Nizamabad MP

ఆప్షన్ల పేరిట ఆంధ్రావారిని దింపుతున్నరు

కేంద్రం చంద్రబాబు రాజకీయ ఒత్తిడికి లొంగి హైకోర్టు విభజన చేయడంలేదు. బాబు తెలంగాణలో పెత్తనం చేయడానికి కోర్టులు బ్యాక్‌డోర్‌గా పనిచేస్తాయని భావిస్తున్నరు. గవర్నర్ దగ్గర రెండు రాష్ర్టాల సీఎంలు సమావేశమైనప్పుడు కూడా బిల్డింగ్ ఇస్తామని చెప్పినం. ప్రస్తుత హైకోర్టు వారికే ఇచ్చి మేమే గచ్చిబౌలికి పోతామన్నం. అయినా ఏమీ చేయలేదు.
- ఎంపీ కల్వకుంట్ల కవిత
-కోర్టుల ద్వారా తెలంగాణను ఏలాలనే కుట్ర
-బ్యాక్‌డోర్ పెత్తనం చేయాలని చంద్రబాబు ఎత్తు
-జంతర్‌మంతర్ కాదు… ఎక్కడైనా దీక్షకు సిద్ధం
-నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పష్టీకరణ

Kalvakuntla-Kavitha-press-meet-on-separate-high-court--to-Telangana

తెలంగాణ, ఆంధ్ర విడిపోయినప్పటికీ ఇంకో 20-30 సంవత్సరాలు కోర్టుల ద్వారా తెలంగాణను ఏలాలనే కుట్రలు చేస్తున్నారని.. ఆప్షన్ల పేరిట రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఆంధ్ర వాళ్లే జడ్జీలుగా ఉండేలా ఏపీ ప్రభుత్వం, కేంద్రంలోని కొందరు ఆంధ్ర పెద్దలు కుట్రలు అల్లుతున్నారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆంధ్రాలో వందల పోస్టులు ఖాళీలున్నా కుట్రపూరితంగా ఆప్షన్లు ఇచ్చి తెలంగాణలోని చిన్న కోర్టుల్లో సైతం నింపివేసి బ్యాక్‌డోర్ ద్వారా తెలంగాణను శాసించే కుట్ర జరుగుతున్నదన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి కవిత మాట్లాడారు. న్యాయాధికారుల అంశంపై జరుగుతున్న పరిణామాలపై సీఎం కేసీఆర్ తీవ్ర మనోవేదన చెందుతున్నారని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే….

తెలంగాణకు ప్రాతినిథ్యమేది..?
హైకోర్టులో ముగ్గురే తెలంగాణ వాళ్లున్నారు. మన దగ్గర 335 పోస్టులు ఉంటే ఇప్పటికీ 97 మంది ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు మన కోర్టుల్లో ఉన్నారు. తెలంగాణలో కోర్టుల్లోని అన్ని చిన్న చిన్న పోస్టుల్లో కూడా ఆంధ్ర వాళ్లను నింపే ప్రయత్నం చేస్తున్నారు. పదవీ విరమణకు దగ్గరగా ఉన్న వారిని ఆంధ్రలోనే ఉంచి.. వయసు తక్కువుండి, సర్వీసు ఎక్కువ ఉన్న వారిని తెలంగాణకు వేస్తున్నారు. ఆంధ్రలో జూనియర్, సీనియర్, సివిల్ జడ్జీలు అన్ని పోస్టులు కలుపుకొని వంద పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయినప్పటికీ అక్కడ పనిచేసే 130మంది ఇక్కడ జిల్లా కేంద్రాల్లో పనిచేసేందుకు ఆప్షన్లు పెడతారు. విభజన జరిగినపుడు ఎవరి ఇండ్లు వాళ్లు చక్కబెట్టుకోవాలి. కానీ ఇంకా కూడా మేం మీ దగ్గరనే ఉంటం.. మీ సూర్యాపేటలో, మీ ఆర్మూర్‌లో, మీ వేములవాడలో మేమే ఉంటం. మేమే అంతటా కూడా అన్ని అంశాల్ని మేమే కంట్రోల్ చేస్తమనే వైఖరి నిజంగా చాలా భయంకరమైనది

రండి… అందరం దీక్ష చేద్దాం
ఇవాళ తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు ఏ పార్టీకి చెందిన వారైనా సరే.. నిజమైన తెలంగాణ బిడ్డలు మీరైతే హైకోర్టు ముందుకు వచ్చి దీక్షలు చేయాలి. జానారెడ్డి, ఎల్ రమణ, దత్తన్న ఇలా అందరూ ముందుకు రావాలి. బీజేపీ నేతలు కేంద్రం దగ్గరికి వెళ్లి విభజన చేయించి తీసుకురండి. టీడీపీ నాయకులు హైకోర్టు దగ్గర దీక్ష చేయండి

సీఎం చాలా బాధతో ఉన్నరు..
సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలి. కానీ హైకోర్టు విభజనలో కేంద్రం విభజన చేయకుండా ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందున సీఎం కేసీఆర్ చాలా మనోవేదన, బాధతో ఉన్నరు. కచ్చితంగా అవసరమైతే ఢిల్లీ జంతర్‌మంతర్ దగ్గరికి, ఎక్కడికైతేంది? పోతం. దీక్ష చేస్తం. ఒక సీఎం ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి సరిగా స్పందించడంలేదని దీక్ష చేస్తే అది అంతర్జాతీయ వార్త అవుతుంది. ఇది దేశ రాజ్యాంగ వ్యవస్థకు అవమానకరమైన అంశం అవుతుంది.

ఏం చేసినా స్పందించని కేంద్రం..
రెండేండ్లుగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రధాని నరేంద్రమోదీకి పదిసార్లు వినతిపత్రాలు ఇచ్చారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పలుమార్లు ఈ అంశంపై ఫోన్‌లో మాట్లాడారు. 12మంది టీఆర్‌ఎస్ ఎంపీలం పార్లమెంటు సమావేశాల పొడవునా సభలు పని చేసినంత సేపు నిలబడి నిరసన తెలిపినం. మేం ఎప్పుడూ కూడా ఉద్యమాన్ని పట్టించుకోకపోవడం అనేది జరగలేదు. సంబంధిత మంత్రి ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో హైకోర్టు విభజన చేస్తామని హామీ ఇచ్చినరు. కానీ గెలిచిన తర్వాత ఆయన లేరు.. గెలిచినాయన లేరు. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు రాజకీయ ఒత్తిడికి లొంగి హైకోర్టు విభజన చేయడంలేదు. రాష్ట్రం విడిపోయినా ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణలో పెత్తనం చేయడానికి కోర్టులు బ్యాక్‌డోర్‌గా పని చేస్తాయని భావిస్తున్నరు అని కవిత పేర్కొన్నారు.

మేధావుల మౌనం బాధాకరం..
మల్లన్నసాగర్ విషయంలో 2013 చట్టం, 123 జీవోల్లో ఏది రైతులకు మేలు చేస్తుందనే విషయంపై రాజకీయ పార్టీలు ప్రజలకు జవాబు చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో విలేకరులు లేవనెత్తిన ఒకప్రశ్నకు జవాబిస్తూ .. ప్రొఫెసర్ కోదండరాంసార్ లాంటి వారు ఈ విషయాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరముందని, ఏ విధానమైతే రైతులకు ప్రయోజనమనే దానిపై ఆయన వివరించాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.


Connect with us

Latest Updates