారిలో మెతుకులేరుకోడానికి వెళ్లిన బిడ్డల్ని కాపాడుకోడానికి తెలంగాణ ఉద్యమం నడుంబిగించిందన్నారు. తెలంగాణ బిడ్డలు ఏదేశాన ఉన్నా ఒకరికి ఒకరు సహాయమందించుకుంటూ ఇన్ని కష్టాల నడుమ కూడా మంచి కుల మత ధనిక బీద తారతమ్యాల్లేకుండా కలిసి మెలసి జీవిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ లోని వివిధ దేశాల నుండి వచ్చిన టీఆర్ఎస్ ప్రతినిధులు, అభిమానులు పెద్ద యెత్తున పాల్గొన్నారు.

మరోవైపు అబుదాబిలో జరిగిన గల్ఫ్ తెలంగాణ సంఘం మరియు తెలంగాణ జాగృతి సంయుక్తంగా నిర్వహించిన తెలంగాణ అవతరణ ఉత్సవాల్లోనూ శ్రీమతి కవిత పాల్ఘొన్నారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి శ్రీనివాస రావు, శ్రీనివాస్ శర్మ, రాజా శ్రీనివాస్ రావు, సదానంద్ బద్దూర్ తదితరులు పాల్ఘొన్నారు.


Connect with us

Latest Updates