Nizamabad MP

ప్రజల రుణం తీర్చుకుంటా

-ఆశలను వమ్ముచేయకుండా సమస్యలు పరిష్కరిస్తా
-మన పల్లె మన ఎంపీ కార్యక్రమంలో ఎంపీ కవిత

Kalvakuntla Kavitha
ఎంపీగా గెలిపించిన ప్రజల ఆశలను వమ్ముచేయకుండా ప్రతి సమస్యను తెలుసుకొని పరిష్కరించేందుకు కృషిచేస్తా. ప్రజల రుణం తీర్చుకునేందుకే మన పల్లె-మన ఎంపీ కార్యక్రమాన్ని చేపట్టా. వీలైనంత మేరకు అన్ని గ్రామాల్లో పర్యటించేందుకు ప్రణాళిక తయారుచేసుకున్నా. వచ్చి వెళ్లడమేకాదు.. సమస్యల పర్కిష్కారం ఎంత వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు పరిశీలించి చర్యలు తీసుకుంటా అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పల్లెల్లో సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలన్న లక్ష్యంతో ఎంపీ కవిత సోమవారం కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం చల్‌గల్ లో మన ఎంపీ-మన పల్లె కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ముందుగా పలువాడల్లో తిరిగారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకడంతోపాటు ఆప్యాయంగా ఇంటికి రావాలని ఆహ్వానించారు. అనంతరం సభలో గ్రామస్తులకు సమస్యలు చెప్పేందుకు ఎంపీ అవకాశం ఇచ్చారు.

సమస్యలన్నింటినీ నోట్‌చేసుకుని విడివిడిగా సమాధానం చెప్పారు. రోడ్లు, మురుగునీటి కాల్వలు, క్రీడా మైదానం, మహిళా భవన్, లైబ్రరీ, రెండు కులసంఘాలకు కమ్యూనిటీ హాళ్లు ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. శ్మశానవాటికల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం నర్సింగాపూర్‌లో మన పల్లె- మన ఎంపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి అక్కడే బస చేశారు. తిరిగి మంగళవారం ఉదయం నుంచి మన పల్లె- మన ఎంపీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కార్యక్రమాల్లో జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, టీఆర్‌ఎస్ జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ సంజయ్, టీఆర్‌ఎస్ నాయకులు జితేందర్‌రావు, రాజేశం గౌడ్, బండ భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Connect with us

Latest Updates