ఎస్సీల వర్గీకరణ కోసం పార్లమెంటులో పోరాటం చేస్తామని నిజామాబాద్ ఎంపి శ్రీమతి కల్వకుంట్ల కవిత తెలిపారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని టిఆర్ఎస్ ఎంపీలం లేవనెత్తుతామని స్పష్టం చేశారు. త్వరలోనే డిల్లీకి అఖిల పక్షంను తీసుకెళ్తామన్నారు. బుధవారం ఇందిరాపార్కులో తెలంగాణ ఎమ్మార్పీఎస్ మాదిగల సమగ్రాభివృద్ధికి బహిరంగ సభను నిర్వహించింది. డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌లతో పాటు కవిత కూడా సభకు హాజరయ్యారు.
ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి మేడి పాపయ్య అధ్యక్షతన జరిగిన సభలో దళితుల సమస్యలను ఆమె వివరించారు. ఏళ్ల తరబడి దళితులను ఓటు బ్యాంకులుగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. 60 ఏళ్ల పాటు పాలించిన పార్టీలు హైదరాబాద్‌ను సరిగా అభివృద్ధి చేయలేదన్నారు. అన్ని పార్టీలకూ అవకాశం ఇచ్చినా వారు ప్రజలకు ఏం కావాలో అది చేయలేదని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి కంకణం కట్టుకున్న సిఎం కేసిఆర్ గారు అహర్నిశలూ శ్రమిస్తున్నారని, ఆయనకు మద్ధతుగా నిలవాల్సిన బాధ్యత మనందరిదీ అన్నారు…ఓట్ల కోసం కొన్ని పార్టీలు డబ్బు సంచులు పట్టుకుని తిరుగుతున్నాయని, ఓటు మాత్రం కారు గుర్తుపై వేయాలని కవిత కోరారు. దళితులకు మూడెకరాల భూమిని పంపిణీ చేస్తున్నారని, ఎస్సీ సబ్ ప్లాన్ అమలుతోపాటు దళితుల సంక్షేమానికి సిఎం కేసిఆర్ గారు పెద్దపీట వేశారని వివరించారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాతాకుల భాస్కర్, వంగపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.