Nizamabad MP

జాతీయ వేదికలపై మన కళారూపాలు

- కేంద్రం నుంచి కళాకారులకు పెన్షన్లు వచ్చేలా కృషి చేస్తా
- ప్రపంచ జానపద దినోత్సవం ముగింపు సభలో ఎంపీ కవిత

MP-Kavitha

తెలుగు సాహిత్యాన్ని, చరిత్రను భావితరాలకు అందించేలా సాహితీ ప్రియులు కృషి చేయాలని ఎంపీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో తెలంగాణ కళారూపాల ప్రదర్శనకు తనవంతు కృషి చేస్తానన్నారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ జానపద దినోత్సవం ముగింపు సందర్భంగా తెలంగాణ జానపద జాతర శీర్షికన నిర్వహించిన ఉత్సవాలు సోమవారం సాయంత్రం రవీంధ్రభారతిలో ఘనంగా జరిగాయి. ముగింపు వేడుకల్లో ఎంపీ కవిత ముఖ్య అతిథిగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు, కళలకు పెద్దపీట వేస్తున్నదని అన్నారు.
వందల సంఖ్యలో జానపద కళలు తెలంగాణ సొంతమని ఆమె పేర్కొన్నారు. ఆదరణ లేకున్నా వారసత్వంగా వస్తున్న జానపద కళా రూపాలను కళాకారులు కాపాడుకుంటూ భావితరాలకు అందించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం సాంస్కృతిక సారథి పేరిట అనేక మంది కళాకారులకు ఉద్యోగాలు, వృద్ధ కళాకారులకు పెన్షన్లు అందిస్తూ కళలను ప్రోత్సహిస్తుందన్నారు. కేంద్రం నుంచి కళాకారులకు రావాల్సిన పెన్షన్లను వచ్చేలా తన వంతు కృషి చేస్తానన్నారు. ఆంధ్ర ప్రాంతపు వారి విగ్రహాలు తొలగింపు, వేదికలకు పేర్లను మార్చే అంశంపై అధ్యయనం సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌కు పూర్తి మద్దతుంటుందని కవిత ప్రకటించారు. పాఠ్యాంశాల్లో తెలుగు సాహిత్యం ఉండాలి కానీ గొప్పవారి చరిత్రను తీసివేయడం తగదని ఆంధ్రా ప్రభుత్వానికి ఆమె సూచించారు. కవులు, కళాకారులు గళం విప్పి తెలుగు సాహిత్యానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవాల్సిన అవసరముందన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రదర్శించిన కళారూపాల ప్రదర్శనలను అంతర్జాతీయ పత్రికలు ప్రచురించాయనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

జానపదంపై పరిశోధన జరిపించి కళాకారుల అభ్యున్నతికి కృషి చేస్తానని దేశపతి శ్రీనివాస్ అన్నారు. సమగ్ర ప్రణాళికను రూపొందించి జానపదం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేలా ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. తెలంగాణలో అద్భుతమైన జానపద కళాసంపద దాగి ఉందన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ జాతీయ జానపద ఉత్సవాలు నిర్వహించేందుకు కృషి చేస్తానన్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణచారి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా జానపద కళారూపాలను కళాకారులు ప్రదర్శించి.. ఆహుతుల కరతాలధ్వనులందుకున్నారు.


Connect with us

Latest Updates