Nizamabad MP

3అంశాలు 3గంటలు

3.35 కోట్ల మొక్కలు నాటాలి
-చెరువు పనుల్లో వేగం పుంజుకోవాలి
- ఖరీఫ్ ప్రారంభానికి ముందే తాగునీటి పైపు లైన్లు వేయాలి
-సమీక్షలో మంత్రి పోచారం,ఎంపీ కల్వకుంట్ల కవిత

Kalvakuntla Kavitha review meeting on Harithaharam in Nizamabad collectorate (1)
పర్యావరణాన్ని పరిరక్షించడానికి చెట్లు పెంచటం, వర్షపు నీటిని నిల్వ చేసుకోవడానికి జలవనరులను సిద్ధం చేసుకోవటం, ఇంటింటికీ సురక్షిత తాగునీటిని సరఫరా చేయడం ప్రభుత్వం ముందున్న ప్రాథమిక, ప్రాధాన్యతలు.. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ మూడు ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాలపై మంగళవారం ప్రగతిభవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాకు మంత్రి పోచారం శ్రీనివా స్‌రెడ్డి, ఎంపీలు కల్వకుంట్ల కవిత, బీబీ పాటిల్, విప్ గంప గోవర్ధన్, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు మూడు గంటల పాటు ఈ మూడు శాఖలపై సమీక్ష చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగితా రాణా అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలకంగా చర్చ జరిగింది. ముచ్చటైన మూడు పథకాల అమలుపై ప్రజా ప్రతినిధులు… అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన హరితహారం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనుల ప్రగతిపై మంగళవారం కలెక్టర్ యోగితారాణా అధ్యక్షతన ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామ పంచాయతీలో 40వేల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని, నర్సరీల్లో మొక్కలు ఉన్నాయని, జూన్ 15నుంచి ప్రారంభించి ఆగస్టు 30వరకు జిల్లావ్యాప్తంగా మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు కలెక్టర్ యోగితారాణా సమావేశం ఆరంభంలో తెలిపారు.

మిషన్ కాకతీయ..
మిషన్ కాకతీయ మొదటి దశలో 87 చెరువుల పనులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని తక్షణమే పూర్తిచేయించి వందశాతం లక్ష్యం సాధించాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కొంతమంది కాంట్రాక్టర్లు సక్రమంగా పనిచేయడంలేదని, జాప్యం చేస్తున్నారని నీటిపారుదల శాఖ ఎస్‌ఈ గంగాధర్ సభ దృష్టికి తీసుకొచ్చారు. పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలని సూచించారు. జుక్కల్ నియోజకవర్గంలో చెరువు పనుల పురోగతి బాగాలేదని సమావేశంలో చర్చకు వచ్చింది. బుధవారం సాయంత్రం నిజాంసాగర్ గెస్ట్‌హౌస్‌లో ఇంజినీర్లు, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించుకుంటామని ఎమ్మెల్యే హన్మంత్‌షిండే మంత్రికి తెలిపారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్… ప్రొటోకాల్ ఉల్లంఘనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జుక్కల్ నియోజకవర్గంలో మిషన్ కాకతీయ చెరువు పనుల ప్రారంభంపై తనకు సమాచారం ఇవ్వడం లేదని అసహనం వ్యక్తంచేశారు.

దీనిపై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు. అధికారులు ప్రొటో కాల్ పాటించాలని, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని, వారి వీలును చూసుకొని హాజరవుతారని అన్నారు. చెరువు పనుల పురోగతి మందగించడానికి కొన్ని కారణాలను ఇంజినీర్లు చెప్పారు. వారిపై కలెక్టర్ యోగితారాణా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు జిల్లాలో సమీక్ష నిర్వహించినపుడు పనులు చేస్తామని హామీ ఇచ్చారని, డెడ్‌లైన్లు పెట్టారని, ఇప్పుడెందుకు సాకులు చెబుతున్నారని కలెక్టర్ నిలదీశారు. మిషన్ కాకతీయ రెండో దశ లో 14చెరువుల పనులకు రీకాల్ చేయాల్సి వస్తుందని, 13పనులకు చీఫ్ ఇంజినీరు నుంచి అనుమతులు రావాల్సి ఉందని ఎస్‌ఈ గంగాధర్ తెలిపారు.

మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ… నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, లోకల్ ఇసుక, మహారాష్ట్ర సిమెంటును ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దని హెచ్చరించారు. నాణ్యతతో పనులు చేయించకుంటే ఇంజినీర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు.కాళేశ్వరం ఎత్తి పోతల పథకం పరిధిలోకి రాని భూములకు నీటి వసతి కల్పించేందుకు చేపట్టాల్సిన పనుల గుర్తింపునకు ఏజెన్సీలతో సర్వే చేయిస్తున్నట్లు తెలిపారు. మొదటి దశలో రూ. 234 కోట్లతో, రెండో దశలో రూ. 227 కోట్లను చెరువుల పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నిజాంసాగర్ కాలువల డిస్ట్రిబ్యూటరీలకు రూ.115 కోట్లు మంజూరు చేయిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

మిషన్ భగీరథ..
ప్రతి ఇంటికి సురక్షిత నీటిని అందించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోనే రూ.4 వేల కోట్లతో మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులు చేయిస్తున్నట్లు తెలిపారు. రూ. 41.11 కోట్లతో జలాల్‌పూర్ వద్ద నిర్మిస్తున్న ఇంటెక్‌వెల్ పనుల్లో ఎక్కువ మంది మ్యాన్‌పవర్‌ను వినియోగించాలని సూచించారు. శ్రీరాంసాగర్ నుంచి నీటిని తరలించేందుకు రూ. 1,350 కోట్లు, సింగూరు నుంచి నీటిని తరలించేందుకు రూ. 1,300 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్లు మంత్రి పోచారం, ఎంపీ కవితలు తెలిపారు.

జిల్లాలోని 1,645 ఆవాసాలకు సురక్షిత తాగునీటిని అందిస్తామని, జూన్30 నాటికి 121 గ్రామాలకు, డిసెంబరు నాటికి మరో 148 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తామన్నారు. పంట పొలాల నుంచి వెళ్లే పైపులైన్లను ముందస్తుగా వేయాలని అధికారులకు సూచించారు. ఎంపీ కవిత మాట్లాడుతూ… మిషన్ భగీరథ పనుల్లో కొందరు కాంట్రాక్టర్లు, అధికారులు అలసత్వం వహిస్తున్నారని, అది మంచిదికాదని హెచ్చరించారు. శ్రీరాంసాగర్‌ ఇంటెక్‌వెల్ పనులు చేసే కంపెనీ ప్రతినిధులు సమావేశానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఎస్‌ఈ ప్రసాద్‌రెడ్డితోపాటు పబ్లిక్ హెల్త్ ఈఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం సమీక్షలో కట్టుబడిన మాట పై అధికారులు నిలబడకపోవటం మంచి పద్ధతి కాదని అన్నారు. 2017 డిసెంబరు నాటికి మొత్తం పనులు పూర్తిచేయిస్తామని ఎస్‌ఈ ప్రసాద్‌రెడ్డి ప్రజాప్రతినిధులకు హామీ ఇచ్చారు. మిషన్ భగీరథ పైపులైన్ల నిర్మాణానికి అవసరమైన 43.73 ఎకరాల భూమికి ప్రతిపాదనలు ఇవ్వగా 42.22 ఎకరాలు సేకరించి అప్పగించినట్లు కలెక్టర్ తెలిపారు. 2.65 ఎకరాల ప్రైవేటు భూమికి ప్రతిపాదనలు ఇస్తే, రెండు ఎకరాలు సేకరించి అప్పగించినట్లు తెలిపారు.

పైపులైన్లు ఇతర అవసరాలకు 36 హెక్టార్ల భూమిని అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద సేకరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 36 రైల్వే క్రాసింగుల ద్వారా పైపులైను వెళ్తున్నదని, రైల్వే అధికారులతో కలిసి సంయుక్త సర్వే చేయించినట్లు కలెక్టర్ తెలిపారు. హైవేలకు సంబంధించిన 34, ఆర్‌అండ్‌బీ 451, పంచాయతీరాజ్ 748 , సాగునీటి కాలువలకు సంబంధించిన 206 క్రాసింగులు ఉన్నాయని, వాటిపై సంయుక్త తనిఖీలు పూర్తిచేసినట్లు కలెక్టర్ యోగితారాణా వివరించారు.

అడవులకు పూర్వ వైభవం రావాలి : ఎంపీ కవిత
ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. జాతీయ సగటు ప్రకారం చూస్తే జిల్లాలో 21.46 శాతం అడవులు ఉన్నాయని, తెలంగాణ సగటు ప్రకారం చూస్తే 24శాతం అడవి విస్తీర్ణం ఉందన్నారు. దీనిని 35శాతానికి పెంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పలుచబడిన అటవీ భూముల్లో మొక్కలు నాటడం చాలా ముఖ్యమన్నారు. కామారెడ్డి నుంచి నిజామాబాద్‌కు వస్తుంటే, నిజామాబాద్ నుంచి ఆర్మూర్‌కు వెళ్తుంటే, అటవీ భూములు ఖాళీగా కనిపిస్తున్నాయన్నారు. కామారెడ్డి డీఎఫ్‌వో పరిధిలో 94 వేల ఎకరాలు, నిజామాబాద్ డీఎఫ్‌వో పరిధిలో 77వేల ఎకరాల భూములు ఉన్నాయని, హరితహారంతో పూర్వవైభవం రావాలని ఆకాంక్షించారు.

200 కిలోమీటర్ల రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడానికి ఆర్‌అండ్‌బీ నుంచి క్లియరెన్సు వచ్చిందని, 2.35కోట్ల మొక్కలకు రిజిస్ట్రేషన్ చేశామని సోషల్ ఫారెస్టు డీఎఫ్‌వో తెలిపారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధ్దన్ మాట్లాడుతూ… తన నియోజకవర్గంలో అటవీ భూములు చాలావరకు ఖాళీగా ఉన్నాయని, వాటిలో ఎందుకు మొక్కలు నాటడంలేదని అటవీ అధికారులను ప్రశ్నించారు. సిర్నాపల్లి ఫారెస్టులో మొక్కలు నాటాలని కామారెడ్డి డీఎఫ్‌వోను ఆదేశించారు. డిచ్‌పల్లి నుంచి నిజామాబాద్‌కు వచ్చే జాతీయ రహదారిలో డివైడర్ విస్తీర్ణం పెంచాలని, పెద్ద పెద్ద మొక్కలు నాటాలని ఆదేశించానని, దాని పురోగతి ఎంతవరకు వచ్చిందని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈని అడిగే ప్రయత్నం చేశారు. కానీ ఆర్‌అండ్‌బీ అధికారులు సమావేశానికి హాజరుకాలేదు.ఆర్‌అండ్‌బీ అధికారులతో సమన్వయం చేసుకొని మొక్కలు నాటాలని అటవీ అధికారులకు ఎంపీ కవిత సూచించారు. మిషన్ కాకతీయలో పునరుద్ధరించిన చెరువుల కట్టలపై మొక్కలు నాటుతున్నట్లు డీఎఫ్‌వో తెలిపారు. 399 కిలోమీటర్ల పొడవును గుర్తించామని, 11 లక్షల మొక్కలు నాటుతామని తెలిపారు. చెరువుల ట్రెంచ్ కటింగ్ అంశం చర్చకు వచ్చింది. ప్రతి చెరువుకు ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించామని,శిఖం భూములు పూర్తిగా ప్రభుత్వ భూములేనని, ట్రెంచ్ కటింగ్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని జేసీ రవీందర్‌రెడ్డి అన్నారు.

రెవెన్యూ అధికారులు, ఫారెస్టు అధికారుల మధ్య సమన్వయంలేదని, రెవెన్యూ అధికారులు ఇబ్బందులు సృష్టిస్తున్నారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. సమగ్ర సర్వే చేయించి సరిహద్దులు నిర్ణయించాలని కోరారు. ఇక కొన్ని చెరువు పనులను చేయకుండా పట్టాదారులు, ఆక్రమణదారులు అడ్డుపడుతున్నారనే అంశం చర్చకు వచ్చింది. దీనిపై ఎంపీ కవిత ఓ సలహా ఇచ్చారు. మెట్‌పల్లి ప్రాంతంలో సమస్యాత్మకంగా ఉన్న చెరువులను పోలీసులకు దత్తత ఇచ్చామని, ఇక్కడ అలాంటి ప్రయోగం చేయాలని సూచించారు. ఎమ్మెల్సీ భూపతిరెడ్డి మాట్లాడుతూ.. మొక్కలు సంరక్షణకు అటవీశాఖ నుంచి ట్రీగార్డులు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తంచేశారు.

మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేయడానికి స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించాలని ఎంపీ సూచించారు. ఇందల్వాయి నుంచి ధర్పల్లి వరకు చేపడుతున్న రోడ్డు నిర్మాణంలో రెండున్నర కిలోమీటర్లు నిలిచిపోయిందని, అటవీ శాఖ అధికారులు అభ్యంతరం తెలుపుతున్నారని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు. ఒక కిలోమీటరుకు సమస్య లేదని, మిగిలిన ఒకటిన్నర కిలోమీటర్ల వ్యత్యాసంలో 87 చెట్లు పోతున్నాయని డీఎఫ్‌వో తెలిపారు.

రోడ్డు సక్రమంగా లేకపోవటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, తక్షణమే ఫారెస్టు క్లియరెన్సు ఇవ్వాలని మంత్రి పోచారం, ఎమ్మెల్యే బాజిరెడ్డి అధికారులను ఆదేశించారు. నిజాంసాగర్ నుంచి నర్సింగరావు పల్లి వరకు మంజూరైన రోడ్డు పనులను అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని జడ్పీ ఛైర్మన్ దఫేదార్ రాజు సమావేశం దృష్టికి తెచ్చారు. ఎక్కడా ఫారెస్టు క్లియరెన్సు కోసం సతాయించవద్దని ప్రజాప్రతినిధులు ఆదేశించారు.


Connect with us

Latest Updates