Nizamabad MP

ప‌సుపు బోర్డు ఏర్పాటుకు ప్ర‌ధానికి లేఖ రాయాల‌ని అసోం సీఎం సోనోవాల్‌ను కోరిన ఎంపి క‌విత‌

ప‌సుపు రైతుల‌ను ఆదుకునేందుకు జాతీయ ప‌సుపు బోర్డు ఏర్పాటు చేయాల‌ని, ప‌సుపుకు క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర ప్ర‌క‌టించాల‌ని కోరుతూ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి లేఖ రాయాల‌ని అసోం సీఎం స‌ర్బానంద సోనోవాల్‌ను నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత కోరారు. శ‌నివారం నిజామాబాద్ అర్బ‌న్‌,రూర‌ల్ ఎమ్మెల్యేలు బిగాల గ‌ణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌, ఆర్మూర్, కోరుట్ల ఎమ్మెల్యేలు ఆశ‌న్న‌గారి జీవ‌న్ రెడ్డి, కె.విద్యాసాగ‌ర్ రావుల‌తో క‌ల‌సి ఆమె అసోం వెళ్లారు. సాయంత్రం గౌహ‌తిలో సోనోవాల్‌తో స‌మావేశమైన ఎంపి క‌విత దేశ వ్యాప్తంగా ప‌సుపు రైతుల ద‌య‌నీయ ప‌రిస్థితిని వివ‌రించారు. అసోంలో 2011-12 ఆర్థిక సంవ‌త్స‌రంలో 13వేల 440 ట‌న్నుల ప‌సుపు పండింద‌ని, 2015-16లో 16వేల‌144 ట‌న్నులకు ప‌సుపు పెరిగింద‌న్నారు. ప‌సుపు సాగు విస్తీర్ణం పెర‌గ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని వివ‌రించారు.

MP Kavitha Met Assam CM & discussed the need to have a national Turmeric board-1

కాఫీబోర్డు, కాయిర్ బోర్డు, ర‌బ్బ‌ర్ బోర్డుల మాదిరిగానే ప‌సుపు బోర్డును కూడా ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ఎంపి క‌విత‌. నోడ‌ల్ ఏజెన్సీగా ప‌సుపు బోర్డు ప‌నిచేస్తుంద‌ని, సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని రైతుల‌కు అందింవ‌చ్చ‌న్నారు. దేశీయ అవ‌స‌రాల‌కు వినియోగించుకుంటూనే ఇత‌ర దేశాల‌కూ ఎగుమ‌తి చేయ‌డం వ‌ల్ల దేశానికే కాక ప‌సుపు రైతులకూ ఆర్థిక‌ప‌ర‌మైన‌ ల‌బ్ది చేకూరుతుంద‌ని చెప్పారు. వాణిజ్య‌ప‌రంగా ప‌సుపు పంట ఉప‌యోగంగా ఉంటుంద‌న్నారు. ఆహారంలో ఫ్ల‌వేర్ కోసం, ఉద‌ర సంబంధ రుగ్మ‌త‌లు, ఫుడ్ పాయిజ‌న్ అయిన‌ప్పుడు, టూత్ పేస్టులు, సౌంద‌ర్య సాధ‌నాలలో, వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌లో నేచుర‌ల్ డైగానూ ప‌సుపును ఉప‌యోగిస్తార‌ని ఎంపి క‌విత అసోం సిఎం సోనోవాల్‌కు వివ‌రించారు.

సుగుంధ ద్రవ్యాల బోర్డు 54 ర‌కాల పంట‌ల‌ను చూస్తున్న‌ద‌ని తెలిపారు. అయితే ప‌సుపు పంట ఒక్క‌టే ఇత‌ర స్పైసీస్ ర‌కాల‌క‌న్నా భిన్న‌మైన పంట అని తెలిపారు. ప‌సుపు పండించే రైతులు ఇత‌ర పంట‌లు పండించే రైతుల‌క‌న్నా ఎక్కువ‌గా శ్ర‌మ‌ప‌డ‌తార‌ని, 10 నెల‌ల సుదీర్ఘ స‌మ‌యం త‌ర‌వాతే ప‌సుపు పంట చేతికివ‌స్తుందని క‌విత చెప్పారు. అంత క‌ష్ట‌ప‌డి పండించిన పసుపుకు ధ‌ర అంతంత మాత్రంగానే ఉంటుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వ‌రి, గోధుమ‌లు, ప‌ప్పు దినుసుల‌ మాదిరిగా అధిక దిగుబ‌డినిచ్చే ర‌కాలు, తెగుళ్ల‌ను త‌ట్టుకునే ర‌కాలు, వ‌ర్షాభావాన్ని త‌ట్టుకునే ప‌సుపు ర‌కాలు లేవ‌న్నారు.

జాతీయ ప‌సుపు బోర్డు ఏర్పాటు వ‌ల్ల జియోగ్రాఫిక‌ల్ ఐడెంటిఫికేట‌ర్ (జిఐ) టాగ్‌ను వివిధ ప్రాంతాల్లో పండే ప‌సుపు ర‌కాల‌కు అనుసంధానించే ప్ర‌క్రియ వేగ‌వంతం అవుతుంద‌న్నారు. దీని వ‌ల్ల భార‌తీయ ప‌సుపు ర‌కాల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా బ్రాండ్ వాల్యూ పెరుగుతుంద‌న్నారు. అసోంలో స్థానికంగా పండే జోర్హాట్ ప‌సుపుకు ప్ర‌పంచ వ్యాప్తంగా డిమాండ్ వ‌స్తుంద‌ని క‌విత అసోం సీఎం సోనోవాల్‌కు వివ‌రించారు.

కేంద్రం ప్ర‌భుత్వం 25 ర‌కాల పంట‌ల‌కు క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర‌ను అందిస్తున్న‌ద‌ని చెప్పారు.అయితే ప‌సుపుకు మ‌ద్ధ‌తు ధ‌ర లేక‌పోవ‌డంతో వ్యాపారులు త‌క్కువ ధ‌ర‌కు కొనుగోలు చేసి, మూడు నుంచి ఐదు రెట్ల‌కు విక్ర‌యించుకుంటూ లాభాలు గ‌డిస్తున్నార‌న్నారు. కేంద్ర వ్యవ‌సాయ మంత్రిత్వ శాఖ ఇత‌ర ర‌కాల‌కు అందిస్తున్న‌ట్లే ప‌సుపుకూ క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర‌ను ప్ర‌క‌టిస్తే ప‌సుపు రైతుల‌కు భ‌రోసా ల‌భిస్తుంద‌న్నారు. అలాగే ప‌ప్పు దినుసుల‌ను కొనుగోలు చేస్తున్న నాఫెడ్ ప‌సుపును రైతుల‌నుండి నేరుగా కొనుగోలు చేస్తే ప‌సుపు రైతుల‌కు మేలు జ‌రుగుతుంద‌ని క‌విత వివ‌రించారు. సానుకూలంగా స్పందించిన సోనోవాల్ ప‌సుపు రైతుల‌ను ఆదుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న క‌వితను అభినందించారు. ప్ర‌ధానికి లేఖ రాస్తాన‌ని క‌విత‌కు హామీనిచ్చారు.


Connect with us

Latest Updates