Nizamabad MP

బతుకమ్మ సంబురాలకు రండి

-కేంద్ర పర్యాటక మంత్రికి ఎంపీ కవిత ఆహ్వానం
-సానుకూలంగా స్పందించిన మంత్రి మహేశ్ శర్మ
-పర్యాటక ప్రాధాన్య అంశాలపై మంత్రికి వివరించిన ఎంపీ

Kalvakuntla Kavitha called on union minister for tourism Mahesh sharma

రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకొనే బతుకమ్మ సంబురాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం విస్తృత చర్యలు తీసుకుంటున్నది. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన ఈ పండుగకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నది. అందులో భాగంగా తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత మంగళవారం ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేశ్ శర్మతో భేటీ అయ్యారు. బతుకమ్మ పండుగ విశిష్టతను మంత్రికి వివరించి.. సంబురాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఢిల్లీలోని అన్ని దేశాల దౌత్య కార్యాలయ అధికారులను కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఎంపీ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన మంత్రి మహేశ్ శర్మ.. తప్పక వస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందన్నారు. ఎంపీ కవిత మాట్లాడుతూ.. బతుకమ్మ సంబురాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి కృషి జరుగుతున్నదని తెలిపారు. రాష్ట్రంలోని చారిత్రక ప్రాశస్త్యమైన అంశాల గురించి కూడా మంత్రికి వివరించినట్లు, పర్యాటక రంగానికి సంబంధించి కూడా విజ్ఞాపనపత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు.

ప్రసాద్‌లో బాసరకు స్థానం కల్పించండి..
ఆధ్యాత్మిక, యాత్రా స్థలాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రసాద్ పథకంలో తెలంగాణ రాష్ట్రంలోని బాసరకు కూడా స్థానం కల్పించాలని కేంద్ర మంత్రిని మహేశ్‌శర్మను ఎంపీ కవిత కోరారు. ఆదిలాబాద్ జిల్లాలోని బాసరలో శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయానికి వివిధ రాష్ర్టాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు అక్షరాభ్యాసం కోసం వస్తూ ఉంటారని తెలిపారు. దేశం మొత్తమ్మీద రెండే ప్రముఖ సరస్వతీ ఆలయాలు ఉన్నాయని, అందులో బాసర ఆలయం కూడా ఒకటని మంత్రికి గుర్తు చేశారు. దీంతోపాటు స్వదేశీ దర్శన్ పర్యాటక పథకంలో భాగంగా చేపట్టిన రామాయణ సర్క్యూట్‌ను తెలంగాణలోని భద్రాచలం వరకు పొడిగించాలని కోరారు. శ్రీరాముడు వనవాసంలో ఉన్న సమయంలో సతీసమేతంగా తెలంగాణలోని భద్రాచలం, పర్ణశాల తదితర ప్రాంతాలను సందర్శించి కొంతకాలం ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయని ఆమె వివరించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రాతియుగం కాలంలో మానవులు నివసించినట్లు అనేక చారిత్రక ఆధారాలు ఇటీవల లభ్యమయ్యాయని, వాటి పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. మెదక్ జిల్లా సిద్దిపేట మండలంలోని పుల్లూరుబండ గ్రామంలో పురావస్తు శాఖ తవ్వకాల్లో బయల్పడిన అంశాలను వివరించారు. ఈ భేటీలో రాష్ట్ర పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం కూడా పాల్గొన్నారు.


Connect with us

Latest Updates