Nizamabad MP

ఓరుగల్లు కోటపై విజయఢంకా మోగిస్తాం..

-వరంగల్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రూ.2000 కోట్లు
-వాటర్‌గ్రిడ్‌పై కాంగ్రెస్‌వి పొంతనలేని విమర్శలు
-టీటీడీపీలో స్థానం కోసమే దయాకర్ లొల్లి
-స్వార్థ ప్రయోజనాల కోసమే ఎర్ర పార్టీల ఆరాటం
-రైతుల అభివృద్ధిపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదు

Kalvakuntla Kavitha
రానున్న ఎన్నికల్లో ఓరుగల్లు కోటపై గులాబీ పార్టీ విజయఢంకా మోగిస్తుందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం నయీంనగర్‌లోని టీఆర్‌ఎస్ అర్బన్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని రంగాల్లో అంచనాలకు మించి అభివృద్ధి జరుగుతున్నా ఓర్వలేక ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని పేర్కొన్నారు. టీటీడీపీలో స్థానం కోసం బాబు దగ్గర మార్కులు కొట్టేయడానికి పాలకుర్తిలో దయాకర్‌లో సెన్సేషన్ సృష్టించాడని, ఐనా టీటీడీపీలో స్థానం దక్కలేదని అన్నారు. రెండు రోజుల క్రితం ప్రకటించిన ఆ కమిటీలో పట్టపగలే పట్టుబడి కేసుల పాలై జైలుకు వెళ్లొచ్చిన వ్యక్తికి పట్టం కట్టారని గుర్తు చేశారు.

ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. ఒకప్పుడు టీటీడీపీ అంటే తెలంగాణ ద్రోహుల పార్టీగా పిలిచేది, ఇపుడు తెలంగాణ దొంగల పార్టీగా మారిందన్నారు. వరంగల్‌ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో ఉన్నారని అన్నారు. అందుకుగాను ఇటీవలే చైనాకు వెళ్లి వచ్చిన ముఖ్యమంత్రి అక్కడి నుంచి వచ్చే నిధుల్లో నుంచి వరంగల్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రూ.2000 కోట్లు కేటాయించడానికి ప్రణాళిక రూపొందిస్తున్నారని అన్నారు. రింగ్‌రోడ్డు, టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేసి దేశంలోనే ఓరుగల్లును అగ్రగామిగా నిలపాలని ప్రయత్నిస్తున్నారన్నారు. గృహనిర్మాణాలను రెండు యూనిట్లుగా తీసుకుని పేదల అభివృద్ధి కోసం ఒక దగ్గర 756, మరో దగ్గర 500 ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో లేని అంశాల కన్నా పది పనులు ఎక్కువగానే చేశామని, వాటర్ గ్రిడ్‌పై కాంగ్రెస్ వాళ్లు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.

జలయజ్ఞంతో ధనయజ్ఞంగా మార్చిన ప్రాజెక్టులను రీడిజైన్ చేసి రైతులకు నీరందించడానికి ప్రయత్నాలు చేస్తుంటే లేనిపోని లొల్లి చేస్తున్నారన్నారు. ఎర్ర పార్టీల వారు స్వార్థ ప్రయోజనాల కోసం ఆశ వర్కర్లను, అంగన్‌వాడీ వర్కర్లను రోడ్లపైకి తీసుకొస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. తెలంగాణలో ప్రతీ విషయంలో రోడ్డు ఎక్కుతున్న ఈ పార్టీల వారు ఆంధ్రాలో ఎందుకు నోరు మెదపడం లేదని ఆమె ప్రశ్నించారు. ఆశ వర్కర్స్ విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విషయమని, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. మోడీకి కార్పొరేట్ వ్యవస్థపై ఉన్న పట్టింపు రైతులపై లేదని ఈ విషయాన్ని బిజెపి నాయకులు గుర్తించాలన్నారు. ప్రజాస్వామ్య ఉద్యమాలపై విలువలు ఉన్నాయని, మేడారం ఎన్‌కౌంటర్ విషయం సీఎం దృష్టికి తీసుకెళుతానని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానామిచ్చారు. ఈ సమావేశంలో ఎంపీ సీతారాంనాయక్, పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


Connect with us

Latest Updates