Nizamabad MP

ఏడు గంటలు ఎన్నో అంశాలు

-సుదీర్ఘంగా సాగిన విజిలెన్స్ సమావేశం
-సమీక్ష నిర్వహించిన ఎంపీ కల్వకుంట్ల కవిత
-కేంద్ర ప్రభుత్వ పథకాల పురోగతిపై దిశానిర్దేశం
-మంత్రి పోచారం సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భాగస్వామ్యం
కరువు పరిస్థితుల్లో జిల్లాలో నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఉపయోగించుకుంటే ఉపశమనం కలుగుతుందని ఎంపీ కవిత అన్నారు. మంగళవారం నిర్వహించిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఎంపీ చైర్‌పర్సన్ హోదాలో మంగళవారం రోజంతా సాగింది. ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొనకుండా తీసుకునే చర్యల్లో భాగంగా బోర్ల తవ్వకం నిబంధనల ప్రకారం జరుగుతున్నాయా? అని ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్… ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈని ప్రశ్నించారు.

Kalvakuntla Kavitha participated in District Industries review meeting (12-04-16) (3)

జిల్లాలో చాలాప్రాంతాల్లో ప్రజల దాహార్తిని తీర్చిందుకు 500 ఫీట్ల వరకు బోర్లు తవ్వాలని నిర్ణయించినప్పటికీ కేవలం 300 అడుగులు మాత్రమే తవ్వుతున్నారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. భూగర్భ జల శాఖ డిప్యూటీ డైరెక్టర్ సురేందర్ సమాధానం ఇస్తూ.. జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో భూగర్భ జలాలు అట్టడుగుకు చేరుకున్నాయని, 300 అడుగుల వరకే బోర్ల తవ్వకానికి అనుమతిస్తున్నామని చెప్పడంతో ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఎంపీ మాట్లాడుతూ నీటి ఎద్దడి నివారణకు నిధుల కొరతలేదని అన్నారు. నిజామాబాద్ అర్బన్‌కు రూ.2 కోట్ల వరకు కేవలం నీటి సరఫరాకు వెచ్చిస్తున్నామన్నారు. అధికార యంత్రాంగం తాగునీటి ఎద్దడిని నివారించేందుకు తీసుకుంటున్న చర్యలను ఎంపీ ప్రశంసించారు.

స్వచ్ఛభారత్‌పై..
స్వచ్ఛభారత్‌పై సమావేశంలో చర్చించారు. నిజామాబాద్‌కు వచ్చిన నిధుల గురించి ఎంపీ కవిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రూ. 18 కోట్లు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. 2012 సంవతత్సరం నుంచి ఐహెచ్‌ఎల్ పథకం అమలవుతున్నదని, జిల్లాలో 2 లక్షల 15 వేల 20 మరుగుదొడ్ల నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారం డిసెంబరు నెలాఖరు వరకు 100 శాతం ఓడీఎఫ్ జిల్లాగా నిజామాబాద్‌ను ప్రకటించుకోవాలని ఎంపీ అన్నారు.

అధికారుల ఇష్టారాజ్యం..
జిల్లాలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారని, నాణ్యతపై పర్యవేక్షణ చేయడం లేదని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ ఆరోపించారు. పంచాయతీరాజ్ ఎస్‌ఈ సత్యమూర్తి స్పందిస్తూ పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేశామని, పనులు ప్రారంభించాలని కోరామని, జరిమానాకు సైతం సిఫారసు చేశామని తెలిపారు.

మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… కొన్ని ప్రాంతాల్లో వంతెనల నిర్మాణం ఆలస్యం కావడానికి ఆర్థిక భారం సమస్యగా మారిందని అన్నారు. కొందరు కాంగ్రెస్ పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనిచేస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఎంపీ కవిత మాట్లాడుతూ… ఇంజినీరింగ్ అధికారులకు ఒకసారి అవకాశం ఇద్దామని, ఆ తర్వాత కూడా పనులు ప్రారంభించకపోతే విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో చర్చించి చర్యలు తీసుకుందామని అన్నారు.

ఉపాధి హామీపై..
ఉపాధిహామీ పథకం పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఉపాధిహామీ పథకం ద్వారా నిర్వహించే వ్యక్తిగత మరుగుదొడ్లను సకాలంలో పూర్తిచేయాలని, అంగన్‌వాడీ కేంద్రాలు, పంచాయతీ భవనాలు పూర్తిగా శిథిలమయ్యాయని, వాటిని ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకంలో నిర్మాణం చేసుకుంటే కూలీలకు ఉపాధి దొరుకుతుందని, స్థిరాస్తులు ఏర్పడుతాయని ఎంపీ కవిత సూచించారు.

ఎస్సీ సబ్‌ప్లాన్..
ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో కాలనీలు, గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తుండటంతో ఇతర వర్గాలకు చెంది న ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తున్నదని, ఎస్సీ- ఎస్టీలకు మాత్రమే పనిచేస్తున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రి, ఎంపీ తలా ఒక చేయివేసి నిధులు సమకూరుస్తే… సబ్‌ప్లాన్ నిధుల తరహాలోనే ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి చేయవచ్చని బాజిరెడ్డి సూచించారు.

ఆసరా పింఛన్లలో బోగస్‌లపై..
ఆసరా పింఛన్ల వ్యవహారంలో అధికారుల వ్యవహారశైలిని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా ప్రస్తావించారు. డీఆర్డీఏ శాఖ సమీక్షలో భాగంగా గడిచిన ఏడాదికాలంలో 44 వేల బోగస్ పింఛన్లు ఏరివేశామని చెప్పడంతో ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్బన్‌లో ఎవరు అర్హులో, ఎవరు అనర్హులో తెలియకుండానే ఇష్టారాజ్యంగా తొలగించారన్నారు. బీడీ కార్మికుల జీవనభృతిని పంపిణీచేసే విషయంలోనూ గందరగోళం ఉందని అన్నారు. కలెక్టర్ యోగితారాణా… ఆసరా పింఛన్లను కేవలం ఆధార్ సీడింగ్, బ్యాంకు ఖాతాలు, వికలాంగుల ధ్రువీకరణ పత్రాలు, పీఎఫ్ ఉన్నవారికి బీడీ పింఛన్లు మాత్రమే ఇస్తున్నామని అన్నారు. ఎవరైనా అర్హులు ఉంటే తనకు తెలపాలని, పింఛన్లు మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు.

వయోజన విద్య కార్యక్రమంలో పనిచేసే మండల కో- ఆర్డినేటర్లు సక్రమంగా పనిచేయడంలేదని, గ్రామ స్థాయిలో కూడా ఎవరూ విధులు నిర్వర్తించడంలేదని సభ్యులు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. 2011 నుంచి ఈ పథకానికి రూ. 25 కోట్ల నిధులను జిల్లాలో వెచ్చించినప్పటికీ ఫలితాలు అంతగా రాలేదని పార్లమెంటు సభ్యురాలు కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీపీలకే వయోజనవిద్య పర్యవేక్షణ అధికారం ఉందని, కాని సర్పంచులతోనే సం తకాలు చేయించుకొని వారు ఉడాయిస్తున్నారని సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ వీజీగౌడ్ కోరారు. దీనిపై ఎంపీ కవిత స్పందించారు. కో- ఆర్డినేటర్ల ను తొలగించుకుంటే పోతే ఎవరూ మిగలరని… ముందుకు వారితో పనిచేయించ గలగాలని అన్నారు.

పార్లమెంటు సభ్యులు సంసద్ ఆదర్శ్ గ్రామయోజన పథకం కింద దత్తత తీసుకున్న కందకుర్తి, కౌలాస్ గ్రామాల్లో వయోజనవిద్య అద్భుతంగా సాగుతుందన్నారు. అదే తరహాల్లో అన్ని గ్రామాల్లో ప్రజాప్రతినిధులు పర్యవేక్షణచేసి వయోజనవిద్యను గాడిలో పెట్టాలని సూచించారు.

ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ ప్రభాకర్… విద్యుత్ సరఫరా తీరును, కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తే నిధుల్లో తీవ్ర కోత విధించారని, ఎంపీ కవిత ఈ విషయంలో చొరవ తీసుకోవాలని అన్నారు. ఎన్‌పీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో కూడా ఇదే తరహా పరిస్థితి ఉన్నదని, నిధుల్లో విపరీతమైన కోత పడిందని తెలిపారు.

జిల్లా దవాఖానతో పాటు ఏరియా దవాఖానలు, పీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్‌సెంటర్ల పనితీరు, వసతులు, మాతా శిశుమరణాల రేటు, గర్భిణులు, రోగాలు, మందుల సరఫరా, పథకాల అమలుతీరు తదితర అంశాలపై డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ వెంకట్ సమగ్ర వివరాలు వెల్లడించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డాక్టర్ల కొరత తీ వ్రంగా ఉన్నదని, గ్రామాల్లో పనిచేసేందుకు డాక్టర్లు ముందుకు రావటంలేదని ఎంపీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

కొందరు సభ్యులు ఏఎన్‌ఎంల పనితీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లతో ఓసారి సమావేశం నిర్వహించాలని, తాను కూడా ఆ సమావేశానికి హాజరవుతానని ఎంపీ తెలిపారు. మంత్రి పోచారం మాట్లాడుతూ… ఆరోగ్యశ్రీ పథకం అమలుతీరు సక్రమంగా ఉన్నందున మాతా, శిశు మరణాల రేటు తగ్గిందని వివరించారు. ప్రైవేటు డాక్టర్లను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు.

జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, బిగాల గణేష్‌గుప్తా, హన్మంత్ షింధే, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, జేసీ రవీందర్‌రెడ్డి, అదనపు జేసీ రాజారాం, కమిటీ సభ్యులు, అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు ఈ చర్చలో భాగస్వాములయ్యారు.
సమావేశం చివరలో రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి కూడా హాజరయ్యారు. ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించిన తర్వాత వారు సమావేశానికి వచ్చారు. మేయర్ ఆకుల సుజాత కూడా సమీక్షకు హాజరయ్యారు.


Connect with us

Latest Updates