Nizamabad MP

రుద్రమదేవి స్ఫూర్తితో బంగారు తెలంగాణ

-హుస్నాబాద్ అభివృద్ధికి ఇప్పటికే రూ.450 కోట్లిచ్చిన సీఎం కేసీఆర్
-హైదరాబాద్, వరంగల్‌తోపాటు కరీంనగర్‌కు పరిశ్రమలు
-ఆశవర్కర్ల సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం
-హుస్నాబాద్‌లో బంగారు బతుకమ్మ వేడుకలో ఎంపీ కవిత

Kalvakuntla Kavitha
హుస్నాబాద్ కాకతీయులు పరిపాలించిన ప్రాంతం. ఇక్కడ వెయ్యికి పైగా గుడులు కట్టించారు. 750కిపైగా చెరువులు తవ్వించారు. కాకతీయ వీరవనిత రుద్రమదేవి స్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ముందుకెళ్దాం అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. బంగారు బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా రెండోరోజైన మంగళవారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని డిపో గ్రౌండ్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు.

అంతకు ముందు స్వయంగా బతుకమ్మను పేర్చి, మహిళలతో ర్యాలీగా డిపో గ్రౌండ్స్‌కు చేరుకుని బతుకమ్మల ఆడారు. అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కోటి బతుకమ్మలనెత్తి కొత్తరాష్ట్రం సాధించాం.. ఇప్పుడు ప్రతి మహిళ బతుకమ్మనెత్తి బంగారు తెలంగాణ సాధించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ జనాభాలో సగం మేర అడబిడ్డలు ఉన్నారనీ, వారు అనుకుంటే ఏదైనా సాధిస్తారని పేర్కొన్నారు. దేశంలో వందశాతం మహిళలు అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని కోరారు. అందరికీ విద్య కోసం ప్రభుత్వం త్వరలో కేజీ టూ పీజీ విద్యావిధానాన్ని అమలు చేయబోతున్నదన్నారు.

ఈ విధానంతో పేదలకు కూడా మంచి విద్య అందనున్నదన్నారు. పదిహేను నెలల పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ హుస్నాబాద్‌కు మూడసార్లు వచ్చారని, నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే రూ.450 కోట్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. హైదరాబాద్, వరంగల్‌తోపాటు కరీంనగర్‌లో కూడా పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆశ వర్కర్ల సమస్య కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నదని, ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చలు జరుపుతూనే, అంగన్‌వాడీల మాదిరిగా జీతాలు, సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని భరోసాఇచ్చారు. ఆశ వర్కర్లు సమ్మె విరమించి పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, మాజీ ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీ ఉపాధ్యక్షుడు రాయిరెడ్డి రాజిరెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, జాగృతి నాయకులు వరలక్ష్మి, గందె కల్పన, జాడి శ్రీనివాస్, మోహన్‌రెడ్డి, కిషన్‌నాయక్, మహేందర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.


Connect with us

Latest Updates