శాసన సభ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ సమావేశంలో ఎంపి కవిత
దళితుల అభివృద్ధి కొసం బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు నిజామాబాద్ ఎంపి శ్రీమతి కల్వకుంట్ల కవిత. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాలులో శాసన సభ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ ఛైర్మన్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండేను స్పీకర్ మధుసూదనాచారి, శాసన మండలి ఛైర్మన్ స్వామి గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిలతో పాటు ఎంపి కవిత గారు సన్మానించారు.
అనంతరం కవిత మాట్లాడుతూ ప్రతి ఏటా దళితుల అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నారని, ఈ నిధులు ఖర్చు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2013లో 3,600 కోట్లు, 2014లో 7,500 కోట్లు కేటాయిస్తే…3,500 కోట్లే ఖర్చు చేశారని తెలిపారు. గత ఏడాది 4,600 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. ఈ ఏడాది 36వేల కోట్లు కేటాయించారని, ఈ నిధుల్లో ఎక్కువ శాతం ఖర్చు అయ్యేలా చూడాల్సిన బాధ్యత కమిటీపై ఉందని కవిత అన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా వ్యక్తిగతంగా అభివృద్ధి చేస్తూనే…ఔత్సాహిక దళితులను వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దాలని కోరారు. విద్యారంగంలో దళితులు కేవలం 5 శాతమేనన్నారు. బాలికా విద్యను ప్రోత్సహించాలన్నారు. సమాజంలో ఇంకా కుల వివక్ష ఉందని, దీన్ని రూపుమాపేందుకు భాగ్యరెడ్డి వర్మను స్పూర్తిగా తీసుకుని పనిచేయాలని కవిత కోరారు. కమిటీ ఛైర్మన్ షిండే మాట్లాడుతూ…ముఖ్యమంత్రి కేసిఆర్ దళితుల అభివృద్ధికి ప్రణాళికాయుతంగా పనిచేస్తున్నారని, ఆయన ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన సిఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో సోషల్ వెల్ఫేర్ ఉన్నతాధికారులు మహేశ్ దత్ ఎక్కా, డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, ఎం.వి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.