Nizamabad MP

స్కిల్ డెవలప్‌మెంట్‌తో ఉపాధి

-ఏటా 30840 వేల మందికి 16 రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తాం
- సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వ సాయంతో జాగృతి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం
- పసుపు బోర్డు కోసం ఇతర రాష్ర్టాల సీఎంలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి
- బీఆర్‌జీఎఫ్ ఎత్తివేయడం కేంద్రం ఏకపక్ష ధోరణికి నిదర్శనం
- నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో ఎంపీ కల్వకుంట్ల కవిత

Kalvakuntla Kavitha
రాష్ట్ర ప్రభుత్వం గ్రామజ్యోతి చేపట్టింది.. కానీ కేంద్రం బీఆర్‌జీఎఫ్‌ను ఎత్తివేసింది. దీనివల్ల అన్యాయం జరుగుతుందా?నిజమే..చాలా విషయాల్లో కేంద్రం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నది. బీఆర్‌జీఎఫ్‌ను ఎత్తివేసే ముందు రాష్ర్టాలతో మాట్లాడాడలేదు. దీని ద్వారా వెనుకబడిన జిల్లాలకు అన్యాయం జరుగుతున్నంది. నిధుల కేటాయింపులో రూ.700 కోట్లు తగ్గాయి. ఐసీడీఎస్, మోడల్ స్కూల్స్, కస్తూర్బా పాఠశాలల విషయంలోనూ కేంద్రం ఏకపక్ష ధోరణినే ప్రదర్శించింది. రైతులకు సాముహిక బీమా, ప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్ వంటి వాటిని సైతం కేంద్రం తీసుకోవాలి. పోలియో నివారణకు చర్యలు తీసుకున్న తరహాలోనే మిగిలిన వాటిని కొనసాగించాలి. కానీ కేంద్రం ఈ విషయాలను నిర్లక్ష్యం చేస్తున్నది. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు, ఉద్యోగుల విభజనలోనూ కేంద్రం అనుసరిస్తున్న తీరు చూస్తుంటే రాష్ట్రంపై వివక్ష ప్రదర్శిస్తున్నదన్న భావన కలుగుతున్నది. ఈ విధానం మారాలని కోరుకుంటున్నా. గెలిపించిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవడానికే తొలి ప్రాధాన్యం ఇస్తానని నిజమాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. నిజమాబాద్ లోక్‌సభ పరిధిలోని జగిత్యాల అసెంబ్లీ నియోకవర్గంలో 17న మన ఊరు మన ఎంపీ కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టారు. మూడు రోజులుగా గ్రామాల్లో తిరుగుతూ సమస్యలను పరిష్కరిస్తూ రాత్రివేళ పల్లెల్లోనే బస చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం నమస్తే తెలంగాణకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో పలు అంశాలపై ఆమె స్పందించారు.

ప్రశ్న : మన ఊరు మన ప్రణాళిక లక్ష్యం ఏమిటి.. ఎన్నుకోవడానికి కారణాలు? ఇదంతా రాజకీయం కోసమేననే విమర్శలపై మీ స్పందన?
ఎంపీ: ఎంపీలు అంటే లోక్‌సభలో మాట్లాడటం.. ప్రజాసమస్యలు ప్రస్తావించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవడమనేది గతంలో చూశాం. పరిస్థితులు మారుతున్నాయి, ఎంపీలపై ప్రజలు అశలు పెంచుకున్నారు. మా బాధ్యతలు పెరిగాయి. ఎంపీలు మా గ్రామాలకు ఎన్నిసార్లు వచ్చారు? సమస్యలు ఎలా పట్టించుకోని పరిష్కరించారన్నది? అని ప్రజలు గమనిస్తున్నారు. ఇది అహ్వానించదగిన పరిణామం. అందుకే గెలిపించిన ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకొని సాధ్యమైనంత వరకు పరిష్కరించి రుణం తీర్చుకోవాలని భావించా.

అందులో భాగంగానే మన ఊరు మన ఎంపీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇది రాజకీయం కోసమేననే చేస్తున్న విమర్శలు..వారి విజ్ఞతకే వదిలివేస్తున్నా. పదవి లేనప్పుడు, ఎన్నికలు లేనప్పుడు కూడ బతుకమ్మతో అడబిడ్డలకు దగ్గరయ్యా. ఇప్పటికే చెల్లిగా, అక్కగా, అడబిడ్డగా నన్ను గౌరవిస్తున్నారు. ఇదంతా ఎంపీ పదవి లేక ముందే. ఇప్పుడు ఎన్నికలు లేవు. రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. విమర్శించే వాళ్లు ఒకసారి వాస్తవాలు తెలుసుకోవాలి. వాళ్లుకూడా మన ఊరు మన ఎంపీ కార్యక్రమానికి వస్తే వాస్తవాలు తెలుస్తాయి.

నిజామాబాద్ నియోజకవర్గ పరిధిలో 800 గ్రామాలున్నాయి. అన్నిచోట్లకు వెళ్లడం సాధ్యమేనా?
ఏడాదికి 80 నుంచి 90 రోజులు పార్లమెంట్ సమావేశాల్లో గడపాల్సి ఉంటుంది. ఎస్టిమేట్, కామర్స్ కమిటీలో నేను సభ్యురాలిని. ఎస్టిమేట్ కమిటీ కీలకమైంది. సమావేశాలకు విధిగా హాజరుకావాల్సి ఉంటుంది. ఇంకా నియోజకర్గం, రాష్ట్ర సంక్షేమంతో పాటుగా కేంద్రం అవసరాల నిమిత్తం పలుమార్లు విదేశాల్లో పర్యటన చేయాల్సి ఉంటుంది. మొత్తంగా బీజీ షెడ్యూల్, అయినప్పటికీ గెలిపించిన ప్రజలను దేవుళ్లుగా భావిస్తున్నా. ప్రతినెలలో వీలైనప్పుడు ఈ కార్యక్రమం కొనసాగించి ప్రతి పల్లెకు వెళ్లి ప్రజాక్షేత్రంలోనే సమస్యలు తెలుసుకుంటాను. అక్కడే బస చేయడం వల్ల ఎక్కువ మందిని కలుసుకోవడానికి, ముఖ్యంగా మహిళలు నేరుగా సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సాధ్యమైనన్ని గ్రామాల్లో పర్యటించేందుకు ప్రయత్నిస్తున్నా. ఈ విషయంలో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నాను.

మన ఊరు మన ఎంపీలో ప్రజా సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలపై వస్తున్న దరఖాస్తులను ఎలా పరిష్కరిస్తారు?
మనసు ఉంటే మార్గం ఉంటుంది. చేయాలన్న తపన.. చేయూత ఇవ్వాలన్న సంకల్పం ఉంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నమ్మేవారిలో నేను ముందుంటా. ఇక్కడొక ఉదాహారణ.. ఏండ్ల తరబడి పెద్దపల్లి నిజామాబాద్ రైల్వేలైన్ పనులు పెడింగ్‌లో ఉన్నాయి. నేను వెంటపడి ఈ ఏడాది రూ.140 కోట్లు సాధించా. వచ్చే ఏడాది ఇంతే మొత్తంలో నిధులు వస్తాయన్న విశ్వాసం ఉన్నది.

వస్తున్న దరఖాస్తుల్లో 80 శాతం సమస్యలు పరిష్కరించడానికి వీలున్నవే. ప్రతి దరఖాస్తును కంప్యూటర్‌లో నమోదు చేయిస్తున్నా. ఇందుకోసం ప్రత్యేకంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిబ్బంది పనిచేస్తున్నారు. దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపి వాటిని ఎప్పటికప్పుడు సమీక్షించే ప్రక్రియ చేపడుతున్నాం. నా వద్దకు ఒక దరఖాస్తు వచ్చిందంటే.. అది పరిష్కారం అవుతుంది. కాకుంటే ఎందుకు పరిష్కారం కాదో దరఖాస్తుదారుడికి తిరిగి సమాధానం వెళ్తుంది.

గ్రామాలకు బస్సులు రావడం లేదని, ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని కొందరు నా దృష్టికి తెచ్చారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడగా బస్సులు నడుపేందుకు అంగీకరించారు. ఒక గ్రామానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పిల్లకాలువలున్నాయి. కానీ, పునరుద్ధరణకు నోచుకోక పూడుకుపోయాయి. సంబంధిత అధికారులను అదేశించడంతో పనులు పూర్తయయ్యాయి. ఇలా ఎన్నో సమస్యలను స్థానికంగానే పరిష్కరించవచ్చన్నది నా అభిప్రాయం.

యువ మహిళా ఎంపీగా ఈ ప్రాంతానికి ఏమి చేయాలనుకుంటున్నారు?
పదవులు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ పదిమందికి ఉపయోగపడేపనులు చేయాలని భావిస్తాను. వేలాది కుటుంబాల జీవనోపాధికి అండగా ఉండేలా కేంద్రం సహకారంతో స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంను జాగృతి ఆధ్వర్యంలో చేపట్టనున్నాం. దీనికి కేంద్రం ఇప్పటికే అమోదం తెలిపింది. సెప్టెంబర్ తొలివారంలో కేంద్రమంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ చేతులమీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇది అమల్లోకి వస్తే ఏటా 30 నుంచి 40వేల మందికి 16 రంగాల్లో నైపుణ్యాన్ని వృద్ధి చేసుకునేందుకు మార్గం సుగమం అవుతుంది. ఇందులో ఐటీ, బ్యాంకింగ్ రంగాలు కూడా ఉంటాయి. ఇటీవల పలు దేశాల్లో పర్యటించా, అక్కడ చాలా ఉద్యోగాలు అవసరం ఉంది.

గల్ప్ దేశాలకే రెండు లక్షల ఉద్యోగులు అవసరం. కానీ ఇక్కడి నుంచి వెళ్లిన వారి సామర్థ్యం, నైపుణ్యం సరిపోక ఎంపికవడం లేదు. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న మనోళ్లలో నైపుణ్యాన్ని పెంచుతాం. స్వగ్రామానికి వచ్చిన నెలరోజుల్లో 20 రోజులు కుటుంబానికి సమయం కేటాయిస్తే, పది రోజులు మాకు ఇవ్వాలని కోరుతాం. ఆ సమయంలోనే సబంధింత రంగంలో నిష్ణాతులుగా తయారుచేసి రెట్టింపు వేతనం అందుకునేందుకు అర్హులుగా తయారుచేస్తాం. నిర్భయ కింద కేంద్రం రూ.వేయి కోట్లు విడుదల చేసినట్లు చెప్పింది. ఇప్పటివరకు ఒక్కపైసారాలేదు. నిర్భయ కేంద్రం కేవలం నిజమాబాద్‌లో తప్ప ఎక్కడా ప్రారంభంకాలేదు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా.

పసుపు బోర్డు ఏర్పాటు ఎంత దూరం వచ్చింది?
పసుపు బోర్డు ఏర్పాటుకు నిర్విరామంగా ప్రయత్నిస్తున్నా. వరంగల్‌లో బోర్డు ఏర్పాటుచేయాలని ఇప్పటికే సంబంధిత మంత్రులను కలిసి విన్నవించాం. పసుపు పండించే ఇతర రాష్ర్టాలైన ఏపీ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రులను కలుస్తా. వాళ్లందరితో కలిసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తా. దేశంలో మూడో అతిపెద్ద పంటయిన పసుపునకు తగిన మద్దతు ధర ప్రకటించాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని కోరేందుకు రైతులను తీసుకెళ్తా. న్యాయం జరుగుతుందన్న భరోసా ఉన్నది. వచ్చే ఏడాది సైతం ప్రభుత్వమే చెరుకు కొనుగోలు చేస్తుందని ఇప్పటికే చెప్పాం.

గల్ఫ్‌లో మృతిచెందిన రాష్ట్రవాసుల మృతదేహాలు తెప్పించడంలో ఆలస్యాన్ని ఎలా పరిష్కరిస్తారు?
గల్ప్‌దేశాల నుంచి మృతదేహాలను తెప్పించేందుకు మా ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ కూడా బాగా స్పందిస్తున్నది. దుబాయి వంటి దేశాలతో మన దేశానికి కొన్ని ఒప్పందాలు లేకపోవడంతో మృతదేహాల తరలింపు అలస్యమవుతున్నది. ఇప్పటికే ఎన్‌ఆర్‌ఐ సెల్ ప్రారంభించి ఆలస్యాన్ని నివారిస్తున్నాం. వివిధ దేశాలనుంచి సుమారు 75 మృతదేహాలను తెప్పించాం. ఢిల్లీవరకు డెడ్‌బాడీలను తీసుకొచ్చే బాధ్యతను కేంద్రం తీసుకుంటుంది. అక్కడి నుంచి స్వస్థలాలకు చేర్చేలా రాష్ట్రప్రభుత్వమే చర్యలు చేపడుతున్నది. అంత్యక్రియల కోసం ఎమ్మార్వోల ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నాం.


Connect with us

Latest Updates