Nizamabad MP

ఓర్వలేకే విపక్షాల ఆరోపణలు..

పత్తికి మద్దతు ధర పెంచాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా, తెలంగాణను అన్నివిధాల ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఎంపీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.
-పత్తికి మద్దతు ధర పెంచాల్సింది కేంద్ర ప్రభుత్వమే
-విపక్షాలకు ఈ ఎన్నికలో గుణపాఠం చెప్పాలి: ఎంపీ కవిత

Kalvakuntla Kavitha campaigning for pasunoori dayakar in Bhoopalapally

దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న టీఆర్‌ఎస్ పాలనను ఓర్వలేని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి వరంగల్ జిల్లా భూపాలపల్లిలో టీఆర్‌ఎస్ నేతృత్వంలో నిర్వహించిన ధూంధాంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అన్నం పెట్టే చెయ్యి ఆకలిని ఆలోచిస్తుంది.. ఆకలి తెలిసిన బిడ్డ సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర మరువలేనిదన్నారు. బొగ్గుతోనే కరెంటు ఉత్పత్తి అవుతుందని చెప్తూ కార్మికుల 35 రోజుల సమ్మెతో దక్షిణ భారత దేశం చీకటి మయమవుతుందనే భయంతో తెలంగాణ ఇచ్చారన్నారు.

సకల జనుల సమ్మె కాలాన్ని స్పెషల్ లీవ్‌గా ప్రకటిస్తామని చెప్పినట్టుగానే సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారన్నారు. కార్మికుల చెమటను గౌరవిస్తూ లాభాల శాతాన్ని పెంచి ఇప్పుడు 21 శాతం ఇస్తున్నారని తెలిపారు. డిపెండెంట్ ఉద్యోగాలు కూడా 3100 మందికి ఇచ్చామని, ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టలేక కార్మికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రూ.200 కోట్లు సీఎం కేసీఆర్ మాఫీ చేశారన్నారు. ఆంధ్రోళ్ల పాలనలో చెరువులను ఆగం చేశారని, తెలంగాణ వచ్చిన తర్వాత చెరువులను పునరుద్ధరిస్తున్నామన్నారు. పత్తికి మద్దతు ధర పెంచే అంశం కేంద్రం పరిధిలోకి వస్తుందని తెలిసినా, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ నాయకులు విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల హామీల్లో ఉన్న పత్తి ధరకు అదనంగా 50శాతం పెంచుతామని ప్రకటించిన మోదీ కేవలం రూ.50 మాత్రమే పెంచారన్నారు. ధర విషయంలో రైతుల పక్షాన ప్రభుత్వం పోరాడుతుందన్నారు. బీజేపీ ముసుగులో టీడీపీ నేతలు వస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సాంస్కృతిక సారథి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్యేలు పుట్ట మధు, హన్మంత్‌షిండే, ప్రశాంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, సిరికొండ ప్రదీప్, ప్రశాంత్, క్రాంతి, టీబీజీకేఎస్ నేతలు కనకరాజు, కెంగర్ల మల్లయ్య, మిర్యాల రాజిరెడ్డి, అప్పాని శ్రీనివాస్, బడితల సమ్మయ్య, జాగృతి ఉపాధ్యక్షుడు దాస్యం విజయభాస్కర్, జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Connect with us

Latest Updates