Nizamabad MP

టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా కవిత

-11 డివిజన్ల కార్మికుల ఏకగ్రీవ తీర్మానం
-అంగీకరించిన కేంద్ర సంఘం
-టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి వెల్లడి

Kalvakuntla Kavitha elected as TBGKS Honourable President

తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షురాలిగా నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను ఎన్నుకున్నట్లు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి ఎం రాజిరెడ్డి తెలిపారు. సింగరేణిలోని 11డివిజన్లకు చెందిన కార్మికులందరం ఏకగీవ్ర తీర్మానం చేయడంతో కేంద్ర నాయకత్వం కూడా సమావేశమై.. ఆమెను గౌరవ అధ్యక్షురాలిగా నియమించుకోవాలని నిర్ణయం తీసుకున్నదని వివరించారు. ఇందుకు ఒప్పుకున్నందుకు కవితకు కృతజ్ఞతలు తెలిపామన్నారు.

కవిత ఎన్నిక విషయం సింగరేణి సీఎండీ, డైరెక్టర్లకు తెలియజేస్తామని శుక్రవారం ఆయన తెలంగాణభవన్‌లో సంఘం అధ్యక్షుడు ఆకునూరి కనకరాజు, నాయకులు ఏనుగు రవీందర్‌రెడ్డి, మేడిపల్లి సంపత్, ఏబూసీ ఆగయ్య, శంకర్‌నాయక్‌తో కలిసి మీడియాకు వివరించారు. తెలంగాణ కోసం సింగరేణి కార్మికులు కూడా ముందుండి పోరాటం చేశారని, రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ తమవంతు పాత్రపోషిస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయనిధికి తమ కార్మికులందరితో చర్చించి ఒక్కరోజు వేతనాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు. కొత్త బావుల తవ్వకాలకు కావాల్సిన పర్యావరణ అనుమతుల కోసం ఎంపీ కవిత పార్లమెంట్‌లో గళం వినిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సకల జనుల సమ్మె కాలంతో వివిధ కారణాలతో సస్పెండ్ అయిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. బొగ్గు బావుల్లోకి వెళ్లి బొగ్గును తవ్వేందుకు శ్రమిస్తున్న కార్మికులకు పన్ను మినహాయింపు ఇవ్వాలన్నారు. సింగరేణి కార్మికులకు స్పెషల్ ఇంక్రిమెంట్, వేజ్‌బోర్డు అమలు, వారసత్వ ఉద్యోగాల సాధన, గహ రుణాలు, కోల్ ఇండియా క్యాడర్ స్కీం, నూతన గదులు, నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు వంటివి సాధిస్తామని చెప్పారు. సింగరేణి కార్మికుల హక్కుల కోసం, సంస్థ ఉద్యోగుల భవిష్యత్తు కోసం సహాయ సహకారాలు అందజేస్తానని, కార్మికులకు అన్నివేళలా అందుబాటులో ఉంటానని కవిత చెప్పినట్లు రాజిరెడ్డి వివరించారు. అంతకుముందు వారు కవితను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.


Connect with us

Latest Updates