రైతు ఆత్మహత్యలపై అధ్యయనం..

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ జాగృతి క్షేత్రస్థాయి అధ్యయనం చేస్తున్నదని జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కే కవిత చెప్పారు. రైతు ఆత్మహత్యలపై తెలంగాణ జాగృతి కార్యాలయంలో బుధవారం తన అధ్యక్షతన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్నదని, బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో కొనసాగుతున్న రైతు ఆత్మహత్యలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు తోడుగా వారి కుటుంబాల్లో మానసిక ైస్థెర్యం నింపేందుకు తెలంగాణ జాగృతి నడుం బిగించిందన్నారు.

Kalvakuntla Kavitha addressing on Farmers suicide

-ప్రభుత్వ చేయూతను సక్రమంగా చేరుస్తాం
-ఆత్మహత్యల నిరోధానికి కృషి చేస్తాం
-జాగృతి వలంటీర్లతో మనోధైర్యం కల్పిస్తాం
-ప్రముఖులతో సమావేశంలో ఎంపీ కవిత
రైతుల సంక్షేమంతోపాటు ఆత్మహత్యలను నిరోదించేందుకు దీర్ఘకాల వ్యూహంతో కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ఇందుకోసం 1.20 లక్షల మంది తెలంగాణ జాగృతి వలంటీర్లను రంగంలోకి దింపుతామని చెప్పారు. రైతుల కోసం రాజకీయాలకు అతీతంగా అందరితో కలిసి పనిచేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని సక్రమంగా ఆత్మహత్య బాధిత రైతుల కుటుంబాలకు చేరేలా చూస్తామన్నారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం మానవతా దృక్పథంతో చూడాలన్నారు. పోలీసుల ఎఫ్‌ఐఆర్‌తోపాటు పంచనామా, పోస్టుమార్టం రిపోర్టును పరిశీలిస్తే ఆ రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలుస్తుందన్నారు. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ప్రొఫెసర్ శ్రీధర్, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ సీతారామారావు, జేఎన్టీయూ ప్రొఫెసర్ వినయ్‌బాబు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సీతారామారావు, రిజిస్ట్రార్ సురేష్‌బాబు, కెప్టెన్ జీజే రావు, డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

-సీఎం జనం సమస్యలు తెలిసిన వ్యక్తి: ఎంపీ కవిత
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు జనం సమస్యలు తెలిసిన వ్యక్తి అని, ప్రజా సమస్యల పరిష్కారంపై నిరంతరం ఆయన ఆలోచిస్తారని ఎంపీ కవిత పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో సింగరేణి వీఆర్‌ఎస్ కార్మికులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర పురోభివృద్ధికి అన్ని అంశాలపై దృష్టి పెడుతున్న సీఎం ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు. 345 రోజుల నుంచి దీక్షను కొనసాగిస్తున్న సింగరేణి వీఆర్‌ఎస్ కార్మికులు తమ దీక్షను విరమించాలన్నారు. సీఎంను కలిసి సమస్యలను వివరించడమే కాకుండా 20 రోజుల్లో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని ఆమె వారికి హామీ ఇచ్చారు.


Connect with us

Latest Updates