Nizamabad MP

రైతు కుటుంబాలకు ప్రతి నెలా 2500

ఆత్మహత్యల కారణంగా పెద్ద దిక్కును కోల్పోయిన 389 రైతు కుటుంబాలను తెలంగాణ జాగృతి దత్తత తీసుకుంటుందని ఆ సంస్థ అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రతినెలా 2500 చొప్పన నాలుగేండ్లపాటు చెల్లిస్తామని చెప్పారు. తెలంగాణభవన్‌లో ఆదివారం సాయంత్రం స్థానిక, జాతీయ మీడియాతో ఆమె మాట్లాడారు. బంగారు తెలంగాణ సాధనలో ముందుకుపోతున్న తరుణంలో రైతు ఆత్మహత్యలు జరగడం చాలా బాధాకరం. ఆత్మహత్యలను ఆపాలని అనేక రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవి జరగడం అందరినీ కలచివేస్తున్నది. ఈ విషాదంపై స్పందించి, కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ రైతు కుటుంబాలను ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ జాగృతి ఆదుకుంటుంది అని కవిత చెప్పారు.

Kalvakuntla Kavitha press meet at Telangana Bhavan

-నాలుగేండ్ల పాటు తెలంగాణ జాగృతి సహాయం
- త్రిసభ్య కమిటీ పరిధిలోకి రాని 389 కుటుంబాల దత్తత
- పిల్లల చదువులపై జాగృతి కార్యకర్తల ప్రత్యేక శ్రద్ధ
-దాతల నుంచి ఇప్పటివరకు రూ.కోటి విరాళాలు
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వెల్లడి
అరవయ్యేండ్ల పాలనలోని పాపాలు రైతుల్ని కాటేయడం వల్లనే రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆమె స్పష్టం చేశారు. వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేసి, రైతులను ఆదుకునే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం తక్షణ చర్యలతో పాటు మధ్యతరహా, దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నదన్నారు.

ఎంపిక చేసింది ఇలా: తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 786 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా కేసులు నమోదయ్యాయని ఎంపీ కవిత పేర్కొన్నారు. అయితే త్రిసభ్య కమిటీ వీటిలో 397 కేసులను రైతు ఆత్మహత్యలుగా నిర్ధారించిందన్నారు. సహజంగానే ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు, మార్గదర్శకాలుంటాయని, వాటిని ఉల్లంఘించకుండానే ఈ నిర్ధారణ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందని అన్నారు. ఉదాహరణకు.. చనిపోయిన రైతు చేసిన అప్పు పొలం కోసమే చేసి ఉండాలి. ఆ అప్పు తాలూకు కాగితాలు ఉండాలి అనే ఆంక్షలు ఉంటాయన్నారు.

మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో కూడా రైతు ఆత్మహత్యల నిర్ధారణకు ఇలాంటి నిబంధనలు ఉంటాయన్నారు. కాగా త్రిసభ్య కమిటీ నిర్ధారించిన 397 రైతు కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఆర్థిక అండ, ఇతర పథకాల ద్వారా ప్రయోజనం లభిస్తుందని, అందువల్ల ఈ కమిటీ పరిధిలోకి రాని మిగిలిన 389 కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ జాగృతి నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. ఈ కుటుంబాలను దత్తత తీసుకుని వీరికి ప్రతి నెలా రూ.2500 సహాయాన్ని నాలుగేండ్ల పాటు ఇస్తామన్నారు. 389 కుటుంబాలకు కలిపి నెలకు రూ.పది లక్షల వరకు ఆర్థిక సాయం అందచేస్తామని చెప్పారు. రైతుల ఆత్మహత్యల మీద స్పందించాలని తెలంగాణ జాగృతి ఇచ్చిన పిలుపునకు దాతల ద్వారా ఇప్పటివరకు సుమారు రూ.కోటి విరాళాలు వచ్చాయన్నారు. జాగృతి అకౌంట్‌లో నుంచి నేరుగా ఆయా రైతు కుటుంబాల్లోని అకౌంట్లకు ఆర్థిక సాయం బదిలీ అవుతుందని కవిత చెప్పారు. తమ కార్యక్రమం ద్వారా నాలుగేండ్ల తర్వాత కొన్ని కుటుంబాలైనా కొంతమేర ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశాలుంటాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

రైతులకు అనుక్షణం అండగా..
బాధితులైన మిగిలిన రైతు కుటుంబాలకు కూడా తెలంగాణ జాగృతి కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అండగా నిలుస్తారని ఆమె చెప్పారు. ముఖ్యంగా ఆ కుటుంబాలలోని పిల్లల చదువులు ఆగిపోకుండా, వాళ్లు ప్రయోజకులయ్యేందుకు కృషి చేస్తామన్నారు. అంతేగాకుండా ఆ కుటుంబాలకు ఆత్మస్థయిర్యం కల్పించడం, ఆ గ్రామంలోని ఇతర రైతుల్లో మనోధైర్యం కల్పించడంతో పాటు వ్యవసాయంలో వారికి సూచనలు ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. వీటితో పాటు ప్రభుత్వం ఇస్తున్న వడ్డీలేని రుణాలను ఆయా రైతు కుటుంబాల్లోని మహిళా రైతులకు ఇప్పించేందుకు కృషి చేస్తామని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు.

తెలంగాణ ప్రజలు, రైతులు తమపై ఎంతో ప్రేమ చూపారని.. ఇపుడు తెలంగాణ ఆడబిడ్డగా వారిని ఆదుకోవడం తన బాధ్యతగా భావించానని కవిత చెప్పారు. జాగృతికి చెందిన దేశ, విదేశాల్లోని సభ్యులు 80 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నారని చెప్పారు. విదేశాల్లోని వారి నుంచి కూడా ఆర్థిక సాయం చేస్తామంటూ స్పందన వస్తున్నదని అన్నారు. ఇప్పటివరకైతే కార్పొరేట్ సంస్థల్ని తాము సంప్రదించలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఎంపీ కవిత తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు జాగృతి కన్వీనర్ ప్రొఫెసర్ శ్రీధర్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.


Connect with us

Latest Updates