Nizamabad MP

ముందుచూపుతోనే తప్పిన నీటి తిప్పలు

-పరిష్కారానికి రూ. 32 కోట్లు
-యుద్ధ ప్రాతిపదికన చర్యలు
-బీడీ కట్టలపై పుర్రెగుర్తు సైజు తగ్గింపునకు పోరాడుతాం
-మిషన్‌తో చెరువులకు పూర్వవైభవం
-వచ్చే ఏడాది బోధన్ బీదర్ రైల్వే లైన్‌పై దృష్టి
-ఎంపీ కల్వకుంట్ల కవిత వెల్లడి
టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ముందుచూపు ఉందని, ఈ వేసవిలో ఏర్పడే తాగునీటి కొరతను నవంబర్‌లోనే ఊహించిందని ఎంపీ కవిత అన్నారు. ఫలితంగానే వేసవికి ముందే తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం రూ.32 కోట్లు విడుదల చేసిందన్నారు. ఈ నిధులు మంజూరుతో ఈ వేసవిలో ఎక్కడ తాగునీటి సమస్య ఏర్పడినా, వెంటనే పరిష్కరించుకుంటున్నారన్నారు.

Kalvakuntla Kavitha visit to Bodhan Constituency (21-04-16) (15)

బుధవారం బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలో ఆమె 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. అనంతరం ఖండ్‌గావ్ గ్రామంలో రూ.25 కోట్లతో నిర్మించనున్న ఖండ్‌గావ్ – బండారుపల్లి బీటీ రోడ్డుకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఆ రెండు గ్రామాల్లో జరిగిన సభల్లో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ బీడీ కట్టలపై పుర్రె గుర్తు సైజ్ తగ్గించాలని బీడీ కార్మికులు అడుగుతున్నారని, వారి డిమాండ్‌ను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ఒత్తిడి తీసుకొచ్చామని ఎంపీ అన్నారు.

బీడీ కట్టలపై పుర్రె గుర్తు పరిమాణం 80 శాతంగా ఉండాలన్న నిర్ణయానికి వ్యతిరేకత రావటంతో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసిందని, ఈ కమిటీ ఆ పరిమాణాన్ని 50 శాతానికి తగ్గించే అవకాశం ఉందన్నారు. దీనిపై మిగతా రాష్ర్టాల ఎంపీలను కలుపుకొని వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు.

అన్ని గ్రామాలకు మహిళా భవనాలు: గ్రామాల్లో స్థలాలు చూపిస్తే మహిళా భవనాలు నిర్మిస్తామని ఎంపీ కవిత వెల్లడించారు. అలాగే, యువకుల కోసం యూత్ భవనాలు నిర్మించుకోవాలని, ఈ యూత్ భవన్‌లో ఆట పరికరాలు, లైబ్రరీ ఏర్పాటును ప్రభుత్వంతో సంబంధం లేకుండా సొంతంగా ఖర్చుచేస్తానని ఆమె అన్నారు. ఖండ్‌గావ్ ఎత్తిపోతల పథకం తిరిగి పనిచేసేలా చర్యలు తీసుకుంటామని, కల్దుర్కి ఎత్తిపోతల పథకానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఖండ్‌గావ్ నుంచి నిజామాబాద్‌కు జానకంపేట్ మీదుగా అంతర్‌రాష్ట్ర రహదారి నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తానన్నారు.

కూలీలకు 15 రోజులపాటు ఉపాధి కల్పించాలి
జిల్లాలో కూలీలకు 150 రోజులకు తక్కువ కాకుండా ఉపాధి పనులు కల్పించాలని, ఉపాధి కూలీలకు కూలీ కూడా రోజుకు 150 రూపాయలకు తక్కువకాకుండా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచిస్తానన్నారు.

వచ్చే ఏడాది నుంచి బోధన్ – బీదర్ రైల్వేలైన్‌పై దృష్టి
బోధన్ నుంచి బీదర్‌కు రైల్వే లైన్ ఏర్పాటుపై వచ్చే సంవత్సరం నుంచి దృష్టిని పెడతానని, ఈ రైల్వేలైను సాధించేందుకు కృషిచేస్తానని ఎంపీ కవిత హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ మీదుగా వెళ్లే రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను పెంచాలని రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆమె హామీ ఇచ్చారు.

పెంటాఖుర్దు గ్రామానికి వరాలు: పెంటాఖుర్దులో మరో చెరువుకు కూడా మిషన్ కాకతీయ కింద నిధులు మంజూరు చేస్తామని, గ్రామానికి మహిళా భవన్‌ను మంజూరుచేస్తామని ఎంపీ కవిత హామీ ఇచ్చారు.


Connect with us

Latest Updates