ఉగాది పంచాంగం మాదిరిగా నిజామాబాద్ పార్లమెంటు నియోజక వర్గంలో చేసిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఏటా చదివి వినిపిస్తానన్నారు నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత. శుక్రవారం ఆమె నిజామాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల గుండెల్లో గూడుకట్టుకోవడాన్ని కొందరు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. తాను చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చెప్పక పోతే…చేయని పనులను సైతం తమ ఖాతాలో వేసుకునేందుకు కొందరు నేతలు యత్నిస్తున్నారని కవిత విమర్శించారు. గత మూడేళ్లుగా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఎంపిగా తాను చేసిన పనులను కవిత ప్రజలకు మీడియా ద్వారా అంశాల వారీగా వివరించారు.
మిషన్ భగీరథ:
నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో రూ. 2197 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పనులు వేగవంతగా జరుగుతున్నవి. టార్గెట్ పెట్టుకుని నీళ్లిస్తున్నారు. ఆర్మూర్‌లో సిఎం గారు తెలంగాణలోనే మొదటిసారి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే 9 వేల పైచిలుకు నల్లా కనెక్షన్లు ఇచ్చారు. వారం పది రోజుల్లో ఆర్మూర్ పట్టణంలో ఇంటింటికీ నీరు ఇస్తాం.
మిషన్ కాకతీయ:
మిషన్ కాకతీయలో రూ.284 కోట్లు వ్యయం చేసి వందలాది చెరువులకు మరమ్మతులు చేసిన తిరిగి రైతులకు అప్పగించాం. నిజాం సాగర్ ఆధునీకరణకు రూ. 141 కోట్లు వెచ్చించాం. రూ.135 కోట్లతో శ్రీరాం సాగర్‌ను ఆధునీకరించాం. ఎంపిగా పోటీ చేసినప్పుడు ప్రస్తుతం ఉన్న సాగును రెట్టింపు చేస్తామని ప్రజలకు వాగ్ధానం ఇచ్చాను. ప్రస్తుతం 4 లక్షల ఎకరాలు సాగువుతన్నది. ఓ వైపు భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు మరమ్మతులు, మిషన్ కాకతీయతో కొత్త ఆయకట్టు అందుబాటులోకి తేవడం , మూలకు పడిన లిఫ్ట్‌ల మరమ్మతులు చేయడంతో లక్ష్యం నెరవేరింది. లిఫ్ట్‌ల మరమ్మతు కోసం రూ. 64 కోట్లు ఖర్చు చేశాం.
ఆర్ ఆండ్ బి రోడ్లు:
జిల్లా కేంద్రాల నుంచి నియోజక వర్గ కేంద్రాలకు, నియోజక వర్గ కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు రోడ్లను రిపేర్ చేశాం. రూ. 750 కోట్లు ఆర్ అండ్ బి నిధులు తెచ్చుకున్నాం. ఎమ్మెల్యేల సహకారంతో ఈ నిధులు మంజూరయ్యాయి. నేషనల్ హైవేస్ నుంచి రూ. 231 కోట్లు తెచ్చుకున్నాం. గ్రామాల మధ్య లింక్ రోడ్లకు పిఆర్ రోడ్లకు రూ. 240 కోట్లు తెచ్చుకున్నాం.
రైతులకు 9 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను ఇచ్చేందుకు కృషి చేశాం. ఇందుకోసం విద్యుత్ సబ్ స్టేషన్లను పెంచుకోవడం, డిస్ట్రిబ్యూషన్ కోసం కొత్త లైన్లు వేయడం, ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచడం వంటి పనులకు రూ. 141 కోట్లను వ్యయం చేశాం.
రైతులకు రుణమాఫి:
నిజామాబాద్ పార్లమెంటు నియోజక వర్గంలో రూ. 746 కోట్ల రుణమాఫీ చేశాం.1 లక్షా 74 వేల 300 మంది రైతులు లబ్ది పొందారు. వారంలో చివరి విడత రుణమాఫీ పూర్తవుతుంది. ఎర్రజొన్న రైతుల బకాయిలు రూ.11.50 కోట్లను చెల్లించి ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజక వర్గాల రైతులకు లబ్ది చేకూర్చాం.
నిజామాబాద్ పట్టణ సౌకర్యాల కల్పనకు చిత్తశుద్ధితో ముందుకు వెళ్లున్నాం.
2016-17 కోసం నిజామాబాద్ అర్భన్ ఎమ్మెల్యే కోరిక మేరకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రూ. 100 కోట్లను విడుదల చేశారు. ఇక రూ. 231 కోట్లతో నిజామాబాద్ టౌన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులు చేపట్టాం. మరో రూ. 25 కోట్లు కూడా ఇచ్చేందుకు సిఎం కేసిఆర్ అంగీకరించారు.
జిల్లా కేంద్రంలో రోడ్లు బాగా లేవని ప్రజలు బాధ పడుతున్నారు. అండర్ గ్రౌండ్ పనులు పూర్తవగానే 2017-18 నిధులతో నగర సుందరీకరణ పనులు మొదలు పెడతాం.
డబుల్ బెడ్ రూం ఇళ్లు:
నిజామాబాద్ పార్లమెంటు నియోజక వర్గంలో రూ. 325 కోట్లతో డబుల్ బెడ్ రూం ఇళ్ల పనులు చేపట్టాం. నిజామాబాద్ టౌన్లో నాలుగు వేల ఇండ్ల నిర్మాణ పనులు చేపట్టాం. జగిత్యాల పట్టణంలో 4వేల ఇండ్ల పనులు చివరి దశలో ఉన్నాయి.
మద్ధతు ధరలు పసుపు, మిరప పంటలకు మద్ధతు ధరలను కల్పించడంలో కేంద్రం విఫలం అయ్యింది. పసుపు రైతులను ఆదుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాను. పసుపు పార్క్ కోసం 42 ఎకరాలను సేకరించాం. చివరి నిమిషంలో కేంద్రం నిధులు ఇవ్వలేమంటే..సిఎం కేసిఆర్ బాల్కొండలో పసుపు పార్కు కోసం రూ. 30 కోట్లు ఇచ్చారు.
మొదటి రివ్యూ మెడికల్ కాలేజీపైనే..
ఎంపి అయ్యాక మెడికల్ కాలేజీ పైనే మొదటి రివ్యూ చేశాను. రూ. 132 కోట్ల నిధులను మెడికల్ కాలేజి కమ్ హాస్పిటల్ అభివృద్ధి కోసం సిఎం కేసిఆర్ గారు కేటాయించారు. అసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులతో కలసి పనిచేసి…ఆసుపత్రి ప్రమాణాలు పెంచుతూనే మెడికల్ సీట్లు పోకుండా ఎంసిఐతో సంప్రదింపులు జరిపాం.
గోదావరి పుష్కరాలు:
గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాం. రూ. 148 కోట్లతో పుష్కర ఘాట్లు నిర్మించాం. సాంస్కృతిక వైభవంను చాటి చెప్పాం.
సంక్షేమానికి పెద్దపీట:
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది. మెస్ ఛార్జీలను పెంచిన సిఎం 18 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూర్చారు.
మూడు లక్షల మంది ఒంటరి మహిళలకు ఫించన్లు ఇస్తున్నారు. 81 వేల మంది బీడి కార్మికులకు ఫించన్లు ఇస్తున్నారు. తెలంగాణలో ఉండే బీడి కార్మికుల్లో సగం మంది నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోనే ఉంటారు. కళ్యాణ లక్ష్మి పథకంలో వేలాది మందికి లాభం చేకూరింది. పథకం కింద ఇచ్చే డబ్బూ పెరిగింది.
స్వంత మేనిఫెస్టో
ఎంపిగా మేనిఫెస్టోను రూపొందించుకున్నా…ప్రతి ఇంటికి శుద్ధమైన తాగు నీరు అంందించాలని …జిల్లాలో సాగు రెట్టింపు చేయాలని…పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేయాలని, పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైన్ పూర్తి చేయించాలని హామీనిచ్చాను. పార్టీ మేనిఫెస్టోను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇంత వరకు నిజామాబాద్ ఎంపిలయిన వారెవరూ అడగనన్ని సార్లు పసుపు బోర్డు గురించి పార్లమెంటులో అడిగాను. చివరికి ప్రైవేటు మెంబర్ బిల్లును సైతం పెట్టాను. పసుపు బోర్డు ఏర్పాటుకు ఆశావహ దృక్ఫథంతో కృషి చేస్తున్నాను.
చిరకాల స్వప్నం నెరవేరింది..
నిజామాబాద్ కు రైలు రావడం అనేది ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం. ఈ స్వప్నాన్ని సాకారం చేసేందుకు చాలా కష్టపడ్డాను. అప్పటి రైల్వే మంత్రి సదానంద గౌడను 50 సార్లు కలిశాను. దేశంలోని రూ. 60 వేల కోట్ల రూపాయలు వ్యయం అయ్యే పెండింగ్ లైన్లుకు నిధులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ.. నిజామాబాద్ లైన్ ను ప్రయారిటీ లిస్ట్‌లో సదానంద గౌడ చేర్చారు. దీంతో పెద్ద ఎత్తున నిధులు వచ్చాయి. రూ. 329 కోట్లతో రైల్వే పనులు పూర్తి అయ్యాయి. నిజామాబాద్‌కు చేరిన రైలుకు ప్రజలు హర్షాతిరేకాలతో స్వాగతం పలకడం చూసి నాకూ ఆనందం వేసింది.
కొందరు నాయకులు దొంగలు పడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగినట్లు…మూడేండ్ల కిందే లేఖ ఇచ్చానని ఒకాయన, ఇంకొకాయన ఇచ్చింది మా ప్రభుత్వం…మీరు చేసింది ఏమిటని అంటున్నారు…వాజపేయి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ రైల్వే లైన్ పెండింగ్‌లో ఉంది. ఆనాడు ఇచ్చింది రూ. 83 కోట్లు..అదీ ఐదేళ్లలో విదిల్చారు…కేంద్రంలో వేరే ప్రభుత్వం ఉన్నా…ఒక ప్రజాప్రతినిధి వెంట పడితే పనులు ఎలా అవుతయో నిజామాబాద్‌కు రైలు రాకే చెప్పింది.
మన రాష్ట్రంలోనే ఎస్పీవీ సైన్ చేయక ముందే .. వేరే లైన్లకు 50 శాతం రాష్ట్ర నిధులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసింది. నేను నిజామాబాద్‌కు ఒక్క పైసా ఇవ్వవద్దని, రిక్వెస్ట్ చేసయాన, కొట్లాడి అయినా తెచ్చుకుంటానన్నాను. సాధించాం.
బ్రిటీష్ వాళ్ల నుండి గాంధీ గారు స్వాతంత్ర్యం తెస్తే…బ్రిటీష్ రాణి ఎలిజబెత్ ఇండియాకు స్వాతంత్ర్యం ఇచ్చిందనలేం. గాంధీగారు కొట్లాడి తెచ్చారంటాం. ఈ విషయాన్ని బిజెపి నేతలు గుర్తుంచుకోవాలి.
ఇక్కడ గొడుగు పడితే నడవదు
యూపీలో వానపడింది గదా అని …ఇక్కడ గొడుగు పట్టుకుంటే నడవదు. ఇక్కడ గొడుగులు పట్టేవారు మా వాళ్లే…..మీ నైజాన్ని గమనిస్తున్నారన్న విషయాన్ని బిజెపి నేతలు గుర్తుంచుకోవాలి. గల్లీలో ఉండే రాజకీయం గల్లీలో ఉంటాది…
ఆర్మూర్ -ఆదిలాబాద్ లైన్…
రూ. 2800 కోట్లతో ఆర్మూర్ -ఆదిలాబాద్ రైల్వే లైన్‌ను కేసిఆర్ ప్రకటించారు. సిఎం కేసిఆర్ గారు నిజామాబాద్ ప్రజలకు గిఫ్ట్‌గా ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం సమాజం అభివృద్ధికి శాశ్వత పనులు చేస్తున్నది. తెలంగాణ ఫలాలు అందరికీ అందాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం.
పవర్, పూర్ పీపుల్, ప్రాజెక్టులు మా పార్టీ విధానం పవర్ జనరేషన్‌తో ఉద్యోగావకాశాలు పెరుగుతాయి…ప్రాజెక్టులు కడితే రైతాంగం, పూర్ పీపుల్ సంక్షేమం చూసుకుంటే తెలంగాణలోని పేదలు బాగుపడతారు.
నిజాం సాగర్‌కు నీళ్లు రాకుండా అడ్డుపడుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలను, యూపీలో వాన పడితే ఇక్కడ గొడుగుపట్టే ప్రయత్నం చేస్తున్న బిజెపి నేతల నైజాన్ని ప్రజలు చూస్తున్నారు.
టిఆర్ ఎస్ పార్టీ సభ్యత్వాల కోసం ఊళ్లకు ఊళ్లు కదిలి వస్తున్నాయి, చరిత్ర లో కనివినీ ఎరుగని స్పందన ఇది. గులాబి కండువతోనే మాకు మేలు జరుగుతుందని ప్రజలు భావిస్తున్నరు.
మీడియా సమావేశంలో నిజామాబాద్ అర్భన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపతి రెడ్డి, మేయర్ ఆకుల సుజాత, నూతన, ప్రత్యామ్నాయ ఇంధన అభివృద్ధి సంస్థ ఛైర్మన్ అలీం, టిఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, సునిల్ రెడ్డి పాల్గొన్నారు.