Nizamabad MP

నగర మాస్టర్ ప్లాన్ సిద్ధం

టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలతో పాటు పట్టణాల అభివృద్ధిపై దృష్టి సారించిందని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఈక్రమంలోనే నిజామాబాద్ నగర సర్వతోముఖాభివృద్ధికి ఎనిమిది నెలలు కష్టపడి కొత్త మాస్లర్‌ప్లాన్‌ను రూపొందించామని తెలిపారు. 1974 సంవత్సరంలో రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌కు కాలం చెల్లిందని, కొత్త మాస్టర్‌ప్లాన్‌తో నగర రూపురేఖలు మారుస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేసిన అనంతరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌజ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆమె మాటల్లోనే.. కార్పొరేషన్‌ను సుందర నగరంగా తీర్చిదిద్దాలనే తపన నాలో ఉంది. ప్రత్యేక దృష్టితో మాస్టర్‌ప్లాన్ తయారు చేయించాను.

Kalvakuntla Kavitha visit in Nizamabad town01

నెలలు కష్టపడితే మాస్టర్‌ప్లాన్ కొలిక్కివచ్చింది. దీనిని అమలు చేయాలంటే ముందుగా భూగర్భ డ్రైనేజీ పనులు, తాగునీటి పైపులైను పనులు పూర్తిచేయాల్సి ఉంది. గత ప్రభుత్వం భూగర్భ డ్రైనేజీకి రూపొందించిన ప్రణాళికలో లోపాలు ఉన్నాయి. నగర పరిధిలో ఉన్న 24 కాలనీలను యూజీడీలో కలపలేదు. యూజీడీని ప్రత్యక్షంగా పర్యవేక్షించాను. ఆ కాలనీలను ఇప్పుడు కలిపాం. గత ప్రభుత్వం కేవలం రూ. 94 కోట్లు కేటాయించింది. కానీ, 60 శాతం కూడా పనులు పూర్తిచేయలేదు. డ్రైనేజీ పనులు, తాగునీటి పైపులైన్లు, కొత్త ఇంటినెంబర్లు తదితర పనులు పూర్తిచేసిన తర్వాత అద్దంలా ఉండే సీసీ రోడ్లు వేస్తాం. ఈ పథకం పూర్తికావటానికి రూ. 204 కోట్లు అవసరం అవుతున్నాయి. 24 కాలనీలను కొత్తగా చేర్చడంతో రూ. 50 కోట్ల అదనపు వ్యయం అవుతున్నది. ప్రతిపాదనలు కూడా తయారయ్యాయి. యూజీడీ, డ్రింకింగ్‌వాటర్ పనులు పూర్తయిన తర్వాత మాస్టర్‌ప్లాన్ అమలు పనులు ప్రారంభిస్తాం. కార్పొరేషన్ పరిధిలో 40 వేల అక్రమ నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వీటిని ఎంతోకొంత ఫీజు తీసుకొని లీగలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. లీగల్‌గా నల్లాలు ఉంటేనే మంచినీటి సరఫరాపై ప్రజాప్రతినిధులను నిలదీసే హక్కు ప్రజలకు ఉంటుంది.

కౌన్సిల్‌లో తీర్మానం చేసిన తర్వాత ఈ 40 వేల నల్లా కనెక్షన్ల విషయంలో పాలకవర్గం నిర్ణయం తీసుకుంటుంది. చెత్తను పడవేసేందుకు 43 ఎకరాల స్థలం ఉంది. కానీ, చెత్తను పోగుచేయటానికి మెకానిజమ్ సరిగాలేదు. సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, యూజీడీ, డ్రింకింగ్‌వాటర్ గాడిన పడితేనే సమస్యలు తీరుతాయి. అరవై ఏళ్లలో పేరుకపోయిన సమస్యలను ఒక్క ఏడాదిలో పరిష్కరించటం సాధ్యంకాదు. అయినా సాధ్యమైనంత వేగంగా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. నిజామాబాద్ స్మార్ట్ సిటీగా ఎంపికకాలేదు. 20 మార్కులు తక్కువగా వచ్చాయి. రాబోయే ఏడాదిలో లోపాలను పూరించుకొని, మిగిలిన 20 మార్కులు కూడా తెప్పించి స్మార్ట్‌సిటీల జాబితాలో నిజామాబాద్‌ను చేర్చేందుకు బాధ్యత తీసుకుంటా. ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. జిల్లా దవాఖాన, మెడికల్ కాలేజీ అవసరాల కోసం సీఎం రూ. 90 కోట్లు విడుదల చేశారు.

నగరంలో నీటిపారుదల శాఖ పరిధిలోని కొన్ని కాల్వలు ఉన్నా యి. కొన్ని ఆక్రమణలకు గురయ్యాయి. కొన్ని మురికికాల్వలు గా మారిపోయాయి. నీటిపారుదలశాఖ అధికారుల తో మాట్లాడిన తర్వాత కాల్వలపై సమీక్షిస్తాం. నగరానికి గత వేసవిలో తాగునీటి కొరత లేకుండా చూశాం. ఇప్పుడు నిజాంసాగర్, శ్రీరాంసాగర్‌లలో నీళ్లు లేవు. మహారాష్ట్ర నుంచి నీరు విడుదల చేస్తేనే తాగునీటి కొరత తీరుతుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి 2 టీఎంసీలు విడుదల చేయాలని కోరాం. వారు నీళ్లు విడుదల చేస్తే తాగునీటి సమస్య తీరుతుంది. ఒక వేళ మహారాష్ట్ర సర్కారు స్పందించకుంటే బోర్లపైనే ఆధారపడాల్సి వ స్తుంది. అని ఎంపీ కవిత అన్నారు. నగరంలో పార్కులు సరిపడా లేవని, 50 డివిజన్లలో 50 పార్కులు ఏర్పాటుచేసి నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచటమే తన లక్ష్యమని తెలిపారు.


Connect with us

Latest Updates