Nizamabad MP

ప్రజలే కేంద్రంగా పనిచేయాలి

పేపర్లు కేంద్రంగా కాకుండా ప్రజలే కేంద్రంగా పనిచేయాలని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తేనే వారి మన్ననలు పొందగలుగుతామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అధికారులకు సూచించారు. చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన పట్టణంలోని ఐఎంఏ భవన్‌లో సోమవారం ఉదయం నిర్వహించిన డీఆర్‌సీ సమావేశంలో, స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) భవన్‌లో సాయంత్రం జరిగిన జిల్లా అభివృద్ధి, ప్రభుత్వ పథకాలపై సమీక్షకు ఎంపీ కవిత ముఖ్యఅతిథిగా హాజరైన మాట్లాడారు. జిల్లాల పునర్విభజన తర్వాత కొత్త జిల్లాలో తొలిసారిగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష జరుపుకుంటున్న ఘనత జగిత్యాలకే దక్కిందన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో అధికారులకు నిబంధనల రూపంలో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చని, కానీ మానవతావాదానికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
-జగిత్యాల జిల్లాను అగ్రగామిగా తీర్చిదిద్దాలి: ఎంపీ కవిత
-కాంగ్రెస్ నేతలు మతిలేని యాత్రలు చేస్తున్నారని ఎద్దేవా
-నిజాంషుగర్స్ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని వెల్లడి

kalvakuntla-kavitha-press-meet-in-jagtial

కొన్ని పథకాల్లో అనర్హులు లబ్ధిపొంది, అర్హులు నష్టపోయే ప్రమాదం ఉన్నదన్నారు. పది మంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు కానీ, ఒక నిరపరాధికి శిక్షపడరాదన్న ఇండియన్ పీనల్‌కోడ్ విధానాన్ని అనుసరించి సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా చూడాలని సూచించారు. అలాగే నిరుపయోగమవుతున్న నిధులపై శ్రద్ధపెట్టాలన్నారు. ప్రజలు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులపై ఎంతో విశ్వాసంతో ఉన్నారని, వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేయాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదన్నారు. రోగాలపై ప్రజలకు అవగాహన లేకపోతే ప్రభుత్వం ఎంత బాగా పనిచేసినా ఆశించిన ఫలితం రాదని సీఎం కేసీఆర్ చెప్తుంటారని, డెంగ్యూపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, పాఠశాల విద్య, వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ధాన్యం సేకరణ, ఉపాధి కల్పన అంశాలపై ఎంపీ సమీక్షించారు.

చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ జగిత్యాల ప్రాంతం వనరులతో కూడుకున్నదని, ఇప్పటికే వ్యవసాయక జిల్లాగా పేరుగాంచిందని, జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. కొత్త జిల్లాలు ఏర్పడగానే సరిపోదనీ, ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు చూసుకున్నప్పుడే సర్కారు లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. సమీక్షలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, చెన్నమనేని రమేశ్, విద్యాసాగర్‌రావు, కలెక్టర్ డాక్టర్ శరత్, జేసీ నాగేంద్ర, ఎస్పీ అనంతశర్మ, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయం: ఎంపీ కవిత
అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని కాంగ్రెస్ నేతలు, నిజాంషుగర్ ఫ్యాక్టరీ సమస్య అంటూ ప్రజల చుట్టూ తిరుగుతున్నారని ఎంపీ కవిత విమర్శించారు. సోమవారం నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వేంపల్లిలో సబ్‌స్టేషన్‌ను మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. అంతకుముందు జగిత్యాల పట్టణంలోని చింతచెరువులో చేప పిల్లలను వదిలారు. మంత్రిగా ఉన్నప్పుడు నిజాంషుగర్ ఫ్యాక్టరీని నిర్లక్ష్యం చేసిన సుదర్శన్‌రెడ్డి ఇప్పుడు మతిలేని యాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

నిజాంషుగర్ ఫ్యాక్టరీ కార్మికులను కాపాడేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని స్పష్టంచేశారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వమే సొసైటీల ద్వారా వర్షాల వల్ల పాడైన సోయాబీన్ గింజల కొనుగోళ్లు చేపట్టిందన్నారు. ప్రజలందరి కండ్లల్లో సంతోషం చూడాలనే రాష్ర్టాన్ని సాధించుకున్నామని, సీఎం కూడా అదే ఆలోచనతో నిరంతరం కష్టపడుతున్నారన్నారు. ఇటీవల జరిపిన ప్రైవేటు సర్వేలో ఇప్పటికిప్పుడే ఎన్నికల వచ్చినా 119 స్థానాలకు గాను 109 టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుదని తేలిందన్నారు. ప్రజల ఆశీర్వాదం.. సీఎం కేసీఆర్ పనితీరుకు ఇదే నిదర్శనమని చెప్పారు.


Connect with us

Latest Updates