Nizamabad MP

నిజామాబాద్‌లో స్పైస్ ప్లాంట్ నెలకొల్పండి

-రైతుల నుంచి నేరుగా పసుపును కొనుగోలు చేయండి
-పసుపు బోర్డు ఏర్పాటుకు మద్దతు ఇవ్వండి
-రాందేవ్‌బాబాకు ఎంపీ కవిత విజ్ఞప్తి

mp-kalvakuntla-kavitha-met-baba-ramdev

రైతులు పండిస్తున్న పసుపును పతంజలి గ్రూపు ద్వారా నేరుగా కొనుగోలు చేయాలని యోగాగురు బాబా రాందేవ్‌కు ఎంపీ కవిత విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం గుజరాత్‌లో రైతుల నుంచి నేరుగా దానిమ్మ పండ్లను, నాసిక్‌లో కమలాపండ్లను (ఆరెంజ్) కొనుగోలు చేస్తున్నట్టుగానే నిజామాబాద్ జిల్లాలో రైతుల నుంచి పసుపును కొనుగోలు చేయాలని కోరారు. దక్షిణ భారతదేశంలో వ్యాపార విస్తరణకు మాత్రమే కాకుంగా ఎగుమతిని కూడా దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్‌లో పతంజలి స్పైస్ ప్లాంట్‌ను నెలకొల్పాలని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలను ఇవ్వడానికి తనవంతు కృషిచేస్తానని రాందేవ్‌కు కవిత చెప్పారు. పసుపు బోర్డును ఏర్పాటు చేయాల్సిందిగా ఇప్పటికే తాను రెండుసార్లు ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేశానని, ఈ మేరకు చొరవ తీసుకుని ప్రధానితో మాట్లాడి ప్రతిపాదన సాకారమయ్యేలా కృషి చేయాలని కోరారు.

ఎంపీ కవిత విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రాందేవ్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని, ప్రధానితో మాట్లాడి బోర్డు ఏర్పాటు విషయంలో చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. రైతుల ఇబ్బందుల పట్ల లోతైన అవగాహన ఉండటంతో నేరుగా వారినుంచే ఉత్పత్తులను కొంటున్న ప్రయత్నం అభినందనీయమని కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణలోని పసుపు రైతుల విషయంలో కూడా సానుకూలంగా ఆలోచించాలని కోరారు. తెలంగాణలోని సాగు విస్తీర్ణంలో సుమారు 40% పసుపు పంటను రైతులు పండిస్తున్నారని, దేశం మొత్తం ఉత్పత్తిలో సుమారు 63% తెలంగాణ నుంచే వస్తున్నదని ఆయనకు వివరించారు. పసుపు కొనుగోలు కేంద్రాలు ఎక్కువగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్‌లోనే ఉన్నాయని ఎంపీ కవిత తెలిపారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, విలువలను గౌరవిస్తూ ఉత్పత్తులను తయారుచేస్తున్న పతంజలి గ్రూపు స్వల్ప కాలంలోనే ప్రపంచస్థాయి గుర్తింపు పొందిందని, మన సంస్కృతిలో భాగమైపోయిన పసుపు విషయంలో కూడా అటు రైతులకు, ఇటు పతంజలి వ్యాపార విస్తరణకు దోహదపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పతంజలి గ్రూపు ద్వారా ఒక స్పైస్ (మసాలా) ప్లాంట్‌ను నెలకొల్పడం ద్వారా ఉత్పత్తులను తయారుచేయడమే కాకుండా దక్షిణ భారతదేశంలో విక్రయాన్ని పెంచుకోడానికి, ప్రజాదరణ పొందడానికి, అంతిమంగా ఎగుమతి చేయడానికి కూడా నిజామాబాద్ కేంద్రంగా ఉపకరిస్తుంన్నదని చెప్పారు. ఒకసారి నిజామాబాద్ జిల్లా ను సందర్శించి రైతులతో మాట్లాడటానికి ఏర్పా టు చేస్తామని రాందేవ్‌బాబాకు ఎంపీ కవిత హామీ ఇచ్చారు.

రబ్బరు, కొబ్బరి ఉత్పత్తులకు ప్రత్యేకంగా బోర్డులు ఉన్నట్టుగానే పసుపునకు కూడా బోర్డు ఉండాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. వివిధ అనుబంధ ఉత్పత్తుల్లో రంగు కోసం, ఔషధ విలువల కోసం కూడా పసుపును వినియోగిస్తున్నారని, ప్రత్యేక బోర్డు ను ఏర్పాటు చేయడం ద్వారా రైతుల్లో ఉత్సా హం కల్పించి ఉత్పత్తిని పెంచడంతో పాటు మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించవచ్చునని, పరిశోధనను కూడా తీవ్రం చేయవచ్చునని రాందేవ్‌కు ఎంపీ కవిత తెలిపారు. ప్రతిఏటా కనీస గిట్టుబాటు ధర లేకపోవడం, తరచుగా ధర పడిపోతూ ఉండటంతో రైతులు నిరుత్సాహానికి గురవుతున్నారని, ఇతర పంటలవైపు ఆలోచిస్తున్నారని ఆమె అన్నారు. ప్రస్తుతం దేశంలో 25 పంటలకు కనీస గిట్టుబాటు ధర నిర్ణయించే వ్యవస్థ ఉన్నదని,కానీ పసుపుపంటకు మాత్రం అలాంటి వ్యవస్థ లేకపోగా ఆ పంటల జాబితాలో చోటు పొందలేకపోయిందన్నారు.ఈ నేపథ్యంలో ప్రధానితో మాట్లాడి పసుపు పంటకు ప్రత్యేకబోర్డును ఏర్పాటు చేయడంలో చొరవ తీసుకోవాలని రాందేవ్‌బాబాను కవిత కోరారు. ఈ మేరకు ఒక విజ్ఞాపనపత్రాన్ని ఆయనకు అందజేశారు.


Connect with us

Latest Updates