బ్రిటిష్ కౌన్సిల్ మహిళాదినోత్సవంలో ఎంపి కవిత
ఆర్థిక స్వావలంభనతోనే మహిళల వికాసం సాధ్యమవుతుందన్నారు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత. దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య కూడా మహిళల వల్ల రూపుమాపవచ్చన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్లో బ్రిటిష్ కౌన్సిల్-డయాజియో సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించాయి. సెలెబ్రేటింగ్ ది యంగ్ విమెన్ సోషల్ ఇంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాంకు కవిత ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బ్రిటిష్ కౌన్సిల్ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు.
నిరుద్యోగ సమస్య తీరాలంటే ప్రభుత్వాల వల్లనో..కార్పొరేట్ సంస్థల వల్లనో కాదన్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన మహిళల వల్ల. మహిళా సహకార సంఘాల వల్లనే నిరుద్యోగ సమస్య అంతం అవుతుందని అభిప్రాయపడ్డారు. మహిళలకు శిక్షణ ఇచ్చి ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయాల్సి ఉందని చెప్పారు. మహిళా పారిశ్రామిక వేత్తల సంఖ్య పెరగాల్సి ఉందన్నారు. అయితే మహిళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నప్పటికీ కొంత మందికి మాత్రమే అవకాశం వస్తుంది. మిగతా వారికి కూడా త్వరితంగా ఉద్యోగం వచ్చేలా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ఇందు కోసం జిల్లాను చిన్న చిన్న క్లస్టర్లుగా విభజించాలని కవిత సూచించారు. నిజామాబాద్ జిల్లాలో చిన్న క్లస్టర్ల ఏర్పాటును ప్రారంభించినట్లు తెలిపారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగితే , వారు మరికొంత మంది మహిళలకు ఉద్యోగాలు ఇస్తారన్నారు.
పేదింటి ఆడబిడ్డల పెళ్లి భారం కాకూడదని కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం భరోసా ఇస్తున్నదన్నారు. పెళ్లి ఎలాగూ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి బిడ్డను చదివిద్దాం అన్న ఆలోచన తల్లిదండ్రులకు ఏర్పడుతోందన్నారు. ఆడపిల్ల పుట్టినప్పుడు 12 వేల రూపాయల కిట్‌ను ఇస్తున్న ప్రభుత్వం ఆమె చదువుకుని, పెళ్లి చేసుకునేంత వరకూ ప్రభుత్వం అండగా ఉంటున్నదని కవిత తెలిపారు. చదువుతో పాటే సరైన పోషకాహారం అందిస్తున్నట్లు చెప్పారు. కెజి టు పీజి పథకంలోనూ ఆడపిల్లలకు వరంగా మారిందన్నారు.
తెలంగాణ జాగృతి ద్వారా ఉపాధి శిక్షణ ఇస్తున్నామని ఇప్పటి వరకు ఆరువేల మందికి శిక్షణ ఇస్తే…వారిలో మూడు వేల మంది మహిళలే కావడం విశేషమన్నారు. ఉద్యోగ కల్పనతో పాటు ఉపాధిని కల్పిస్తున్నట్లు కవిత తెలిపారు.
ఇదివరకటి ప్రభుత్వాలకంటే మెరుగైన కార్యక్రమాలను చేపట్టి…ప్రత్యేక బడ్జెట్‌ను టిఆర్ఎస్ ప్రభుత్వం కేటాయిస్తున్నదన్నారు.
రాజకీయంగా నాలాంటి ఒకరిద్దరికి అవకాశాలు వచ్చాయి కాని చాలా మందికి రావాల్సి ఉందన్నారు. కేబినెట్లో మహిళా మంత్రి లేకపోయినంత మాత్రాన మహిళలకు ప్రభుత్వం ఏం చేయడం లేదనడం సరికాదన్నారు.
ఈ కార్యక్రమంలో బ్రిటిష్ కౌన్సిల్ సౌత్ ఇండియా డైరెక్టర్ ఎం.కె బార్కర్, డయాజిఓ గ్రూప్ కార్పోరేట్ కమ్యూనికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ మిచెల్లీ డిసౌజా, కర్నాటక స్పెషల్ సెక్రటరీ కె. రత్నప్రభ పాల్గొన్నారు.