Nizamabad MP

మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్నాం

-ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేస్తాం
-రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మా రెడ్డి
-నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వైద్యారోగ్యంపై సమీక్ష
-మంత్రికి సమస్యలను వివరించిన ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు

Kalakvakuntla kavitha participated in Nizamabad health  department review

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యరంగాన్ని పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సీ లక్ష్మా రెడ్డి అన్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలన్నది సీఎం కేసీఆర్ విజన్ అని మంత్రి చెప్పారు. ఆ దిశగా ప్రాథమిక స్థాయినుంచి జిల్లా కేంద్రాల దాక అన్ని దవాఖానల్లో మౌలిక వసతులకు ఈసారి బడ్జెట్‌లో పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన సమావేశంలో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వైద్యారోగ్య బడ్జెట్ అంచనాలను ఎంపీ కల్వకుంట్ల కవితతో కలిసి ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ గత పాలకులు ఎలాంటి శాస్త్రీయత పాటించకుండా కేవలం బడ్జెట్ శాతం పెంచుకుంటూ పోయారని, దానికి భిన్నంగా కేసీఆర్ ప్రభుత్వం సమస్యలు, అవసరాలు గుర్తించి కేటాయింపులు జరుపుతున్నదని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో ఐదు క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్లు, నాలుగు డయాలసిస్ సెంటర్లు, ప్రతి స్థాయిలో అధునాతన పరికరాలతో వైద్య పరీక్షలు అందుబాటులోకి తేవాలని సంకల్పించామని వివరించారు. మందుల కోసం గత బడ్జెట్‌లో రూ. 114 కోట్లు కేటాయించగా అవసరాలను గుర్తించి ఈసారి రూ. 300 కోట్ల వరకు పెంచామన్నారు. దవాఖానల్లో పారిశుద్ధ్యం, పడకలు, పరిశుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. హైవేల సమీపంలో ట్రామాసెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలుచేస్తుందన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించడానికి సీఎం కేసీఆర్ ఎన్ని నిధులైనా ఇస్తామని ప్రకటించారని ఆయన గుర్తు చేశారు.

నిజామాబాద్‌కు కావలిసినవి ఇవీ..
నిజామాబాద్ జిల్లా ప్రధాన దవాఖానలో సిటీస్కాన్, ఎమ్మారై స్కాన్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఎంపీ కవిత మంత్రిని కోరారు. పీడియాట్రిక్, మెటర్నిటీ, బర్న్స్ వార్డులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నిజామాబాద్‌లో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్న నేపథ్యంలో కాలేజీకి అనుబంధంగా హాస్పిటల్‌ను నడిపాలంటే ప్రస్తుతమున్న స్థలం సరిపోదని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. దీనికి మంత్రి బదులిస్తూ సిటీలో పది కిలోమీటర్లలోపు మెడికల్ కాలేజీని పెట్టుకోవచ్చని సూచించారు. స్థలం ఎంపిక బాధ్యతను కలెక్టర్ యోగితా రాణాకు అప్పగించారు. మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో నూతన మెటర్నిటీ ఆసుపత్రిని మంజూరు చేయాలని కవిత కోరారు. ఏరియా ఆసుపత్రులకు సోలార్ పవర్ వినియోగించాలని, మెడికల్ కాలేజ్ విద్యార్థులకు వాహన సౌకర్యం కల్పించాలని ఆమె సూచించారు. రూ. 1.78 కోట్ల ప్రాపర్టీ టాక్స్, రూ. 1.40 కోట్లు విద్యుత్ బిల్లుల బకాయిలు ఉన్నాయని, వీటిని త్వరగా విడుదల చేయాలన్నారు.

అలాగే జగిత్యాల, సిరిసిల్ల, రామగుండంలలో ట్రామా సెంటర్లు పెట్టాలని, జగిత్యాల ధరూర్ క్యాంపులోని ఎస్సారెస్పీ స్థలంలో కొత్తగా 200 పడకల దవాఖాన నిర్మించేందుకు ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవాలని కవిత కోరారు. జగిత్యాల ఏరియా హాస్పిటల్‌కి మంజూరైన కాంపోనెంట్ యూనిట్, డయాలసిస్ సెంటర్ పనులను వేగవంతం చేయాలన్నారు. కోరుట్ల హాస్పిటల్‌ని 100 పడకల ఆస్పత్రిగా మార్చాలని, సబ్ హెల్త్ సెంటర్ భవనాలను ఏర్పాటు చేయాలని కోరారు.కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేశ్‌తివారీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ బుద్ధ ప్రకాశ్, డీఎంఈ రమణి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, షకీల్, గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్, విద్యాసాగర్‌రావు, కరీంనగర్, నిజామాబాద్ కలెక్టర్లు నీతూ కుమారి ప్రసాద్, యోగితా రాణా, నిజామాబాద్, వైద్యవిధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వైద్యాధికారులు పాల్గొన్నారు.

ప్రత్యేకంగా నిధులివ్వండి: ఎంపీ కవిత
ఇతర జిల్లాల మాదిరిగా కాకుండా నిజామాబాద్ జిల్లాలో వైద్యారోగ్యానికి బడ్జెట్ కేటాయింపుల్లో ప్రభు త్వం చొరవ చూపాలని ఎంపీ కవిత కోరారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించే విషయంలో హాస్పిటళ్ల అభివృద్ధి కమిటీల పాత్రపై స్పష్టత ఇవ్వాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నట్లు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యేల సూచనలు, అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.


Connect with us

Latest Updates