Nizamabad MP

మా యువత శిక్షణకు సహకరించండి

-ఆస్ట్రేలియా హైకమిషనర్‌కు టీఆర్‌ఎస్ ఎంపీ కవిత విజ్ఞప్తి
-తెలంగాణకు సహకరించేందుకు రెడీ
-ఆస్ట్రేలియా హైకమిషనర్ హరిందర్‌సిద్ధూ

mp-kavitha-met-australian-high-commissioner01

తెలంగాణ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు సహకరించాలని ఆస్ట్రేలియా హైకమిషనర్ హరిందర్‌సిద్ధూ, కాన్సులేట్ జనరల్ సియోన్ కెల్లీని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కోరారు. నైపుణ్యంలేని ఉద్యోగులతో వివిధ సంస్థలు పడుతున్న ఇబ్బందులు, వారికి నైపుణ్య శిక్షణ ఆవశ్యకతపై వారితో చర్చించారు. గురువారం ఓ హోటల్‌లో వారితో జరిగిన సమావేశంలో కవిత మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటవ్వగానే.. రాష్ట్ర యువతకు నైపుణ్య శిక్షణ అవసరాన్ని గుర్తించి సీఎం కే చంద్రశేఖర్‌రావు టాస్క్ ఏర్పాటుచేశారని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో అంతర్జాతీయ సంస్థల యూనిట్లు ఏర్పాటవుతున్న నేపథ్యంలో వారికి నైపుణ్యం గల సిబ్బంది అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో కేంద్రం ప్రారంభించిన కౌశల్ వికాస్ యోజన కింద తెలంగాణ జాగృతి 17 శిక్షణా కేంద్రాలు ఏర్పాటుచేసిందన్నారు.
వాటిని ఇటీవలే కేంద్రమంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ ప్రారంభించారని ఆమె తెలిపారు. తమ శిక్షణ సంస్థలను కేంద్రమంత్రి ప్రశంసించారన్నారు. శిక్షణ కోసం తెలంగాణ పారిశ్రామిక సమాఖ్యతోనూ ఒప్పందం కుదుర్చుకున్నామని, ఆస్ట్రేలియా పర్యటనలో ఆ దేశ సీరో సంస్థతో శిక్షణ కోసం ఎంవోయూ కుదుర్చుకున్నట్లు తెలిపారు. తెలంగాణకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించేందుకు ఆస్ట్రేలియా సిద్ధమని హరిందర్ సిద్ధూ, కాన్సులేట్ జనరల్ సియోన్ కెల్లీ తెలిపారు. సీరో సంస్థ అంతర్జాతీయ స్థాయి శిక్షణనందిస్తుందన్నారు. ఈ భేటీలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజీవ్‌సాగర్, జాగృతి ఆరోగ్య విభాగం కన్వీనర్ డాక్టర్ ప్రీతీరెడ్డి పాల్గొన్నారు.

తెలంగాణ సంస్కృతంటే ఇష్టం
తెలంగాణ సంస్కృతి తమకు చాలా ఇష్టమని ఆస్ట్రేలియా హైకమిషనర్ హరిందర్ సిద్ధూ, కాన్సులేట్ జనరల్ సియాన్ కెల్లీ చెప్పారు. ఆస్ట్రేలియాలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలకు హాజరుకాలేకపోయామని అన్నారు. హైదరాబాద్ అనగానే చార్మినార్ గుర్తుకు వస్తుందన్నారు. ఎంపీ కవిత వారికి చార్మినార్ జ్ఞాపికను అందజేసి.. చార్మినార్‌వద్ద దొరికే రంగురంగుల మట్టిగాజులను బహూకరించారు.


Connect with us

Latest Updates