Nizamabad MP

కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలి

హామీ మేరకు ఎయిమ్స్‌కు నిధులు కేటాయించాలి లోక్‌సభలో ఎంపీ కవిత

తెలంగాణలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తగిన సహకారాన్ని అందించాలని, గోదావరి నదిపై నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ర్టానికి ఎయిమ్స్ ఇస్తామని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఇచ్చిన హామీ మేరకు నిధులను కేటాయించాలని కోరారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన బకాయిలను కూడా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ద్రవ్యబిల్లుపై చర్చలో భాగంగా లోక్‌సభలో మంగళవారం ఎంపీ కవిత ప్రసంగిస్తూ, కేంద్రం నుంచి తాము ఆశించిన రీతిలో ఆర్థిక సాయం అందలేదని అన్నారు. తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం నుంచి పలు పథకాలకు సంబంధించి బకాయిలు ఉన్నాయని, వాటిని చెల్లించాలని కోరారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికిగాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రూ.450 కోట్లు రావాల్సి ఉన్నదని, దీంతోపాటుగా ఇతర బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినట్టుగానే తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, రానున్న బడ్జెట్‌లో ఎయిమ్స్‌కు నిధుల్ని కేటాయించాలని కోరారు. సభలో ఎంపీ కవిత ఇంకా ఏమన్నారంటే..

Kalvakuntla Kavitha speech on Union Budget 2017-18

నిధులు పెంచాల్సి ఉంది
కొన్ని అంశాల్లో బడ్జెట్ కేటాయింపులను పెంచాల్సిన అవసరం కూడా ఉన్నది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మధ్యాహ్న భోజన పథకం, జాతీయ ఉపాధి హామీ పథకం, పింఛన్లు.. ఇలా కీలకమైన రంగాల్లో బడ్జెట్ కేటాయింపుల్లో పెద్దగా పెరుగుదల కనిపించలేదు. ప్రాధాన్యతా రంగాలైనందువల్ల వీటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు కేంద్రం చెల్లిస్తున్న పింఛను కేవలం రూ. 200 మాత్రమే. మిగిలిన మొత్తాన్ని రాష్ర్టాలు కలిపి లబ్ధిదారులకు అందజేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రూ. 1000 – రూ. 1500 చొప్పున ప్రతినెలా పింఛన్ల రూపంలో చెల్లిస్తున్నది. అందువల్ల కేంద్రం తన వాటాను రూ. 200 నుంచి రూ. 500కు పెంచాలి.

రైతురుణాలు పెంచాలి
రైతాంగానికి రూ. 10 లక్షల కోట్ల మేరకు రుణాలు ఇస్తామని కేంద్రం బడ్జెట్‌లో తెలిపిందని, దీన్ని మరో రూ.రెండు లక్షల కోట్లకు పెంచాలి. రానున్న సంవత్సరంలో 32.6 లక్షల ఇండ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుని బడ్జెట్ కేటాయింపులను రూ.9000 కోట్లు పెంచారు. అయితే రాష్ర్టాలు మాత్రం 24.1 లక్షల ఇండ్లను మాత్రమే నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. కేంద్రం గణాంకాలకు రాష్ర్టాల అంచనాలకు మధ్య 30% తేడా ఉన్నది. ఈ విషయంలో రాష్ర్టాలను పరిగణనలోకి తీసుకుని ప్రణాళికను నిర్దేశించుకోవాలి.

చార్జీల బాదుడుతో డిజిటలా?
డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి కేంద్రం ఒకవైపు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజలు దానివైపు మరలుతున్న సమయంలో జాతీయ, ప్రైవేటు బ్యాంకులు మారకపు చార్జీల రూపంలో అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఆంక్షలు విధిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వీటిని తొలగించాలి.

నోట్లరద్దుతో తెలంగాణకు భారీ నష్టం
నోట్ల రద్దుతో తెలంగాణ ప్రభుత్వానికి రూ.800 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. రియల్ ఎస్టేట్ రంగం కొంతకాలం స్తంభించిపోయింది. రూ. 500 కోట్ల మేరకు స్టాంపు రిజిస్ట్రేషన్ ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయింది. రూ. 250 కోట్లమేర రోడ్డు రవాణా పన్ను రూపంలో నష్టపోయింది. దీనికి తోడు కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన బకాయిలు కూడా విడుదల కాలేదు. ఎయిమ్స్‌ను మంజూరు చేయనున్నట్టు ఇచ్చిన హామీ మేరకు బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలి. ఏపీకి ఇచ్చినట్టుగానే తెలంగాణకు కూడా జాతీయ ప్రాజెక్టును ఇవ్వాలి.

నోట్లరద్దుపై శ్వేతపత్రం ప్రకటించాలి
నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ఆర్థికంగా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. మన దేశంలో పన్నుల వ్యవస్థ 1962 నుంచి కొనసాగుతున్నది. తనిఖీలు-స్వాధీనానికి సంబంధించి ఈ చట్టం ప్రకారం అధికారులు ఎలాంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటి నల్ల చట్టంలో మార్పులు జరగాలి. బడ్జెట్‌లో అమృత్ నగరాలకు పెంచిన రూ.500 కోట్లు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలను తీర్చిదిద్దడానికి ఏమాత్రం సరిపోవు. రాష్ట్రాలకు కేటాయింపులు కూడా తగ్గిపోయాయి. సెస్ పేరుతో, వివిధ సర్‌ఛార్జిల పేరుతో కేంద్రప్రభుత్వం ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేసే రాష్ర్టాలకు నిధులు తగ్గించడం తీవ్ర ప్రభావం చూపుతుంది అని కవిత తెలిపారు.


Connect with us

Latest Updates