ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఎంపి కవిత
మహిళా పోలీస్ ఉద్యోగులకు పురుష ఉద్యోగులతో సమానంగా ప్రభుత్వం అవకాశాలను కల్పిస్తోందని నిజామాబాద్ ఎంపి శ్రీమతి కల్వకుంట్ల కవిత తెలిపారు. శనివారం ఆమె ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ ను నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. కార్పోరేట్ స్థాయిలో రూపొందించిన పోలీస్ స్టేషన్లోని సదుపాయాలను చూశారు. బేగంపేట్, సరూర్ నగర్, ఓల్డ్ సిటీ తదితర ప్రాంతాల మహిళా పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు, షీ టీమ్స్ ఇన్స్పెక్టర్లతో పాటు కానిస్టేబుళ్లతో సమావేశం అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా ఎంపి కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు పోలీస్, రెవిన్యూ శాఖలు అద్దం పడుతాయన్నారు.
హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. లా అండ్ ఆర్డర్, ట్రాపిక్ పోలీసుల పనితీరు మెరుగు పడాల్సి ఉందన్నారు. మహిళలు స్టేషన్ వస్తే ఇబ్బంది పడకుండా చూడాలని కోరారు. మహిళా పోలీసులు మహిళల పట్ల సానుకూల దృక్పథాన్ని కనబరుస్తూ…ప్రెండ్లీగా ఉండాలన్నారు. అన్ని ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు సమస్యలను ఎదుర్కుంటున్నారని, వాటిపై అద్యయనం చేశామని కవిత తెలిపారు. సదుపాయాలను కల్పిస్తామన్నారు. షీ టీమ్స్ పనితీరు బాగుందని ప్రశంసించారు. హైదరాబాద్లో మహిళలకు భరోసా కలుగుతున్నదన్నారు. సిసి కెమెరాల వల్ల నేరస్తులను గుర్తించడమే కాకుండా…..జరిగే అవకాశాలను గుర్తిస్తూ…నిరోదించే అవకాశం కలుగుతున్నదని అన్నారు. పోలీస్ స్టేషన్ల ఆధునీకరణ చేసే పనులు హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నాయన్నారు. త్వరలోనే రాష్ర్ట వ్యాప్తంగా మొదలవుతాయని చెప్పారు. అదనపు పోలీస్ కమిషనర్ స్వాతి లక్రా మాట్లాడుతూ…మహిళా పోలీసుల సమస్యలను తెలుసుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం సంతోషకరమైన విషయమన్నారు. గత ప్రభుత్వాలు మహిళా ఉద్యోగుల బాధలు తెలిసినా….పట్టించుకోలేదన్నారు. 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు కల్పించాలని కోరారు. మహిళా పోలీస్ స్టేషన్ల ను కూడా కార్పోరేట్ స్థాయి స్టేషన్లుగా ఆధునీకరించాలని పలువురు బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జానకి కోరారు. భర్తల వేధింపులపై మహిళలు పిర్యాదు చేస్తున్నారని, కౌన్సిలింగ్ ఇచ్చి పంపినా…మారని వారిపై కేసులు పెడుతున్నామని, జైలు కెళ్లి వచ్చినా…చాలా మంది భర్తలు తమ వేధింపులను మానడం లేదని పలువురు మహిళా ఇన్స్పెక్టర్లు ఎంపి కవిత దృష్టికి తీసుకు వచ్చారు. ఓల్డ్ సిటీ మహిళా పోలీస్ స్టేషన్ అధ్వాన్నంగా ఉందని, పిర్యాదుదారులు కూర్చొనే వీలు కూడా లేదని ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్ లక్ష్మి తెలిపారు. తాము కానిస్టేబుళ్లుగానే రిటైర్ అవుతామేమోనని కానిస్టేబుళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్తానని ఎంపి కవిత హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డిసిపి కమలాసన్ రెడ్డి, ఆబిడ్స్ ఏసిపి రాఘవేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, పులి యాదగిరి, ఎస్ఐలు నాయుడు, రాంబాబు, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.