Nizamabad MP

పసుపు బోర్డు కోసం మద్దతు కూడగడతా

దేశంలోనే అత్యధికంగా పసుపు సాగుచేసే తెలంగాణలోనే పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఏడు రాష్ర్టాల ముఖ్యమంత్రుల మద్దతు కూడగడతానని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.

Kalvakuntla Kavitha press meet in Armoor

ఆర్మూర్ పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి ఆమె మాట్లాడారు. పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేసినా రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. తెలంగాణలోనే ఏర్పాటు చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశామన్నారు. ఇందులో భాగంగానే ఇటీవలే మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి పసుపు బోర్డుకు మద్దతు తెలుపాలని కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.

పసుపు సాగు చేసే మరో ఏడు రాష్ర్టాల ముఖ్యమంత్రులను కలిసి మద్దతు కూడగడతానని స్పష్టం చేశారు. నీటి ఎద్దడి నివారణ కోసం మహారాష్ట్రలోని డ్యామ్‌లను ఎత్తి నీటిని విడుదల చేయాలని ఆ రాష్ట్ర సీఎంను కోరామన్నారు. దీని ద్వారా నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలోని పట్టణాల్లో తాగునీటి ఎద్దడిని తీర్చనున్నట్లు వివరించామన్నారు. ఆయన నుంచి సానుకూల స్పందన లభించిందని తెలిపారు. కొత్త మద్యం పాలసీలో చీప్ లిక్కర్‌పై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వచ్చిందన్నారు. ఎల్లవేళలా ప్రజలపక్షాన నిలిచే సీఎం వారి ఆకాంక్షను గౌరవించి మద్యం పాలసీని రద్దు చేశారని, అందరికీ ఆమోదయోగ్యమైన పాలసీని ప్రవేశపెట్టనున్నారని స్పష్టం చేశారు. ఆరోగ్యానికి కీడు తలపెట్టే మద్యం తాగవద్దని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన వాటర్ స్కీం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు.

పనులు ఇలాగే జరిగితే వచ్చే ఎండాకాలం ఆర్మూర్ పట్టణ ప్రజలకు నీటి ఎద్దడి ఉండబోదని కవిత భరోసా ఇచ్చారు. కాంట్రాక్టర్ ప్రతినెలా నిర్ణయించిన విధంగా పనులు పూర్తిచేయని పక్షంలో జరిమానా విధిస్తామన్నారు. ఎప్పటికప్పుడు నీటి పథకం పనులను పర్యవేక్షించి, తొలి వాటర్ గ్రిడ్ నీటిని ఆర్మూర్ నుంచే అందిస్తామని తెలిపారు. ఆర్మూర్ సెంటిమెంట్ నియోజకవర్గమని, నాడు తొలి టిక్కెట్‌ను జీవన్‌రెడ్డికి కేసీఆర్ ప్రకటించారన్నారు. ఆర్మూర్‌ను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడానికి జరుగుతున్న కృషికి తన పూర్తి మద్దతు ఉంటుందన్నారు. సీఆర్‌ఎఫ్ నుంచి ఆర్మూర్‌లో నీటి పనుల కోసం రూ.20 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. పట్టణంలో అంబేద్కర్ భవన నిర్మాణం కోసం తన ఎంపీ కోటా నుంచి రూ.25 లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పారు. పట్టణంలోని ప్రతి ఇంటికి ఒక మొక్క నాటే విధంగా హరితహారం కార్యక్రమాన్ని కొనసాగించాలని కవిత పిలుపునిచ్చారు. సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ స్వాతిసింగ్, వైస్ చైర్మన్ మోత్కూరి లింగాగౌడ్, ఎంపీపీ పోతు నర్స య్య, జడ్పీటీసీ సాందన్న తదితరులు పాల్గొన్నారు.


Connect with us

Latest Updates