-అన్ని గ్రామాల పర్యటన కోసమే మన ఊరు-మన ఎంపీ
-త్వరలో జోగినులకూ పింఛన్లు: ఎంపీ కల్వకుంట్ల కవిత
అరవై ఏండ్ల ఆంధ్రా పాలనలో మన ఊళ్లన్నీ భయంకరంగా మారిపోయా యి. ఒకప్పుడు కులవృత్తులతో ఊరు కళకళలాడేది. ఏ అవసరమొచ్చినా ఊరు దాటేది కాదు. స్వరాష్ట్రంలో పూర్వ పరిస్థితి రావాలి. పల్లెలన్నీ బాగుపడాలి. గ్రామాలకు జీవకళ రావాలి. ఇదే సీఎం కేసీఆర్ లక్ష్యం అని ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మన ఊరు-మన ఎంపీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం రెంజల్ మండలం తాడ్‌బిలోలి, నీలా గ్రామాల్లో ఎంపీ పర్యటించారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఈ కార్యక్రమం ఏకధాటిగా కొనసాగింది. గల్లీగల్లీలో పాదయాత్రలు చేస్తూ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడికక్కడే సమస్యల పరిష్కారానికి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కొన్ని పనులకు తన సొంత నిధులను మంజూరు చేసేందుకు అంగీకరించారు. కార్యక్రమంలో ఎంపీ కవితతో పాటు ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ కూడా పాల్గొన్నారు. పాదయాత్రల అనంతరం నీలాలో పల్లెనిద్ర చేశారు. ఈ సందర్భంగా గ్రామసభలో ఎంపీ కవిత మాట్లాడారు.
తన పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే తాను మన ఊరు- మన ఎంపీ కార్యక్రమం నిర్వహిస్తున్నానన్నారు. బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ 16 నెలలుగా రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారని, ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా అమలుచేస్తున్నారన్నారు. నీడలేని ప్రతి వ్యక్తి ఆత్మగౌరవంతో బతకాలని రూ.5.03 లక్షలతో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నామన్నారు. తాగునీటి కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ పథకాన్ని చేపట్టిందన్నారు. జోగినులకు పింఛన్ల అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానని, త్వరలో పింఛన్లు వస్తాయని హామీ ఇచ్చారు. బోధన్ నియోజకవర్గంలో ఎంపీ మూడు రోజుల పర్యటన నీలాలో పల్లెనిద్రతో ముగిసింది.