Nizamabad MP

సమన్వయంతో సమస్యల పరిష్కారం..

తెలంగాణ-మహారాష్ట్ర మధ్య ఉన్న సమస్యలను సమన్వయంతో పరిష్కరించుకుందామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు సూచించారు. సమన్వయంతో ముందుకెళితే రెండు రాష్ర్టాల రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఫడ్నవిస్‌ను మంగళవారం సాయంత్రం ముంబైలోని ఆయన అధికారిక నివాసంలో కలిసిన కవిత ఆ సందర్భంగా పలు అంశాలపై రెండు వినతి పత్రాలు అందించారు. రెండు రాష్ర్టాల సరిహద్దులకు సంబంధించిన పలు వివాదాలు, రైతుల సమస్యలపై ఫడ్నవిస్‌తో కవిత చర్చించారు.

Kalvakuntla Kavitha called on Maharashtra CM Devendra Fadnavis

-సరిహద్దు వివాదాల పరిష్కారం పై తెలంగాణ- మహారాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి
-జియోగ్రాఫికల్ సర్వేతో మంజీరా హద్దుల్ని నిర్ణయించాలి
-పసుపు బోర్డు ఏర్పాటుకోసం ప్రధానికి లేఖ రాయండి
-మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు ఎంపీ కవిత వినతి
-ముంబైలో ఫడ్నవిస్‌తో పలు అంశాలపై చర్చ
మంజీరా నది సరిహద్దు సమస్యల పరిష్కారానికి జియోగ్రాఫికల్ సర్వే నిర్వహించి, హద్దులు స్పష్టంగా సూచించడం అవసరమని అన్నారు. తెలంగాణ సరిహద్దులోని కారేగావ్, హుమ్నాపూర్, పోతంగల్, హంగర్గ గ్రామాల రైతుల వ్యవసాయ భూములు మంజీరా నదికి అవతల మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నాయి. అక్కడి రైతులకు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సబ్సిడీ వితనాలు, ఎరువులు ఈ నాలుగు గ్రామాల రైతులకు అందడంలేదు. వారికి కూడా సబ్సిడీ అందేలా చూడాలి.

తెలంగాణ-మహారాష్ట్ర మధ్యలోని సాలూర బ్రిడ్జి నిర్మాణానికి అప్పటి ఏపీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూర్చాయి. ఇప్పుడు ఆ బ్రిడ్జి నిర్వహణ నిధులను కూడా తెలంగాణ-మహారాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చేలా చర్యలు తీసుకోవాలి. మద్నూర్- బోధన్, దెగ్లూర్-బోధన్‌ల మధ్య రోడ్డుమార్గంద్వారా రాకపోకల కోసం మహారాష్ట్రలోని దెగ్లూర్ తాలూకాలోని సాగ్లి వద్ద బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఎక్సైజ్, పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలి. దేశీ మద్యం, గుట్కా తదితర ఇతర చట్ట వ్యతిరేక రవాణా, కార్యకలాపాల నివారణకు ఇవి అవసరం. రెండు రాష్ర్టాల రైతుల ప్రయోజనాల కోసం లెండి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలి. మంజీరా నదిపై చెక్‌డ్యాంలు నిర్మించి రెండు రాష్ర్టాల్లో భూగర్భజలాల్ని పెంచవచ్చు. వేసవిలో తెలంగాణకు తాగునీటి కొరత ఉన్నపుడు అవసరమైన నీటిని విడుదల చేయాలి అని కవిత కోరారు.

జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, పసుపు కనీస మద్దతు ధర కోసం ప్రధాని మోదీకి మద్దతు లేఖ ఇవ్వాల్సిందిగా మహారాష్ట్ర సీఎంను కవిత కోరారు. బోర్డు ఏర్పాటు ఆవశ్యకతను రాతపూర్వకంగా వివరించారు. ఆయుర్వేదానికి ఆదరణ పెరుగుతున్న దరిమిలా ఆయుర్వేద మందుల్లో వాడే పసుపునకు కూడా డిమాండ్ పెరుగుతున్నదని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పండించే వివిధ రకాల పసుపు ఉత్పత్తిని భౌగోళిక వారసత్వ పంటగా గుర్తించడానికి ప్రపంచ వాణిజ్య సంస్థపై ఒత్తిడి పెంచాల్సిన అవసరముందని అన్నారు.

పసుపునకు కనీస మద్దతు ధర కూడా అవసరమని పేర్కొన్నారు. కేంద్రం కూడా నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా రైతుల నుంచి ప్రత్యక్షంగా కొనుగోలు చేయాలని కవిత తన లేఖలో అభిప్రాయపడ్డారు. ఫడ్నవిస్‌ను కలిసినవారిలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ఏ జీవన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, జగిత్యాల నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి సంజయ్‌కుమార్ తదితరులున్నారు.


Connect with us

Latest Updates