Nizamabad MP

దూరదృష్టితో కేసీఆర్ హరితహారం

-230 కోట్ల మొక్కలతో పర్యావరణానికి ప్రాధాన్యం
-46 వేల చెరువుల బాగు లక్ష్యంగా ప్రభుత్వ ప్రణాళికలు
-బ్రిక్స్ దేశాల మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో ఎంపీ కవిత

Kalvakuntla-Kavitha

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దూరదృష్టితో ఆలోచించి చేపట్టిన కార్యక్రమం తెలంగాణకు హరితహారమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఐదేండ్లలో 230 కోట్ల మొక్కలు నాటే మహాయజ్ఞం తెలంగాణలో దిగ్విజయంగా కొనసాగుతున్నదని చెప్పారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో బ్రిక్స్ దేశాల మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో రెండోరోజయిన ఆదివారం పర్యావరణంలో వస్తున్న మార్పులు, సభ్య దేశాలు తీసుకోవాల్సిన చర్యలు అంశంపై ఆమె ప్రసంగించారు.

ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాల గురించి వివరించారు. 230 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం రూ.1300 కోట్లు వెచ్చిస్తున్నదని, ఈ హరితహారం కార్యక్రమం మానవ ఇతిహాసంలోనే మూడో అతిపెద్ద ప్రయత్నంగా నిలుస్తున్నదని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 22 శాతం అడవులను 33 శాతానికి పెంచేందుకు కృషిచేస్తున్నామన్నారు. దేశంలో రైతులు చెరువులను నమ్ముకునే వ్యవసాయం చేస్తున్నందున ఆ దిశగా చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణలో చేపట్టిన మిషన్ కాకతీయ వివరాలను సభ్యదేశాల ప్రతినిధులకు వివరించారు. మిషన్ కాకతీయలో భాగంగా రెండేండ్లలో రూ.6వేల కోట్లు ఖర్చు చేసి 17,400 చెరువుల్లో పూడికతీసి, చెరువు కట్టలు మరమ్మత్తులు చేశామని వెల్లడించారు. మొత్తం ఐదేండ్లలో 46 వేల చెరువులను పునరుద్ధరించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని చెప్పారు. భూగర్భజలాలు పెంచడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివిధ దేశాల ప్రతినిధులు అభినందించారు.


Connect with us

Latest Updates