తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఫలాలు అందరికీ అందాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసిఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తున్నారన్నారు.
మంగళవారం ఆర్మూర్ నియోజకవర్గం పిప్రి గ్రామంలో గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో కవిత మాట్లాడుతూ కులవృత్తిదారులు, చేతివృత్తిదారులు, వ్యవసాయదారులు సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం ఆలోచించే సీఎం చేపల పెంపకంను ప్రొత్సహించే కార్యక్రమం చేపట్టారని, తాజాగా గొల్ల, కురుమలు బాగుండేలా గొర్రెల పంపిణీ చేపట్టారని తెలిపారు. పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. పెద్ద నోట్ల రద్దు చేసిన టైంలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సీఎం కేసిఆర్ నడుంకు కట్టుకునే సంచిలో డబ్బు దాచుకునే గొల్ల, కురుమలకు డబ్బును మార్చుకునే అవకాశం కల్పించాలని కోరిన విషయాన్ని ప్రస్తావించిన కవిత గొల్ల, కురుమలంటే సీఎంకు ఎనలేని ప్రేమ అని చెప్పారు. 5వేల కోట్లతో చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం వచ్చే మూడేళ్లలో రూ. 25వేల కోట్ల సంపదగా మారాలన్నారు. గొర్రెలు జబ్బుపడితే 1962 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేస్తే సంచార వైద్యశాల గొర్రెల మంద వద్దకు వస్తుందని కవిత చెప్పారు. బలవర్ధకమైన పశుగ్రాసం కోసం ప్రభుత్వం సబ్సిడీపై పశుగ్రాసం విత్తనాలను సరఫరా చేస్తున్నదని తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణ నుంచి విదేశాలకు మాంసం ఎగుమతి జరగాలన్నారు.
వ్యవసాయంతో పాటు వృత్తిని కొనసాగిస్తున్న గొల్ల కురుమలకు సీఎం కేసిఆర్ డబుల్ బొనాంజాను అందజేస్తున్నారన్నారు ఎంపి కవిత. కుటుంబానికి 93 వేల రూపాయల విలువైన గొర్రెలను అందజేస్తూనే వ్యవసాయానికి 8 వేల రూపాయల పెట్టుబడిని కూడా ప్రభుత్వమే సమకూరుస్తుందని తెలిపారు. బీడీలు చుట్టే మహిళలకు ఫించన్ వస్తున్న విషయం తెలిసిందేనన్నారు.వృద్ధాప్య,వితంతు, వికలాంగులతో పాటు ఒంటరి మహిళలకు పెన్షన్ అందిస్తున్న విషయం మీకు తెలిసిందేనన్నారు. పెళ్లీడు కొచ్చిన ఎస్సీ, ఎస్టీ ఆడపిల్లలకు వివాహం జరిపించడం భారం కాకూడదని ప్రవేశపెట్టిని కళ్యాణ లక్ష్మి పథకం మాకూ వర్తింప చేయాలని బిసిలు కోరితే వారికీ అందజేస్తున్న ప్రభుత్వం ఆలోచనను సద్వినియోగం చేసుకోవాలని ఎంపి కవిత కోరారు. విద్యార్థులకు బుక్స్, స్కూల్ యూనిఫారాలు, షూస్ ఉచితంగా అందజేస్తున్నామని, గురుకులాల ద్వారా బడుగు, బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని కవిత వివరించారు.