Nizamabad MP

ఏపీవి కక్ష సాధింపు చర్యలు

-ఉద్దేశపూర్వకంగా సీఎం కేసీఆర్‌పై కేసులు పెట్టారు
-ఓటుకు నోటు కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం
-కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఎంపీ కవిత ఫిర్యాదు
-ఏపీ సిట్ దర్యాప్తుపై రాజ్‌నాథ్‌సింగ్ ఆశ్చర్యం
ఓటుకు నోటు కుంభకోణంలో టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర అధికారులపై కక్షసాధింపుచర్యలకు దిగుతున్నదని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఫిర్యాదుచేశారు. ఉద్దేశపూర్వకంగా ఏపీలో కేసీఆర్‌పై అనేక తప్పుడు కేసులు పెట్టి వాటిపై విచారణకు చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేసిందని తెలిపారు.

Kalvakuntla kavitha met Union home minister Rajnath singh

రాజ్‌నాథ్‌సింగ్‌తో కవిత శుక్రవారం సాయంత్రం సమావేశమై రాష్ర్టానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. ఓటుకు నోటు కేసును పక్కదారి పట్టించేందుకే ఫోన్ టాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. ఏపీ సిట్ కోరిన కాల్ డాటాలోని వివరాలు బహిర్గతమైతే దేశ అంతర్గత భద్రతకే ముప్పు ఏర్పడుతుందని తెలిపారు. దాంతో ఏపీ సిట్ దర్యాప్తు గురించి తనకు తెలియదని రాజ్‌నాథ్ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఇతర అధికారులపై కేసులు పెట్టడంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు.

ఓటుకు నోటుపై ఎందుకు మాట్లాడరు?
ఓటుకు నోటు వ్యవహారాన్ని ప్రక్కదారి పట్టిస్తూ కొత్త వివాదాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెరపైకి తెస్తున్నదని కవిత ఆరోపించారు. రాజ్‌నాథ్‌ను కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో టీడీపీ నేతల ప్రమేయంపైన స్పష్టత ఇవ్వకుండా సిట్ పేరుతో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసి తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతున్నదని విమర్శించారు. ఇదే విషయాన్ని రాజ్‌నాథ్‌సింగ్‌కు వివరించానని తెలిపారు. సీఎం కేసీఆర్‌పై సుమారు 80 కేసులు నమోదు చేసిందని గుర్తు చేశారు. టీడీపీ నేతల ఫోన్ సంభాషణలను బహిర్గతం చేయటం మంచిది కాదని మంత్రికి చెప్పినట్లు వెల్లడించారు. డీవోపీటీ నుంచి కూడా అధికారుల పేర్లను, ఇంటర్‌సెప్టర్స్ పేర్లను వెల్లడించాలన్న విజ్ఞప్తి వస్తున్నదని, అయితే వీటిని బైటకు వెల్లడించడం ద్వారా మంచికన్నా చెడు ఎక్కువగా జరుగుతుందని వివరించినట్లు తెలిపారు.

రిషితేశ్వరి కేసుపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి
ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కేంద్ర హోంమంత్రికి కవిత విజ్ఞప్తి చేశారు. రిషితేశ్వరి మృతికి ర్యాగింగే కారణమని వార్తలు వస్తున్నాయని, సీబీఐ దర్యాప్తు జరిపితేనే ఇందులోని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆమె అన్నారు. ఈ కేసుపై ఏపీ సీఎం చంద్రబాబు సమగ్ర దర్యాప్తు జరిపిస్తారన్న నమ్మకం లేదన్నారు. ప్రస్తుత దర్యాప్తుపై యూనివర్సిటీ విద్యార్థులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేయడం పద్ధతి ప్రకారమే జరిగిందని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ఏపీ విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వేతనాలు చెల్లించబోదని ఆమె స్పష్టంచేశారు. తెలంగాణ ప్రాంత ఉద్యోగుల విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం అదేవిధంగా వ్యవహరిస్తున్నదని గుర్తుచేశారు.


Connect with us

Latest Updates