Nizamabad MP

గ్రామీణ రోడ్ల అభివృద్ధికి నిధుల్ని పెంచండి

పెండింగ్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయండి
-గ్రామీణాభివృద్ధి మంత్రిని కోరిన ఎంపీ కవిత
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్ల అభివృద్ధి కోసం 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం (పీఎంజీఎస్‌వై) కింద అవసరమైనన్ని నిధులు కేటాయించలేదని, ఆ మొత్తాన్ని సవరించాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి చౌదరి బీరేందర్ సింగ్‌ను ఎంపీ కవిత కలిశారు. పీఎంజీఎస్‌వై నిధుల విడుదలకు సంబంధించిన లేఖను ఎంపీ కవిత కేంద్రమంత్రికి అందజేశారు.

ఈ పథకం కింద రాష్ట్రంలోని గ్రామీణ రోడ్లకు రూ.544.34 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా, కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.122 కోట్ల నిధుల్ని మాత్రమే కేటాయించిందని వివరించారు. కేటాయించిన నిధుల్లో కూడా ఇప్పటి వరకు రూ.53కోట్లు మాత్రమే నిధులు విడుదలయ్యాయనే విషయాన్ని ఎంపీ కవిత కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు. పీఎంజీఎస్‌వై పథకం కింద కేటాయించిన మొత్తాన్ని పెంచి, నిధులు వెంటనే విడుదల చేయాలని చౌదరీ బీరేందర్‌సింగ్‌ను కోరారు. సమగ్ర కార్యాచరణ పథకం అమలులో ఉన్న వెనుకబడిన జిల్లాల్లో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద పెండింగ్‌లో ఉన్న 60 బ్రిడ్జిల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అందజేసిందని ఆమె తెలిపారు. ఈ బ్రిడ్జిల నిర్మాణాలకు సంబంధించిన అనుమతులను సాధ్యమైనంత త్వరగా మంజూరు చేయాలని, పనులు ప్రారంభించేలా చూడాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్రసింగ్‌కు ఎంపీ కవిత విజ్ఞప్తి చేశారు.


Connect with us

Latest Updates