Nizamabad MP

మంత్రుల మధ్య సమన్వయం లేదు

-ఉగ్రదాడుల నుంచి నేర్వని గుణపాఠం
-మల్టీ ఏజెన్సీ సెంటర్ ఏం చేస్తున్నది
-లోక్‌సభలో ఎంపీ కవిత ప్రశ్నల వర్షం

గురుదాస్‌పూర్, పఠాన్‌కోట్‌లలో ఉగ్రదాడులు జరుగుతున్నప్పుడు వివిధ మంత్రిత్వశాఖల మధ్య సమన్వయం కొరవడిందని టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. పఠాన్‌కోట్ దాడిపై లోక్‌సభలో బుధవారం జరిగిన చర్చ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ, ముంబాయి దాడులు జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని అన్నారు. గురుదాస్‌పూర్, పఠాన్‌కోట్ ఉగ్రదాడుల్ని ఎదుర్కోవడంలో అనేక పొరపాట్లు జరిగాయని అన్నారు. తప్పనిసరిగా మన వ్యూహంలో మార్పులు రావాల్సి ఉందని, స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానాల్లో మార్పులు రావాలని చెప్పారు. పంజాబ్ రాష్ట్రంలో పాకిస్థాన్ సరిహద్దు కలిగిన సుమారు 560 కి.మీ. ప్రాంతం ఉన్నదని, సరిహద్దు భద్రత కోసం ఇక్కడ కేవలం 12 బెటాలియన్లతో కూడిన 750 మంది బీఎస్‌ఎఫ్ బలగాలు మాత్రమే ఉన్నాయని అన్నారు. దాడులు జరిగిన తర్వాతనైనా బలగాల సంఖ్య పెరిగిందా అని ప్రశ్నించారు. ఒకవేళ తాను చెప్పిన సంఖ్య తప్పయితే సవరించాలని కూడా కోరారు. పఠాన్‌కోట్ దాడి సమయంలో కొన్ని పొరపాట్లు ఉన్నట్లు రక్షణ మంత్రి చెప్తున్నారని, వాటిని సభ దృష్టికి తీసుకురావాలని కోరారు.

Kalvakuntla Kavitha addressed in Parliament over pathankot incisent

ఇప్పటికైనా ఆ పొరపాట్లను సరిదిద్దుకున్నారా, ఎక్కడెక్కడ మన సైన్యం బలహీనంగా ఉందో వాటిని సవరించుకున్నారా అని ప్రశ్నించారు. భద్రత వ్యవహారాలపై ఉన్న క్యాబినెట్ కమిటీ గురుదాస్‌పూర్ ఉగ్రదాడి తర్వాత ఎన్నిసార్లు సమావేశమైందని ఆమె ప్రశ్నించారు. ఇలాంటి దాడులు జరిగినప్పుడు తగిన చర్యలు, జాగ్రత్తలు తీసుకోడానికి, ఎదుర్కోడానికి మనకంటూ ఏదైనా స్పష్టమైన వ్యవస్థ ఉన్నదా అని ఆమె ప్రశ్నించారు. ముంబై ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక మల్టీ ఏజెన్సీ కేంద్రాన్ని ఏర్పాటుచేసిందని, అది ఉనికిలో ఉందా, పనిచేస్తోందా, ఒకవేళ పనిచేస్తున్నట్లయితే ఏం చేస్తున్నదో వివరించాలని కోరారు. ఇంటెలిజెన్స్ విభాగంలో ప్రస్తుతం 30 శాతం పోస్టులు ఖాళీగానే ఉన్నట్లు తెలిసిందని, ఆ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదో వివరణ ఇవ్వాలని కోరారు. రక్షణ శాఖకు 2014-15 బడ్జెట్‌లో జరిగిన కేటాయింపుల్లో 2015 డిసెంబరు నాటికి కేవలం 24శాతం మాత్రమే ఖర్చు చేసినట్లు సమాచారం అందుతున్నదని, ఇది నిజమేనా అని అడిగారు. ఒకవేళ నిజమే అయితే ఇంత ఎక్కువ మొత్తంలో బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నా ఖర్చు చేయడంలేదంటే సమాజానికి మనం ఏం సందేశం పంపుతున్నట్లు అని ఆమె ప్రశ్నించారు.

ఎలక్ట్రానిక్ క్లస్టర్లను ప్రోత్సహిస్తాం..
-తెలంగాణలో ఈ రంగానికి అవకాశాలు ఎక్కువ..
-ఎంపీ కవిత ప్రశ్నకు కేంద్రమంత్రి రవిశంకర్ సమాధానం
తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ క్లస్టర్ నిర్మాణానికి చాలా అవకాశాలున్నాయని, ఆ రాష్ట్రంలో వీటిని ప్రోత్సహించడానికి కేంద్రం సానుకూలంగా ఉందని కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల ఐటీ మంత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేశానని, మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా తుదిరూపం ఇవ్వడానికి కసరత్తు జరుగుతున్నదని తెలిపారు. దేశంలో ఎలక్ట్రానిక్ క్లస్టర్ల నిర్మాణానికి కేంద్రం-రాష్ట్రాల మధ్య సమన్వయంతోపాటు రాష్ట్రాలు కూడా కీలక భూమిక పోషించాల్సి ఉంటుందన్నారు. నాలుగైదేండ్లలో దేశంలో ఎలక్ట్రానిక్ ఉపకరణాల దిగుమతి.. చమురు దిగుమతి కంటే పెరిగిపోతుందని, దీనిపై కేంద్రం ఎలాంటి వైఖరి అవలంబించబోతున్నదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత లోక్‌సభలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు. దీనికి మంత్రి రవిశంకర్ బదులిస్తూ ఎలక్ట్రానిక్ క్లస్టర్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తున్నదని, అందువల్ల ఈ రంగంలో వృద్ధి స్పష్టంగా కనిపిస్తున్నదని చెప్పారు. దేశంలో చాలాచోట్ల ఎలక్ట్రానిక్ క్లస్టర్లకు డిమాండ్ ఉందని, అందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఉన్నదని, ఆ రాష్ట్రంలో తగిన ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు.


Connect with us

Latest Updates