Nizamabad MP

గుర్తుకొస్తున్నాయి

►గ్రామాల్లో పర్యటిస్తుంటే నా బాల్యమే గుర్తుకొస్తోంది
►మౌలిక సదుపాయల సమస్య తీవ్రంగా ఉంది
►ప్రజల రుణం తీర్చుకునేందుకే ‘మన ఊరు-మన ఎంపీ’
►ఏటా 40 వేల మందికి శిక్షణిచ్చి ఉపాధి కల్పించే యోచన
►నిజామాబాద్ ఎంపీ కవితతో సాక్షి ఇంటర్వ్యూ..

గ్రామాల్లో నిద్ర చేస్తుంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. మా అమ్మమ్మ ఊరికి పోయినప్పుడు అప్పుడెప్పుడో నిద్రపోయేదాన్ని. మళ్లీ చాలా ఏళ్ల తరవాత గ్రామాల్లో నిద్రపోతున్న. గ్రామాల్లో తిరుగుతూ ప్రజలతో మమేకమై అలసిపోయి పడుకుంటే హాయిగా నిద్రొస్తుంది’’ ‘మన ఊరు-మన ఎంపీ’ పేరుతో జగిత్యాల డివిజన్‌లో గత నాలుగు రోజులుగా విస్తృతంగా పర్యటిస్తూ గ్రామాల్లోనే రాత్రిపూట బస చేస్తున్న నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలివి.
రోజుకు ఐదు గ్రామాల చొప్పున పలు గ్రామాల్లో పర్యటించిన కవిత గురువారం జగిత్యాల నియోజకవర్గం పరిధిలో మన ఊరు-మన ప్రణాళిక తొలిదశ పర్యటన పూర్తయిన సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఎంపీగా తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకే ‘మన ఊరు-మన ఎంపీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానన్నారు. నిత్యం నియోజకవర్గ ప్రజల అభివృద్ధి గురించే ఆలోచిస్తానని చెప్పడంతోపాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే ఈ కార్యక్రమం చేపట్టానన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. వాటిల్లోని ముఖ్యాంశాలిలా ఉన్నాయి.
-సాక్షి ప్రతినిధి, కరీంనగర్

జనంతో మమేకమై తిరగడంలో ఆనందం ఉంది..
పార్లమెంట్ ద్వారా నిజామాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాను. సభలో ఏమాత్రం తప్పుడు సమాచారంతో మాట్లాడినా ప్రివిలేజ్ నోటీస్ ఇస్తారు. అందుకే ప్రసంగించే ముందు సమగ్ర అధ్యయనం చేస్తున్నాను. తొలిసారి ఎంపీగా ఉంటూ అధ్యయనం కోసం పార్లమెంట్ బృందం తరపున ఎక్కువ విదేశీ పర్యటనలు చేసిన వ్యక్తిని నేనే. అయితే ఎన్ని చేసినా క్షేత్రస్థాయిలో జనంతో కలిసి తిరగడంతో వచ్చే ఆనందం ఎక్కడా దొరకదు.

Kalvakuntla Kavitha 01

నియోజకవర్గమంతా పర్యటించడం అసాధ్యమే…
పార్లమెంట్ సభ్యుడి పరిధిలో సగటున 800 గ్రామాలుంటాయి. ఏడాదికి 90 రోజులు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. నెలకు రెండు రోజులు స్టాండింగ్ కమిటీ సమావేశాలుంటాయి. విదేశీ పర్యటనలు అదనం. అట్లాంటప్పుడు ఒక ఎంపీ తన ఐదేళ్ల పదవీకాలంలో అన్ని గ్రామాల్లోని ప్రజలను కలిసి రావడం దాదాపు అసాధ్యమే. అయితే నేనెక్కడున్నా మీ కోసమే ఆలోచిస్తాననే భావన ప్రజల్లో కలగాలనే ఉద్దేశంతోనే ‘మన ఊరు-మన ఎంపీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను.

ఆ మూడు హామీలను వంద శాతం నెరవేరుస్తా
గత ఎన్నికల్లో నేను మూడు హామీలను మాత్రమే ఇచ్చాను. అందులో ఒకటి నిజామాబాద్ వరకు రైల్వేలైను ఏర్పాటు. అందుకోసం రూ.140 కోట్లు కూడా మంజూరయ్యాయి. నా ఐదేళ్ల పదవీ కాలంలోనే రైల్వేలైను పనులను పూర్తి చేస్తా. రెండోది పసుపు బోర్డును ఏర్పాటు చేయించడం. దీనికోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నా. పసుపు బోర్డును ఏర్పాటు చేయిస్తే దేశవ్యాప్తంగా పసుపు రైతులకు లాభం జరుగుతుంది. మూడోది ఇంటింటికీ మంచినీరందిస్తానని హామీ ఇచ్చాను. అదృష్టం కొద్దీ ప్రభుత్వమే వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా ఇంటింటికీ శుద్ధమైన నీరు అందించేందుకు సిద్ధమైనందున ఆ మూడు హామీలను వంద శాతం నెరవేరుస్తాననే నమ్మకముంది.

గల్లీల్లో నడవాలంటే పడవలో పోయినట్లుంది
గ్రామాల్లో ఎటు చూసినా రోడ్లు, మౌలిక సదుపాయాల కొరతే వేధిస్తోంది. నడుస్తుంటే పడవలపై వెళ్లాలా అన్నట్లుగా రోడ్లు తయారయ్యాయి. మౌలిక సదుపాయల కొరత కూడా తీవ్రంగా ఉంది. గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి సమగ్రాభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నా. తొందరగా పనులు చేద్దామని మనకున్న ఆచరణలోకొచ్చే సరికి విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఫైళ్లు కదలాలంటే చాలా సమయం పడుతుంది. మన వ్యవస్థే అట్ల తయారైంది. ఇందులో మార్పు తీసుకురావాల్సిన అవసరముంది.

రోళ్లవాగు పూర్తి చేస్తా
చిన్ననీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తే జిల్లాలో 25 శాతం మేరకు వలసలు తగ్గుతాయి. సాగు విస్తీర్ణం పెరుగుతుంది. సౌదీ వలసలు దాదాపు తగ్గు ముఖం పడతాయి. రోళ్లవాగు ప్రాజెక్టును వీలైనంత తొందరగా పూర్తి చేస్తాం. ఆ ప్రాంతాన్ని పర్యటక కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తా.

తెలంగాణ జాగృతి స్కిల్ డెవలెప్‌మెంట్‌ను స్థాపిస్తా
తెలంగాణలో విద్యార్థులు, యువత, మహిళలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంలో తెలంగాణ జాగృతి పేరుతో స్కిల్ డెవలెప్‌మెంట్ పేరిట ఏటా 40 వేల మందికి శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నాం. 10వ తరగతి నుండి మొదలుకుని ఉన్నత స్థాయి విద్యనభ్యసించిన వారందరికీ కేంద్ర సహకారంతో వివిధ రంగాల్లో శిక్షణ ఇప్పిస్తాం. వివిధ పరిశ్రమలతో పాటు విదేశీ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. ఈ మేరకు విదేశీ అంబాసిడర్లతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మన తెలంగాణ వాళ్లకు స్కిల్ డెవలెప్‌మెంట్‌లో శిక్షణ ఇప్పించడం ద్వారా రెట్టింపు వేతనాలను పొందేలా ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే కార్యాచరణను ప్రకటిస్తాం.


Connect with us

Latest Updates