ఎంపి కవిత
మొక్కలను నాటడంతోనే పని అయిపోయిందనుకోకుండా…వాటిని సంరక్షించే బాధ్యతను కూడా మనమే తీసుకోవాలని నిజామాబాద్ ఎం.పి శ్రీమతి కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని డిఎల్ఎఫ్ ఆవరణలో ఆమె మొక్కలు నాటారు. సైబరాబాద్ షీ-టీమ్స్ గ్రీన్ వుమెన్ పేరిట హరిత హారం కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగులు, పోలీసులు, కాలనీవాసులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కవిత మాట్లాడుతూ….పోలీసులంటే చుక్కలు చూపిస్తరనే భావన గతంలో ఉండేదని, ఇప్పుడు మొక్కలు పట్టుకుని తిరుగుతూ పర్యావరణ ప్రేమికులుగా మారిపోయారని ప్రజలంటున్నారన్నారు.
2.5 లక్షల మొక్కలను పోలీసు శాఖ నాటుతోందని, పోలీసు స్టేషన్ల ఆవరణలు కూడా మున్ముందు హరిత పోలీసు స్టేషన్లుగా మారిపోనున్నాయని కవిత తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో హరిత కార్యక్రమం జరుగుతున్నదన్నారు. చెరువుల పునరుద్ధరణకు సిఎం కేసిఆర్ రెండున్నర వేల రూపాయలను కేటాయించారని, దాదాపు అంతే మొత్తంలో హరిత హారం కార్యక్రమానికి కేటాయించారని , .ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఇలా పర్యావరణ రక్షణకు నిధులు కేటాయించిన దాఖలాలు లేవని కవిత వివరించారు. ఇది తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు.
మహిళలు స్వేచ్చగా తిరుగుతున్నారు
మహిళలు స్వేచ్చగా తిరగగలుగుతున్నారని, దీనికి కారణం షీ టీమ్స్ అని ప్రసంశించారు ఎంపి కవిత. తాను ఒక మహిళగా కూడా సేఫ్‌గా ఫీలవుతున్నానని, తన లాగే మహిళలు ఫీల్ అవుతున్నారన్నారు. ప్రతి మహిళా ఆత్మవిశ్వాసంతో తిరుగుతున్నారని తెలిపారు. 18 నెలల కాలంలో 1139 కేసులను షీ టీమ్స్ బుక్ చేశాయని, 1275 మందిని అదుపులోకి తీసుకున్నాయని కవిత వివరించారు. పోకిరీలు, ఆకతాయిల పనిపడుతున్న షీ టీమ్స్‌కు కవిత అభినందనలు తెలిపారు. సమావేశంలో శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఇంఛార్జి సిపి మహేశ్ భగవత్, డిసిపి కార్తికేయ, ఏసిపి రమణ కుమార్, షీ టీమ్స్ అడిషనల్ డిసిపి సలీమా, ఏసిపి స్నేహిత, స్థానిక కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్, సుజాతా నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.