వడగళ్లతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎంపి కవిత
ఇటీవల కురిసిన వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత. శనివారం నవీపేట్ మండలం నందిగాంలో నేలమట్టమైన వరి పైరును పరిశీలించారు. మార్గమధ్యలో విరిగిన కరెంటు పోల్స్‌ను…తెగిపడిన తీగెలను చూశారు. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలను కూడా చూశారు. అనంతరం నందిగాం గ్రామ పంచాయతీ ఆవరణలో రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రకృతి విలయానికి రైతన్న కంటపెడుతున్నారని, నిజామాబాద్ జిల్లాలో 10వేల 581 ఎకరాల పంట నష్టం జరిగినట్లు కవిత తెలిపారు. జిల్లాలో బోధన్, బాన్స్వాడ నియోజక వర్గాల్లో పంట నష్టం ఎక్కువగా జరిగిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పసల్ బీమా రైతులకు అనుకున్నరీతిలో ఉపయోగపడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు పదివేల రూపాయలు ఏ మూలకూ సరిపోవని, ఎకరా వరిసాగుకు 18 వేల రూపాయల వరకూ ఖర్చవుతున్నట్లు రైతులు చెబుతున్నారన్నారు. బీమా కంపెనీలు పరిహారం చెల్లించేందుకు కొర్రీలు పెడుతుండటంతో రైతులు మళ్లీ బీమా చేయించుకునేందుకు ముందుకు రావడం లేదన్నారు. మరో వైపు బీమా పరిహారం అందడంలోనూ 8 నెలల సమయం పడుతున్నదని చెప్పారు. పంట చేతికొస్తున్న టైంలో వడగళ్ల వర్షం నోటికాడి బుక్కను లాక్కుందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డితో తాను మాట్లాడానని, వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదికను తయారు చేసిందన్నారు. తెలంగాణలో దాదాపు 25 వేల హెక్టార్లు పంట నష్టం జరిగినట్లు ప్రభుత్వానికి నివేదిక అందిందని కవిత తెలిపారు. రైతుల పేరిట భూమి ఉండడం, రుణాలూ వారికే వస్తున్న నేపథ్యంలో భూములు కౌలుకు తీసుకుని పంటలను సాగు చేస్తున్న కౌలు రైతులు వడగళ్ల వర్షాలతో తీవ్రంగా నష్టపోయారని కవిత వివరించారు. మెదటి పంట ఆదాయం భూమి యజమానికి కౌలు రైతులు చెల్లిస్తుంటారని, రెండో పంట ఆదాయమే కౌలు రైతుకు మిగులుతుందన్నారు. క్షేత్ర స్థాయిలో పంటల నష్టాన్ని పరిశీలించేందుకే తాను నందిగాంకు వచ్చానని కవిత తెలిపారు. కౌలు రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కోరతానని కవిత చెప్పారు.