-రైతులను ఆదుకుంటున్న ఘనత ప్రభుత్వానిదే: ఎంపీ కవిత
సహకార సంఘాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని.. సహకార వ్యవస్థను బలోపేతం చేస్తామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మంగళవారం నిజామాబాద్‌లో నిర్వహించిన సహకార మార్కెటింగ్ సంస్థ 39వ మహాజన సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సహకార వ్యవస్థ బలోపేతానికి డిపాజిట్లు పెంచి ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అసంఘటిత రంగంలో ఉన్న బీడీ కార్మికులను సహకార వ్యవస్థలోకి తీసుకొస్తే వారి జీవితాలు బాగుపడుతాయన్నారు. సహకార సంఘాలు బలపడాలంటే సభ్యత్వాలు పెంచాలని, డిపాజిట్లను రెట్టింపు చేయాలని సూచించారు.
రైతాంగానికి రావాల్సిన 6 శాతం రిబేట్ రూ.152 కోట్ల గురించి, సహకార సంఘాల అధ్యక్షులకు ప్రొటోకాల్, వేతనాలు, ఇతర విషయాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో పెండింగ్‌లో ఉన్న రూ.432 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని రైతులకు యుద్ధప్రాతిపదికన అందించామని వివరించారు. రైతుల నుంచి ఏటా బీమా ప్రీమియం వసూలు చేస్తున్న కేంద్రం, పంటలకు నష్టం వాటిల్లినప్పుడు మాత్రం పరిహారం చెల్లించడంలేదని ఆరోపించారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో ఎక్కడా ఎరువులు, విత్తనాలకు కొరత లేకుండా పంపిణీ చేశామని గుర్తుచేశారు. సమావేశానికి ఐడీసీఎంఎస్ చైర్మన్ ముజీబుద్దీన్ అధ్యక్షత వహించగా టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, డీసీసీబీ జిల్లా అధ్యక్షుడు గంగాధర్‌రావు పట్వారీ తదితరులు పాల్గొన్నారు.